నైట్స్‌లో...రైట్ ట్రాక్స్!
రోజుకు 24 గంటలు. అందులో సుమారు 8 గంటలు నైట్ డ్రెస్సులోనే ఉంటారు అతివలు. అయితే.. హాయిగా నిద్రించడానికి, ఇంటా, బయట సౌకర్యంగా తిరగడానికి నైట్ డ్రెస్‌ల ఎంపిక ఎప్పుడూ అంత ప్రత్యేకంగా ఉండదు. కారణం.. ‘ఇంట్లోనే ఉంటాం, ఎవరికీ కనిపించం..కదా! అలాంటప్పుడు ఏ దుస్తులైతేనేం’ అనుకునేవారే ఎక్కువ. కానీ, రాత్రి వేళ ధరించే దుస్తుల ఎంపిక ఎప్పుడూ రైట్ ట్రాక్‌లో ఉండాలి...
రేపు అనే భవిష్యత్తుకు నేడు అందమైన కల కనాలంటే అలసిన శరీరానికి కంటి నిండా నిద్ర అవసరం. ‘అందుకు పడకగదిని శుభ్రంగా ఉంచి, మెత్తటి పరుపును సరిచేయడమే కాదు, ఒంటిపై ఉన్న వస్త్రానికీ ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటున్నారు నైట్ దుస్తుల తయారీ నిపుణులు. ‘కేవలం నిద్రించే సమయాలలోనే కాకుండా, రోజంతా ధరించే వీలున్న ‘టైమ్‌లెస్’ దుస్తులు నేడు లభిస్తున్నాయి. వీటి ఎంపికలోనే మనదైన ముద్ర కనిపించాలి.
డిజైనర్ స్లీప్ వేర్...
రాత్రి ధరించే దుస్తులకే కొన్ని హంగులను జతచేస్తే విలాసవంతమైన జీవనశైలిని సొంతం చేసుకోవచ్చు. డిజైనర్ ఎంపిక చేసిన ఫ్యాబ్రిక్‌ను కొనుగోలు చేసి, మీ శరీరాకృతికి తగ్గట్టు సౌకర్యంగా దుస్తులను డిజైన్ చేయించుకుంటే సరి! ప్రపంచ ప్రసిద్ధి పొందిన డిజైనర్ ఆర్మానీ రోబ్స్ నైట్ గౌన్లను సౌకర్యంగానూ, స్టైల్‌గానూ రూపొందించి పేరుపొందాడు.
దుస్తుల ఎంపికకు ముందు...
రాత్రి పడుకునేముందు కదలికలకు తగ్గ సౌకర్యవంతమైన దుస్తులనే ఎంచుకోవాలి. ‘నైట్ వేర్’ అంటే శరీరమంతా కప్పి ఉంచేవి అనుకోకూడదు. రాత్రి ధరించే దుస్తులు కూడా ఎదుటివారి ప్రశంసలు అందుకునేలా ఉండాలి.
అదే సమయంలో మీరు నిద్రించే భంగిమలో దుస్తులు(స్లీప్వేర్) ఇంట్లోవారికైనాసరే ఇబ్బంది కలిగించని విధంగానూ ఉండాలి. కళ్లకు, చర్మానికి ఎంచుకున్న ఫ్యాబ్రిక్, స్టైల్ హాయి గొలిపేలా ఉండాలి.
రాత్రి ధరించే దుస్తులు మెత్తని వస్త్రంతో తయారైనవి కావాలనుకుంటారు. వీటిలో కాటన్, సిల్క్, శాటిన్, వెల్వెట్.. దుస్తులు మేలైనవి.
లేత రంగులు, చిన్న ప్రింట్లు కంటికి, మెదడుకు హాయిగొలుపుతాయి. చక్కటి నిద్రకు ఉపకరిస్తాయి.
చాలామంది ఎక్కువ డబ్బును స్లీప్వేర్ మీద ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ఏదో ఒకటిలే అని సరిపెట్టేస్తుంటారు. వేసుకున్న దుస్తుల నాణ్యత, రంగులు, స్టైల్, కొలతలు, ధర.. ఇవన్నీ మెదడుపై ప్రభావాన్ని చూపి నిద్రలేమికి కారణాలు అవ్వచ్చు. అందుకని ఈ అంశాలన్నింటిపైనా దృష్టిపెట్టాలి.
స్లీప్ గౌన్లు...
వేసవిలో చేతులు లేని కురచ గౌన్లు సరైన ఎంపిక. అదే చలికాలంలో పొడవాటి లేదా మోచేతుల వరకు ఉండే చేతులు, ప్యానల్ ఉన్న గౌన్లను ఎంచుకోవచ్చు. నైట్ గౌన్ లేదా కాటన్ నైట్ గౌన్లను లేస్ సరిగ్గా కనిపించేలా వాడాలి.
పర్యావరణ అనుకూలం: నిద్రలేమి సమస్యలు దరిచేరకూడదన్నా, కంటినిండా నిద్ర కావాలన్నా పర్యావరణ అనుకూల దుస్తుల ఎంపిక మేలైనది. చలి, వాన, ఎండ.. కాలాలు ఏవైనా ఎకోఛాయిస్ మేలైన ఎంపిక. రసాయనాల వాడకం లేని నూలు తయారీ వస్త్రాల కోసం సేంద్రియ ఉత్పత్తుల దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి చలిలో వెచ్చదనం, వేడిలో చల్లదనం మేనికి అందిస్తాయి.
వేసవికి ప్రత్యేకం: వేసవిలో ముందు వేడిగా, అర్థరాత్రి దాటాక వాతావరణం చల్లగా మారుతుంది. ఈ కాలం ఏసీ, ఫ్యాన్ల వాడకాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వేసవి రాత్రులలో మేనికి గాలి తగిలే, చమటను పీల్చుకునే వస్త్రాలను ఎంచుకోవాలి. కురచ చొక్కాలు, పొడవాటి ప్యాంట్లు లేదా పైజామాలు సరైన ఎంపిక. చేతులు లేని నైట్ గౌన్లు తేలికగా ఉంటాయి. లెగ్గింగ్స్ టి-షర్ట్ సరిజోడి.
యువతరానికి వైవిధ్యం: ట్రాక్‌సూట్స్ యువతులకు బాగా నప్పుతాయి. లాంగ్ పైజామా, పైన టీ-షర్ట్ లేదా షార్ట్, టీ-షర్ట్ మంచి ఎంపిక. క్రీడల పట్ల ఆసక్తి చూపే అమ్మాయిలు ట్రాక్ ప్యాంట్ ధరిస్తే బాగుంటుంది. ఎక్కువ కుచ్చిళ్లు ఉన్న పైజామా, హుడీస్ ధరించడం మేలు. ఇంటి నుంచి అలా ఆరుబయట తిరిగి రావాలనుకున్నా ఈ తరహా డ్రెస్‌ల మీద నిరభ్యంతరంగా బయటకు వెళ్లిరావచ్చు.
లో దుస్తుల సౌకర్యం: బ్రా, ప్యాంటీస్తో సహా నైట్‌వేర్.. విభిన్న కట్లు, స్టైల్, కలర్స్, మెటీరియ ల్స్, ప్యాటర్న్స్‌లో లభిస్తున్నాయి. కురుచ దుస్తులు ధరించినప్పుడు లో దుస్తులు హైకట్, జి-స్ట్రింగ్స్ ఉండేలా జాగ్రత్తపడాలి. మరీ బిగుతుగా, చమటను పీల్చుకోని లో దుస్తులను ఎంచుకోకూడదు. పైజా మా, నైట్ గౌన్, షార్ట్స్.. ఇలా ఆయా దుస్తులకు అనుగుణంగా లో దుస్తులను ఎంచుకోవాలి.
కమిసోల్స్: పొడవైన ‘యు, వి’ నెక్ మోడల్లో ఉండే కమిసోల్స్ మహిళల కోసం మార్కెట్ నిండా ఉన్నాయి. ఇవి అమ్మాయిలే కాదు మధ్య వయస్కులు కూడా ధరించవచ్చు. ఈ డ్రెస్ బయట తిరగడానికి సౌకర్యవంతంగానూ, నిద్రించడానికి హాయిగానూ ఉంటాయి. వీటిలో శాటిన్, కాటన్, లినెన్.. మెటీరియల్‌లో రకరకాల ప్యాటర్న్స్ లభిస్తున్నాయి.
పైజామాల ఎంపిక: పైజామాలలో మోకాళ్ల వరకు, మడమల వరకు అని రెండు రకాలవి ఎంచుకోవాలి. అప్పుడే సౌకర్యం, వీలునుబట్టి మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. యోగా ప్యాంట్స్, ట్రాక్ సూట్స్ స్టైల్‌గానూ, సౌకర్యంగానూ ఉంటాయి. షాప్‌కి వెళ్లేముందు మీ శరీర కొలతలను చెక్ చేసుకోండి. దీని వల్ల దుస్తుల ఎంపిక సులువు అవుతుంది
కాబోయే అమ్మకు ప్రత్యేకం
మొదటి మూడు నెలలు సాధారణ నైట్ దుస్తులు వాడచ్చు. ఆ తర్వాతి నెలలో శరీరాకృతిలో మార్పులకు త గ్గ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. సిగ్గుపడకుండా తమ శరీరాకృతికి తగిన, సౌకర్యంగా ఉండే నైట్ దుస్తుల ఎంపిక చేసుకోవాలి. సాగే గుణం ఉన్న దుస్తులు మూడు జతల చొప్పున తీసుకోవాలి. సహజసిద్ధమైన రంగులు, దేనితోనైనా మ్యాచ్ చేసుకోదగిన టాప్స్ పొడవుగా ఉన్నవి ఎంచుకోవాలి. దీనివల్ల ఎక్కువ ఖర్చుకాదు. డ్రెస్సులు మరీ తక్కువగా ఉన్నాయనే భావన దరిచేరదు. గర్భవతుల కోసం షాపుల్లో ప్రత్యేకమైన విభాగాలు ఉంటాయి. వాటిలో తమకు అనుగుణమైనవి ఎంచుకోవాలి. పెరుగుతున్న పొట్టను మృదువుగా హత్తుకునేలాంటి దుస్తులు ఉంటే సౌకర్యంగా ఉంటాయి. ఇందుకోసం మీరు ‘ప్రెగ్నెన్సీ మ్యాగజీన్స్’ను చూడవచ్చు. తల్లి సౌకర్యం, సంతోషం గర్భస్థ శిశువు ఎదుగుదలపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.
నిర్వహణ: నిర్మలారెడ్డి