టింటూ ‘పసిడి’ పరుగు
800 మీ.లో స్వర్ణం
♦ భారత్‌కు మూడో స్థానం
♦ ఆసియా అథ్లెటిక్స్
వుహాన్ (చైనా) : ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. ఈ పోటీల చివరిరోజు ఆదివారం భారత్ ఖాతాలో స్వర్ణం, రెండేసి రజత, కాంస్య పతకాలు చేరాయి. ఓవరాల్‌గా భారత్ నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 13 పతకాలతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల 800 మీటర్ల రేసులో టింటూ లూకా 2ని:01.53 సెకన్లలో గమ్యానికి చేరుకొని పసిడి పతకాన్ని సాధించింది.
జావో జింగ్ (చైనా-2ని:03.40 సెకన్లు) రజతం, నిమాలి క్లారాచిగె (శ్రీలంక-2ని:03.94 సెకన్లు) కాంస్య పతకం నెగ్గారు. భారత అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష శిష్యురాలైన టింటూ లూకా ఓ మేజర్ ఈవెంట్లో వ్యక్తిగత స్వర్ణం నెగ్గడం ఇదే ప్రథమం. తాజా ఫలితంతో ఆసియా చాంపియన్ హోదాలో 26 ఏళ్ల టింటూ లూకా వచ్చే ఆగస్టులో బీజింగ్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. మరోవైపు పురుషుల 800 మీటర్ల రేసులో జిన్సన్ జాన్సన్ ఒక నిమిషం 49.69 సెకన్లలో లక్ష్యానికి చేరి భారత్‌కు రజత పతకాన్ని అందించాడు.
పురుషుల 200 మీటర్ల రేసులో ధరమ్‌బీర్ సింగ్, మహిళల 200 మీటర్ల రేసులో శ్రాబణి నందా కాంస్య పతకాలు సాధించారు. ధరమ్‌బీర్ 20.66 సెకన్లలో, శ్రాబణి నందా 23.54 సెకన్లలో రేసులను పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో ధరమ్‌బీర్ గత 15 ఏళ్లుగా 20.73 సెకన్లతో అనిల్ కుమార్ పేరిట ఉన్న జాతీయ రికార్డును చెరిపేశాడు. మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో భారత బృందం పసిడి పతకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. 3ని.33.81 సెకన్లలో గమ్యానికి చేరిన భారత బృందం రజతంతో సరిపెట్టుకుంది.