ఏళ్లతరబడి పనిచేస్తారు..అయినా గుర్తింపు కోసం ఆరాటపడుతుంటారు. శక్తికి మించి కష్టపడుతారు..కానీ కుటుంబాన్నీ సాఫీగా నెట్టుకురాలేక చితికిపోతారు. అందరి బరువూ మోస్తారు.. కానీ గిట్టుబాటుకాని కూలితో డొక్కలు మాడ్చుకుంటారు.ఒంట్లో సత్తువ ఉన్నంత వరకే కష్టపడుతారు.. తర్వాత జబ్బున పడి ఇంట్లో వారికి భారమవుతారు.అందరికీ అందుబాట్లో ఉంటారు..వీరికి మాత్రం ఎవరూ తోడురారు..
సాక్షి, తిరుపతి : తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్‌స్టేషన్‌లో బస్సుల్లో లగేజీ లోడింగ్ చేయాలన్నా.. అన్‌లోడింగ్ చేయాలన్నా హమాలీలే కీలకం. తిరుపతి బస్‌స్టేషన్‌కు రోజూ వెయ్యికి పైగా బస్సులు వచ్చివెళ్తుంటాయి. ఆయా బస్సుల్లో 50 గ్రాముల కవర్ మొదలుకుని 100 కేజీల బరువు కలిగిన లగేజీని హమాలీలే లోడింగ్.. అన్‌లోడింగ్ చేస్తుంటారు. బస్‌స్టేషన్‌లో సుమారు మూడు దశాబ్దాలుగా పైగా పోర్టర్లు (హమాలీలు)గా జీవన పోరాటం కొనసాగిస్తున్నారు. కానీ వారి బతుకుల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోవడంలేదు. ఖాళీ సమయాల్లో విశ్రాంతి తీసుకోవడానికి చిన్న గది కూడా లేదు. సుమారు 60 మంది కూలీలు నిత్యం బస్టాండులో 24 గంటల పాటు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. జిల్లాలోని అన్ని బస్టేషన్లలోనూ హమాలీల బతుకు ఇంతే.
గుర్తింపు ఏదీ?
30 ఏళ్ల కిందట బస్ స్టేషన్‌లో హమాలీగా చేరిన వారంతా ఇప్పుడు వృద్ధాప్య దశకు చేరుకున్నారు. ఇప్పటికే వారిలో చాలామంది మృతి చెందారు. కొందరు అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం బస్ స్టేషన్‌లో 60 మంది కూలీలు పనిచేస్తున్నారు. వారిలో 30 మంది ఒక షిఫ్ట్, మరొక 30 మంది నైట్‌షిఫ్ట్ చొప్పున పనిచేస్తుంటారు. మొదటి షిఫ్ట్ రోజూ ఉదయం 8గంటలకు డ్యూటీకి వస్తే రాత్రి 8గంటల వరకు అందుబాటులో ఉంటారు. రెండో షిఫ్ట్ రాత్రి 8గంటలకు డ్యూటీకి వస్తే మరుసటి రోజు ఉదయం 8 దాకా పనిచేస్తారు.
గిట్టుబాటు కాని కూలి
ఆర్టీసీ పార్సిల్, కార్గో సేవలను ప్రయివేట్ ఏజెన్సీకి అప్పగించారు. రోజుకు రూ.400 నుంచి రూ.500 లోపు మాత్రమే గిట్టుబాటవుతోంది. గతంలో ఏఎన్‌ఎల్ పార్సిల్ సేవలు అందుబాటులో ఉండేవి. ఆ సమయంలో ఒక్కో కూలీకి రోజుకు రూ.1000 నుంచి రూ.1,200 దాకా కూలి గిట్టుబాటయ్యేది. డ్యూటీలో ఉండే హమాలీలంతా వచ్చిన డబ్బును సాయంత్రం డ్యూటీ దిగేటప్పుడు భాగాలుగా పంచుకునేవారు. ఈనెల 1వ తేదీ నుంచి పార్సిల్ సేవలను క్రిష్ణ ఇన్ఫోటెక్ సంస్థకు అప్పగించారు.
బస్సు టైర్ లోడింగ్ చేసిన, దించినా రూ.35 ఇస్తారు, మెడిసిన్ కలిగిన ఒక్కొక్క బాక్స్‌కు రూ.15 చొప్పున, బట్టల బాక్స్‌కైతే రూ.10, కవర్‌కు ఏదైనా గానీ డ్రైవర్‌కు అప్పగిస్తే రూ.1 చొప్పున ఇస్తారు. కొంతమంది బస్సుల్లోని డిక్కీలు, టాప్‌లు బుక్ చేసుకుంటారు. వాటిల్లో వచ్చే పూలు, పండ్లు, కొత్తమీర (పచ్చి సరుకు)కు కేవలం రూ.120 కూలీగా ఇస్తారు. అట్టపెట్టెలకు రూపాయి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. దూరప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చే లగేజీకి ఒకదానికి రూ.7 చొప్పున ఇస్తున్నారు. వీటితోపాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చెప్పిన ఇతరత్రా పనులు కూడా చేసి పెట్టాల్సి వస్తోంది. లేదంటే వేధింపులు తప్పవు. బస్ స్టేషన్‌లో కూర్చీలు విరిగిపోయిన, బస్టాండులో అపరిశుభ్రంగా ఉన్నా క్లీనింగ్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
నిలువ నీడలేదు
బస్టాండులో 24 గంటల పాటు అందుబాటులో ఉండే హమాలీలకు నిలువ నీడలేదు. విశ్రాంతి తీసుకోవడానికి ఎలాంటి ప్రత్యేక గదీ కేటాయించలేదు. బస్టాండ్, చెట్లు కింద సేదతీరాల్సి వస్తోంది. ఎండకు కొండకూ మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విజయవాడ, గుంటూరు, కర్నూలు, నంద్యాలలోని బస్ స్టేషన్లలో హమాలీలు విశ్రాంతి తీసుకునేందుకు ఆర్టీసీ విశ్రాంతి గదులను ఏర్పాటు చేసింది. అదే తిరుపతి లాంటి ఆధ్యాత్మిక బస్‌స్టేషన్‌లో విశ్రాంతి గది లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా హమాలీల సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించాల్సి వస్తోంది.
గుర్తిస్తే చాలు..
నాలుగేళ్లుగా బస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నా. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. మమ్మల్ని ఆర్టీసీ సంస్థ గుర్తిస్తే జీవితాంతం మా కుటుంబంమంతా రుణపడి ఉంటుంది. ఎవ్వరూ మా గురించి పట్టించుకోవడం లేదు.
-ఎం.వెంకటేశు, కూలీ
బతుకు మారలేదు..
ఏన్నో ఏళ్లు కూలీలుగా బస్టాండులో పనిచేస్తున్నాం. మా బతుకుల్లో ఎలాంటి మార్పులేదు. ఆర్టీసీ యాజమాన్యం చొరవ తీసుకోవాలి. మా బతుకుల్లో మార్పు తీసుకురావాలి. ఇటీవల తిరుపతి బస్టాండు తనిఖీకి వచ్చిన ఎండీ సురేంద్రబాబుకు మా గోడు వెళ్లబోసుకున్నాం. ఇంకా స్పందనలేదు.
– రవిచంద్ర, మేస్త్రీ
ఏళ్లతరబడి చేస్తున్నాం
బస్టాండులో ఏళ్లతరబడి కూలీలుగా పనిచేస్తున్నాం. మాలో ఎవరికైనా ప్రమాదం జరిగితే మేమే చందాలేసుకుని వైద్యం చేయిస్తాం. మమ్మల్ని యజమాన్యం గుర్తించాలి. గుర్తింపు కార్డులు, బస్ పాస్‌లు మంజూరు చేయాలి.
-సీ.మధు, అధ్యక్షుడు హమాలీల సంఘం
Comments
Please login to add a commentAdd a comment