Tires burning
-
ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు
జగిత్యాల క్రైం: వందమందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఉన్నట్టుండీ ఊడిపోయిన సంఘటనలో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా రాయికల్ ప్రధాన రహదారిపై శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో.. ఒకేసారి రెండు వెనుక టైర్లు ఊడిపోయాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి ఖానాపూర్ వెళ్తోంది.సుమారు 100 మంది ప్రయాణికులున్న బస్సు జగిత్యాల రూరల్ మండలం చల్గల్–మోరపల్లి శివారు చేరగానే.. బస్సు వెనుక కుడివైపు రెండు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురికావడంతో ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు. ఎవరికేమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సును రప్పించి ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. -
ఇంకా ఆరని సెగలు
తుమ్మపాల (అనకాపల్లి): అనకాపల్లి మండలంలో చింతనిప్పుల అగ్రహారం రెవిన్యూ పరిధిలో రేబాక గ్రామాన్ని ఆనుకొని ఉన్న టైర్ల కంపెనీలో మంటల సెగ చెల్లారలేదు. గ్రామంలో సైతం ఆందోళన తగ్గలేదు. మరోవైపు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన వారి కుటుంబీకులు ఆవేదనలో ఉండగా.. యాజమాని అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టైర్ వ్యర్థాలు, కార్టన్ పొడి, లిక్విడ్ వంటి సామగ్రి అగ్ని ప్రమాదానికి గురికావడంతో ఆ వేడి తగ్గకపోగా, ఆ మంటలను ఆపే విషయంలో అధికారుల మధ్య సమన్వయం లోపించింది. కంపెనీ యాజమాన్యం, స్థానిక పంచాయితీ ప్రతినిధులు సహకరిస్తేనే మంటలను అదుపు చేయగలమని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. కంపెనీ చుట్టూ ఉన్న తోటల కారణంగా పెనుగాలులు వీస్తే ఏ క్షణంలో ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ కుప్పలు కుప్పలుగా పడి ఉన్న టైర్లలో అగ్నిని ఆర్పాలంటే జేసీబీ సహాయం అవసరమని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై కంపెనీ నిర్వాహకులు కాని, గ్రామపాలకులు గాని పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు తెలియపరిచేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను కంపెనీ వద్ద ఉంచారు. దీనికి తోడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు సంఘటన స్ధలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమతులపై రాని స్పష్టత: టైర్ల కంపెనీ చింతనిప్పుల అగ్రహారం రెవెన్యూ పరిధిలో ఉన్నందున అనుమతులు తామే ఇచ్చామని, ధ్రువీకరణ పత్రాలు పంచాయతీ కార్యాలయంలో ఉన్నాయని ఆ గ్రామ సర్పంచ్ ముమ్మన పైడిరాజు మంగళవారం చెప్పారు. ఈ ఘటన జరిగి ఒక్క రోజు కూడా పూర్తవ్వకముందే అనుమతులు తాలూకు ధ్రువీకరణ పత్రాలు మాత్రం లేవని బుధవారం తెలిపారు. ఈ పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. రాజమండ్రిలో కంపెనీ యజమాని? ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నప్పటికీ కంపెనీ యజమాని ఆచూకీ తెలియలేదు. అతని కోసం పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. సూపర్వైజర్ గణేష్‌తో యాజమాని కిషోర్ సంభాషణను ట్యాప్ చేసిన పోలీసులు మంగళవారం రాజమండ్రిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే గణేష్‌తో బయలుదేరి రెక్కీ నిర్వహించారు. విషయం తెలుసుకున్న యాజమాని అక్కడ నుంచి కూడా పరారైనట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్ధితుల్లోను యాజమానిని పట్టుకుని క్షతగాత్రులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావించి ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కాలుష్య కోరల్లో పల్లెలు
కొండాపూర్, న్యూస్‌లైన్: పచ్చని పల్లెలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. రాత్రివేళలో పరిశ్రమలు యథేచ్ఛగా విషవాయువులను విడుదల చేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని గుంతపల్లి చౌరస్తాలో రెండు మినీ పరిశ్రమలున్నాయి. రెండు నెలల క్రితం మరో పరిశ్రమ కూడా ప్రారంభమైంది. మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు రాత్రి వేళలో యథేచ్ఛగా విషవాయువులను విడుదల చేస్తున్నాయి. పాడైపోయిన వాహనాల టైర్లను అధిక మోతాదులో రాత్రింబవళ్లు కాల్చి అందులోని రసాయనాలను వెలికితీస్తారు. రసాయనాలను ట్యాంకర్లలో హైదరాబాద్‌కు తరలిస్తారు. పరిశ్రమల యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా పరిశ్రమలో పనిచేసే కార్మికులను సైతం పట్టించుకోవడం లేదు. వారు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా టైర్లను కాల్చగా ఏర్పడిన బుడిద పంటపొలాల్లో చేరడంతో పంటలు సైతం దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గుంతపల్లి, తేర్పోల్, గొల్లపల్లి, ఎదురుగూడెం గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగించే వాహనదారులు పరిశ్రమలు వదిలే విషవాయువులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమల తీరును నిరసిస్తూ గతంలో పరిశ్రమల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. యువజన సంఘాల నాయకులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. గ్రీవెన్స్‌డేలో భాగంగా కలెక్టర్ దృష్టికి విషవాయువుల పరిశ్రమలను మూసివేయాలని ఫిర్యాదు చేసినా స్పందన లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ పరిశ్రమల యాజమాన్యాలను నిలదీస్తే దిక్కున్నచోట చెప్పుకోమని దురుసుగా మాట్లాడుతున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలుష్య కోరల నుంచి గ్రామాలను కాపాడాని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.