బోను నుంచి తప్పించుకున్న పులి.. జనం దడదడ
మధ్యప్రదేశ్లోని ఇండోర్ జూలో ఒక ఆడపులి తన బోను నుంచి ఉన్నట్టుండి తప్పించుకుని బయటకు రావడంతో జనం ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. అందరూ పరుగులు తీయడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆదివారం కావడంతో వేలాదిమంది ప్రజలు జూకు వచ్చారని, వాళ్లంతా పరుగులు పెట్టడంతో చాలామంది కిందపడి గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పులి ఎక్కడో చీకట్లోకి దూరిపోవడం.. అధికారులు అది ఎక్కడుందోనని వెతుకుతూ కంగారు పడటంతో దాదాపు గంట పాటు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
జూ మొత్తాన్ని ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నించినా, చాలా కుటుంబాలు లోపలే ఇరుక్కుపోయాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే పులి దాడి చేసిందన్న వదంతులు కూడా వ్యాపించడంతో జనం మరింత భయాందోళనలకు గురయ్యారు. పులి ఉన్నట్టుండి తమవైపు దూకిందని.. అయితే అదృష్టవశాత్తు తమకు ఏమీ జరగలేదని ఓ కుటుంబ సభ్యులు తెలిపారు. ఎట్టకేలకు రాత్రి 7.30 గంటల సమయంలో పులి మళ్లీ కనిపించింది. అటవీశాఖ అధికారులు ఒక జీపు సాయంతో దాన్ని మళ్లీ బోనులో పెట్టారు.
జూ బయట జరుగుతున్న పెళ్లి సందర్భంగా పెద్ద శబ్దంతో బ్యాండు మేళం పెట్టారని, ఆ శబ్దం వల్లే జమున (తప్పించుకున్న ఆడ పులి) చిరాకు పడి ఉంటుందని కొందరు జూ అధికారులు చెప్పారు. దానికితోడు కొంతమంది పిల్లలు తరచు దానిపై రాళ్లు వేశారని, ఆ సమయంలో వాళ్లను అపడానికి అక్కడ గార్డులు కూడా ఎవరూ లేరని చెప్పారు.