పోలీసుల అదుపులో కిడ్నాపర్లు
డోన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఓ యువకున్ని ఎత్తుకెళ్లి రూ. 15 లక్షలు డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతున్న ఓ ముఠాను శుక్రవారం డోన్ పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి ఆ యువకునికి విముక్తి కల్పించి తండ్రికి అప్పగించారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని దొరపల్లెకు చెందిన ఎల్లప్ప కుమారుడు మధు హైదరాబాద్‌లో చిరువ్యాపారం చేసుకుంటూ గత నెల 20వతేదీన కిడ్నాప్‌కు గురయ్యాడు. అదే సమయంలో అతని వెంట ఉన్న మరో బాలుడు జంగాల నాగరాజు తప్పించుకున్నాడు. మధును ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు రూ. 15లక్షలు ఇస్తే వదిలిపెడతామని ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో తండ్రి ఎల్లప్ప, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు డబ్బులు డిమాండ్ చేసేందుకు కిడ్నాపర్లు వాడిన సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసును చేధించారు.
డోన్‌కు చెందిన జంగాల ఇప్పి నాగశెట్టి, జంగాల ఈర్లపల్లి చంద్రయ్య, దేవనకొండ మండలం పి.కోటకొండకు చెందిన బోయ పంపన్న, బోయ గడివేముల వెంకటేష్, బోయ కోలంట్ల రామాంజనేయులు, బోయ గిడ్డయ్య, కమ్మరికౌలుట్లయ్య దొరపల్లె క్రాస్‌రోడ్డు వద్ద 44వ నెంబర్జాతీయ రహదారిపై సఫారీ వాహనంలో సంచరిస్తుండగా అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న సీఐ డేగలప్రభాకర్, ఎస్ఐలు మోహన్‌రెడ్డి, సతీష్, సిబ్బందిని అభినందించారు.