మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపు
చంపుతామంటూ ఆగంతకుల లేఖ.. జడ్జి ఇంటి వద్ద భద్రత పెంపు
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒకరైన జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో జడ్జి ఇంటి వెనుక ద్వారం గుండా ఆగంతకులు బెదిరింపు లేఖను వదిలివెళ్లారు. జడ్జిని చంపుతామంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు జస్టిస్ మిశ్రా ఇంటి వద్ద పోలీసుబలగాలను పెంచి భద్రత కట్టుదిట్టం చేశారు.
అక్కడ పారామిలటరీ బలగాలనూ మోహరించి, మరిన్ని సీసీటీవీలను ఏర్పాటు చేశారు. తనిఖీలూ చేపట్టారు. ఉగ్రవాద నిరోధక భద్రతా బలగాలు కవాతు నిర్వహించాయి. 1993 ముంబై బాంబుదాడుల కేసులో మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయడం తెలిసిందే. బెదిరింపు లేఖ వదిలివెళ్లే ముందు జస్టిస్ మిశ్రా ఇంటి వద్ద ఆగంతకులు రెక్కీ చేసి ఉంటారని భావిస్తున్నారు. జడ్జి ఇంటి వెనుక దట్టమైన చెట్లు ఉండడంతో ఆగంతకుల ఛాయాచిత్రాలు సీసీటీవీల్లో రికార్డు కాలేదని చెబుతున్నారు. జస్టిస్ మిశ్రాకు గట్టి భద్రత కల్పించాలని సుప్రీం చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు అధికారులను ఆదేశించారు.