Tirupati bus stand
-
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని చెన్నై ప్లాట్‌ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్‌రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్‌గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్‌తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సురక్షితం
సాక్షి, తిరుపతి: తిరుపతి బస్టాండ్‌లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా పోలీసుల చెంతకు చేరాడు. కిడ్నాపర్ చెర నుంచి చిన్నారిని స్థానిక మహిళ ఒకరు కాపాడినట్లు తెలుస్తోంది. రోడ్డుపై ఉన్న చిన్నారిని ఏర్పేడులో క్షేమంగా పోలీసులకు అప్పగించింది. అసలేం జరిగిందంటే.. చెన్నైకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం వచ్చింది. తిరుగు ప్రయాణంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని అర్ధరాత్రి ఫ్లాట్ ఫారం 3 వద్ద కోసం సోమవారం రాత్రి బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుని పోయాడు. ఆందోళనతో తల్లిదండ్రులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ అయిన బాలుడిని చెన్నై, వరసవక్కంకు చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుమారుడు అరుల్ మురుగన్‌గా (2) గుర్తించారు. బాలుడితోపాటు కిడ్నాపర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు కిడ్నాపర్ బాలుడ్ని వదిలేసి వెళ్లడం.. చిన్నారి ఆ మహిళ కంట పడడం, ఆమె పోలీసులకు అప్పగించడం జరిగిపోయాయి. -
నీ ఆకలి తీరునా..హమాలీ
ఏళ్లతరబడి పనిచేస్తారు..అయినా గుర్తింపు కోసం ఆరాటపడుతుంటారు. శక్తికి మించి కష్టపడుతారు..కానీ కుటుంబాన్నీ సాఫీగా నెట్టుకురాలేక చితికిపోతారు. అందరి బరువూ మోస్తారు.. కానీ గిట్టుబాటుకాని కూలితో డొక్కలు మాడ్చుకుంటారు.ఒంట్లో సత్తువ ఉన్నంత వరకే కష్టపడుతారు.. తర్వాత జబ్బున పడి ఇంట్లో వారికి భారమవుతారు.అందరికీ అందుబాట్లో ఉంటారు..వీరికి మాత్రం ఎవరూ తోడురారు.. సాక్షి, తిరుపతి : తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్‌స్టేషన్‌లో బస్సుల్లో లగేజీ లోడింగ్ చేయాలన్నా.. అన్లోడింగ్ చేయాలన్నా హమాలీలే కీలకం. తిరుపతి బస్‌స్టేషన్‌కు రోజూ వెయ్యికి పైగా బస్సులు వచ్చివెళ్తుంటాయి. ఆయా బస్సుల్లో 50 గ్రాముల కవర్ మొదలుకుని 100 కేజీల బరువు కలిగిన లగేజీని హమాలీలే లోడింగ్.. అన్లోడింగ్ చేస్తుంటారు. బస్‌స్టేషన్‌లో సుమారు మూడు దశాబ్దాలుగా పైగా పోర్టర్లు (హమాలీలు)గా జీవన పోరాటం కొనసాగిస్తున్నారు. కానీ వారి బతుకుల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోవడంలేదు. ఖాళీ సమయాల్లో విశ్రాంతి తీసుకోవడానికి చిన్న గది కూడా లేదు. సుమారు 60 మంది కూలీలు నిత్యం బస్టాండులో 24 గంటల పాటు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. జిల్లాలోని అన్ని బస్టేషన్లలోనూ హమాలీల బతుకు ఇంతే. గుర్తింపు ఏదీ? 30 ఏళ్ల కిందట బస్ స్టేషన్లో హమాలీగా చేరిన వారంతా ఇప్పుడు వృద్ధాప్య దశకు చేరుకున్నారు. ఇప్పటికే వారిలో చాలామంది మృతి చెందారు. కొందరు అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం బస్ స్టేషన్లో 60 మంది కూలీలు పనిచేస్తున్నారు. వారిలో 30 మంది ఒక షిఫ్ట్, మరొక 30 మంది నైట్‌షిఫ్ట్ చొప్పున పనిచేస్తుంటారు. మొదటి షిఫ్ట్ రోజూ ఉదయం 8గంటలకు డ్యూటీకి వస్తే రాత్రి 8గంటల వరకు అందుబాటులో ఉంటారు. రెండో షిఫ్ట్ రాత్రి 8గంటలకు డ్యూటీకి వస్తే మరుసటి రోజు ఉదయం 8 దాకా పనిచేస్తారు. గిట్టుబాటు కాని కూలి ఆర్టీసీ పార్సిల్, కార్గో సేవలను ప్రయివేట్ ఏజెన్సీకి అప్పగించారు. రోజుకు రూ.400 నుంచి రూ.500 లోపు మాత్రమే గిట్టుబాటవుతోంది. గతంలో ఏఎన్ఎల్ పార్సిల్ సేవలు అందుబాటులో ఉండేవి. ఆ సమయంలో ఒక్కో కూలీకి రోజుకు రూ.1000 నుంచి రూ.1,200 దాకా కూలి గిట్టుబాటయ్యేది. డ్యూటీలో ఉండే హమాలీలంతా వచ్చిన డబ్బును సాయంత్రం డ్యూటీ దిగేటప్పుడు భాగాలుగా పంచుకునేవారు. ఈనెల 1వ తేదీ నుంచి పార్సిల్ సేవలను క్రిష్ణ ఇన్ఫోటెక్ సంస్థకు అప్పగించారు. బస్సు టైర్ లోడింగ్ చేసిన, దించినా రూ.35 ఇస్తారు, మెడిసిన్ కలిగిన ఒక్కొక్క బాక్స్‌కు రూ.15 చొప్పున, బట్టల బాక్స్కైతే రూ.10, కవర్‌కు ఏదైనా గానీ డ్రైవర్‌కు అప్పగిస్తే రూ.1 చొప్పున ఇస్తారు. కొంతమంది బస్సుల్లోని డిక్కీలు, టాప్‌లు బుక్ చేసుకుంటారు. వాటిల్లో వచ్చే పూలు, పండ్లు, కొత్తమీర (పచ్చి సరుకు)కు కేవలం రూ.120 కూలీగా ఇస్తారు. అట్టపెట్టెలకు రూపాయి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. దూరప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చే లగేజీకి ఒకదానికి రూ.7 చొప్పున ఇస్తున్నారు. వీటితోపాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చెప్పిన ఇతరత్రా పనులు కూడా చేసి పెట్టాల్సి వస్తోంది. లేదంటే వేధింపులు తప్పవు. బస్ స్టేషన్లో కూర్చీలు విరిగిపోయిన, బస్టాండులో అపరిశుభ్రంగా ఉన్నా క్లీనింగ్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది. నిలువ నీడలేదు బస్టాండులో 24 గంటల పాటు అందుబాటులో ఉండే హమాలీలకు నిలువ నీడలేదు. విశ్రాంతి తీసుకోవడానికి ఎలాంటి ప్రత్యేక గదీ కేటాయించలేదు. బస్టాండ్, చెట్లు కింద సేదతీరాల్సి వస్తోంది. ఎండకు కొండకూ మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విజయవాడ, గుంటూరు, కర్నూలు, నంద్యాలలోని బస్ స్టేషన్లలో హమాలీలు విశ్రాంతి తీసుకునేందుకు ఆర్టీసీ విశ్రాంతి గదులను ఏర్పాటు చేసింది. అదే తిరుపతి లాంటి ఆధ్యాత్మిక బస్‌స్టేషన్‌లో విశ్రాంతి గది లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా హమాలీల సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించాల్సి వస్తోంది. గుర్తిస్తే చాలు.. నాలుగేళ్లుగా బస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నా. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. మమ్మల్ని ఆర్టీసీ సంస్థ గుర్తిస్తే జీవితాంతం మా కుటుంబంమంతా రుణపడి ఉంటుంది. ఎవ్వరూ మా గురించి పట్టించుకోవడం లేదు. -ఎం.వెంకటేశు, కూలీ బతుకు మారలేదు.. ఏన్నో ఏళ్లు కూలీలుగా బస్టాండులో పనిచేస్తున్నాం. మా బతుకుల్లో ఎలాంటి మార్పులేదు. ఆర్టీసీ యాజమాన్యం చొరవ తీసుకోవాలి. మా బతుకుల్లో మార్పు తీసుకురావాలి. ఇటీవల తిరుపతి బస్టాండు తనిఖీకి వచ్చిన ఎండీ సురేంద్రబాబుకు మా గోడు వెళ్లబోసుకున్నాం. ఇంకా స్పందనలేదు. – రవిచంద్ర, మేస్త్రీ ఏళ్లతరబడి చేస్తున్నాం బస్టాండులో ఏళ్లతరబడి కూలీలుగా పనిచేస్తున్నాం. మాలో ఎవరికైనా ప్రమాదం జరిగితే మేమే చందాలేసుకుని వైద్యం చేయిస్తాం. మమ్మల్ని యజమాన్యం గుర్తించాలి. గుర్తింపు కార్డులు, బస్ పాస్‌లు మంజూరు చేయాలి. -సీ.మధు, అధ్యక్షుడు హమాలీల సంఘం -
తిరుమలకు సమైక్య సెగ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ‘సమైక్య’ సెగ తలిగింది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. వెంకన్న హుండీ ఆదాయం సగానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి 24 గంటలపాటు తిరుపతి-తిరుమల మధ్య టాక్సీలను నిలిపి వేయాలని తిరుమల, తిరుపతి ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ జేఏసీ నిర్ణయించింది. ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయాలని ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈనెల 13వ తేదీన తిరుమలకు బస్సులు నిలిపివేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి బస్సులు నడపాల్సిందిగా సూచించడంతో కొద్దిపాటి బస్సులను పునరుద్ధరించారు. సాధారణ రోజుల్లో దాదాపు 500 బస్సులు తిరుమలకు తిరుగుతుండగా, ఈనెల 14వ తేదీ నుంచి 107 బస్సు సర్వీసులను మాత్రమే పునరుద్ధరించారు. ఇవి కూడా తిరుపతి బస్టాండ్ నుంచి గాక అలిపిరి బాలాజీ బస్టాండు నుంచి తిరుమలకు నడుపుతున్నారు. మామూలు రోజుల్లో బస్సుల ద్వారా వెళ్లి వచ్చే భక్తుల సంఖ్య లక్షకుపైగా ఉంటుంది. ప్రస్తుతం 107 బస్సుల్లో సగటున 26 వేల మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తున్నారు. భక్తుల సంఖ్య తగ్గడంతో తిరుమల వెంకన్నకు వచ్చే ఆదాయం కూడా భారీగా పడిపోయింది. రోజూ రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల వరకూ ఉండే హుండీ ఆదాయం కోటిన్నరకు పడిపోయింది. గదులు కూడా ఖాళీ అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేటు వాహనాలు నిలిచిపోవడం కూడా తిరుమలపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 32 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 10 గంటల్లోనే దర్శనం లభిస్తోంది. రద్దీ పెరగడంతో రూ.300 టికెట్ల దర్శనం సాయంత్రం 4 గంటలకు నిలిపివేశారు. అలిపిరి, శ్రీవారి వెుట్టు మార్గాల్లో నడిచి వచ్చిన భక్తులు 9 కంపార్మెంట్లలో వేచిఉన్నారు. వీరికి దర్శన సమయం 5 గంటలుగా కేటాయించారు. వెంకన్న సేవలో డీజీపీ దినేష్‌రెడ్డి: రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి శుక్రవారం వేకువజామున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకున్న ఆయన సన్నిధి చేరుకుని అభిషేక సేవలో స్వామిని దర్శించుకున్నారు. వకుళామాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆలయాధికారులు డీజీపీకి శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. డీజీపీ శ్రీకాళహస్తి చేరుకుని ముక్కంటీశుని, తిరుచానూరులో పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. విభజిస్తే రాజకీ య నిష్ర్కమణ : కోట్ల సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియా చానళ్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారడం ఖాయమని పేర్కొన్నారు.