కాంగ్రెస్ పార్టీ మోసకారి: అఖిలేశ్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ‘ఇండియా’ కూటమిలోని కీలకమైన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ మహా మోసకారి అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గానీ, బీజేపీకి గానీ ఓటేయరాదని ఓటర్లను ఆయన కోరారు. ఈ రెండు పార్టీలు ప్రకటించిన పథకాలు, హామీలు అమలయ్యేవి కావని చెప్పారు.
ఆదివారం టికమ్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘రేషన్ అందనప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయడం? కాంగ్రెస్‌కు కూడా వద్దు. ఆ పార్టీ చాలా మోసకారి. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన అంటోంది’అని అఖిలేశ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీయే కుల ఆధారిత సర్వేను నిలిపివేసింది. మండల్ కమిషన్ సిఫారసులకు కూడా అడ్డుపుల్ల వేసింది. బీజేపీ కూడా అదే దారిలో వెళుతోంది. కులగణన కోసం డిమాండ్లు తీవ్రం కావడంతో కాంగ్రెస్ ముందుకు వచ్చి తాము చేపడతామని చెబుతోంది. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించే బీజేపీ కూడా కుల గణన గురించి మాట్లాడుతోంది’అని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో మహిళలు ముఖ్యంగా ఆదివాసీ, దళిత మహిళలు ఎంతో అన్యాయానికి గురవుతున్నారన్నారు. బీజేపీ నమ్మేది ప్రజాస్వామ్యాన్ని కాదు, లూటీ స్వామ్యాన్ని అని వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ధీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో ప్రతిపక్షాలతో ఏర్పాటైన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఎస్పీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కొన్ని సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ పక్కన బెట్టడంతో పోటీగా కొన్ని సీట్లలో ఎస్పీ సొంతంగా అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ వ్యవహారంలో రెండు పార్టీల మధ్య విభేదాలు ముదిరాయి.