tirupathi Airport
-
AP: కోలుకుంటున్న విమానయానం
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి రాష్ట్ర విమానయాన రంగం వేగంగా కోలుకుంటోంది. కోవిడ్ తొలి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో గణనీయమైన వృద్ధిరేటును నమోదు చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)తో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్యలో 375.68 శాతం వృద్ధి నమోదైంది. విమాన సర్వీసుల సంఖ్యలో 271 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం ఆరు విమానాశ్రయాలు ఉండగా.. గతేడాది మొదటి మూడు నెలల్లో 1,933 సర్వీసులు నడిస్తే.. ఈ ఏడాది ఆ సంఖ్య 7,174కు చేరింది. ఇదే సమయంలో ప్రయాణికుల సంఖ్య 89,758 నుంచి 4,26,969కి చేరింది. తిరుపతికి పెరిగిన డిమాండ్ తిరుమలలో దర్శనాలకు అనుమతించడంతో తిరుపతి విమాన సర్వీసులకు డిమాండ్ భారీగా పెరిగింది. గతేడాదితో మొదటి మూడు నెలలతో పోలిస్తే ఈ ఏడాది విమాన సర్వీసుల్లో 530 శాతం, ప్రయాణికుల సంఖ్యలో 690 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది మూడు నెలల్లో తిరుపతికి కేవలం 186 సర్వీసులు మాత్రమే నడవగా.. ఈ సారి ఆ సంఖ్య 1,172కు చేరుకుంది. ప్రయాణికుల సంఖ్య 7,272 నుంచి ఏకంగా 61,079కి పెరిగింది. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం నుంచి కూడా సర్వీసులు బాగానే నడుస్తున్నాయి. ఈ మూడు నెలల కాలంలో ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి 282 సర్వీసుల నడవగా 6,118 మంది ప్రయాణించారు. గతంతో పోలిస్తే విమాన సర్వీసుల సంఖ్య పెరిగినప్పటికీ ఇంకా కోవిడ్ పూర్వ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కోవిడ్‌కు ముందు విశాఖ నుంచి రోజుకు సగటున 7 వేల మంది వరకు ప్రయాణించేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 2,500 నుంచి 3,000కు చేరుకుందని విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కృష్ణ కిషోర్ తెలిపారు. అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమై, థర్డ్ వేవ్ ముప్పు లేకపోతే త్వరలోనే విమానయాన రంగం కోవిడ్ పూర్వస్థితికి చేరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
‘అనుమతి లేకుండా తిరుపతికి వచ్చి నానాయాగీ చేస్తున్నారు’
-
‘అనుమతి లేకుండా తిరుపతికి వచ్చి నానాయాగీ చేస్తున్నారు’
సాక్షి, అనంతపురం: అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ సాధిస్తామని అన్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామని తెలిపారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో చంద్రబాబు డ్రామా సృష్టించారని సజ్జల ధ్వజమెత్తారు. టీడీపీ నేతలను బెదిరించాల్సిన అవసరం తమకు లేదని, చంద్రబాబు తన పార్టీ పరిస్థితిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎస్ఈసీ అనుమతి లేకుండా తిరుపతికి వచ్చి బాబు నానాయాగీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే చంద్రబాబు మాత్రం దౌర్జన్యాలు జరిగాయంటున్నారని మండిపడ్డారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు హామీలను ఎందుకు నెరవేర్చలేదో.. ప్రజలంతా కలిసి చంద్రబాబును నిలదీయాలన్నారు. చదవండి: ఎస్ఈసీ అసహనం: టీడీపీ నేత వర్ల రామయ్య ఔట్.. -
ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
-
రాస్కెల్.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత
రేణిగుంట/చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషాగౌడ్, రేణిగుంట తహసీల్దార్ నరసింహులునాయుడులపై నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. రాస్కెల్.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత, నువ్వు నాకు చెప్పేవాడివా అంటూ తహసీల్దార్‌పై చిందులు తొక్కారు. నీ అంతు చూస్తానంటూ జాయింట్ కలెక్టర్‌ను హెచ్చరించారు. వివరాలు.. గురువారం సాయంత్రం 5.45 గంటలకు ప్రత్యేక విమానంలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రన్‌వే నుంచి వారు అరైవల్ ఎంట్రెన్స్ గుండా బయటకు వస్తారని ప్రొటోకాల్ అధికారులు వేచి ఉన్నారు. ఆ సమయంలో వారికి స్వాగతం పలికేందుకు ఉదయగిరి ఎమ్మెల్యే రామారావు అక్కడే వేచి ఉన్నారు. అయితే అతిథులు అనూహ్యంగా మెయిన్‌గేటు గుండా బయటకు వచ్చారు. ఎమ్మెల్యేను మెయిన్ గేటు వద్దకు తీసుకుని వెళ్లడానికి జేసీ వచ్చిన సమయంలో.. తనను అనసవరంగా అక్కడ కూర్చోబెట్టారంటూ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘నీకు ప్రొటోకాల్ మర్యాదలు తెలియవా? నీ అంతు చూస్తా’’ అంటూ పరుష పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న తహసీల్దార్ నరసింహులునాయుడు ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయనపై తీవ్ర దుర్భాషలాడారు. దీంతో అక్కడున్న వారంతా హతాశులయ్యారు. ఎమ్మెల్యేది అహంకార ప్రవర్తన ఎమ్మెల్యే బొల్లినేని రామారావుది అహంకారపూరిత ప్రవర్తన అని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి నరసింహులునాయుడు, జిల్లా రెవెన్యూ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు విజయసింహారెడ్డి, వీఆర్వో సంఘనేత చెంగల్రాయులు అన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి అధికారుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సహించరానిదన్నారు. ఘటనపై తాము సీఎంకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందే.. జాయింట్ కలెక్టర్ గిరీష, తహసీల్దార్ నరసింహులునాయుడులకు శుక్రవారం ఉదయం 10 గంటలోపు ఎమ్మెల్యే రామారావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ విజయసింహారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులంతా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. -
రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగులో బుల్లెట్లు దొరికాయి. కర్నూలు జిల్లా నంద్యాల బొమ్మలసత్రానికి చెందిన రాంమోహన్‌రెడ్డి ట్రూజెట్ విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టు ప్రవేశద్వారం వద్ద సీఐఎఫ్ఎస్ భద్రతా దళాలు అతని బ్యాగును తనిఖీ చేయగా.. అందులో 17 బుల్లెట్లు దొరికాయి. వెంటనే వారు రాంమోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నంది పైపుల కర్మాగారంలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాంమోహన్‌రెడ్డికి లైసెన్సు కలిగిన రివాల్వర్ ఉందని పోలీసులు వివరించారు. ప్రయాణానికి బయల్దేరేముందు బ్యాగ్‌ను చెక్ చేసుకోకుండా తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని రాంమోహన్‌రెడ్డి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా, రాంమోహన్‌రెడ్డి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి సమీప బంధువని సమాచారం. -
ట్రూ జెట్ విమానం రద్దు, ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన ట్రూ జెట్ విమానం రద్దు అయింది. దీంతో బుధవారం ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని ఎలా రద్దు చేస్తారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే యాజమాన్యం మాత్రం ప్రయాణికుల ఆందోళనను ఏమాత్రం స్పందించడంలేదని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.