జగ్గారెడ్డి గడ్డం గీసుకోడు..పవన్ గీసుకుంటాడు..
'జనసేన' పార్టీ ఆవిర్భావం రోజున ఆర్భాటంగా ప్రకటించిన లక్ష్యాలకు, విధానాలకు పవన్ కళ్యాణ్ అప్పుడే మంగళం పాడే కార్యక్రమానికి పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. 'జింపింగ్ జిలానీ'లకు జనసేన పార్టీలో స్థానం ఉండదని, మద్దతు ప్రకటించేది లేదని ఆర్భాటంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాజాగా 'జంపింగ్'కు సిద్దమవుతున్న జగ్గయ్యకు పవన్ మద్దతిచ్చేందుకు పవన్ సుముఖంగానే ఉన్నాడు. పవన్ తీరు చూస్తుంటే జగ్గారెడ్డి గడ్డం గీసుకోడు.. నేను అప్పడప్పుడూ గీసుకంటాను. తన భావాలకు జగ్గారెడ్డి భావాలు చాలా దగ్గరగా ఉంటాయని.. ఆయన నేను సేమ్ టూ సేమ్ అని అంటున్నారు పవన్ కళ్యాణ్. ఆయన వ్యవహార తీరును చూస్తే హామీలు ఇవ్వడానికి, వేదికల మీద ఉపన్యాసాల రూపంలో దంచడానికి, అభిమానులకు వినేందుకు సొంపుగానే ఉంటాయి. ఓసారి రంగంలోకి దిగాక.. తన లక్ష్యాలను ఆచరణలో పెట్టడమే కష్టమని పవన్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నట్టున్నాడు.
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు వరకు మోస్తారు నేతగా పేరున్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ కలిసి తన భవిష్యత్ కార్యాచరణకు మార్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ చావుదెబ్బ తిని.. పట్టుమని పది రోజులు కాకముందే ప్లేట్ ఫిరాయించేందుకు దారులు వెతుకుంటున్నాడు. శాశ్వతంగా మూతపడిన టీఆర్ఎస్ గేట్టు తనకోసం తెరుచుకోవు కనుక.. మంచి స్వింగ్ లో బీజేపీ లేదా జనసేనలో దూకేందుకు పవన్ కళ్యాణ్ ఎదురుగా కనిపించారు. అంతేకాక పవన్ కళ్యాణ్ కూడా జగ్గారెడ్డిని జనసేన వేదికపై మోసేయడంతో పార్టీ మారేందుకు దారి వెతుక్కోవడం సులభమైంది. దాంతో పవన్ ను కలిసి తన మనసులో మాటను బయటపెట్టుకున్నాడు.
ఆతర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ మిట్ పెట్టి జగ్గారెడ్డి బీజేపీలో చేరితే తాను మద్దతిస్తాను అని ఓ మాట చెప్పేశాడు. ఇదంతా ఎందుకంటే కేసీఆర్ గెలిచిన మెదక్ పార్లమెంట్ సీటు ఉప ఎన్నిక జగ్గారెడ్డి తాత్కాలిక లక్ష్యంగా కనిపించడం. టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి.. ఆతర్వాత కొద్ది రోజులకే కేసీఆర్ తో విభేదించి.. కాంగ్రెస్ లోకి జంప్ చేశాడు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులకు సన్నిహితంగా మెలుగుతూ కేసీఆర్ కు కొరకరాని కొయ్యగా మారాడు. తెలంగాణవాదినైనా తాను సమైక్యవాదమే తన ప్రధాన ఎజెండా అని చెప్పుకునే జగ్గయ్యను ఓటర్లు మాజీని చేశారు.
ఇక ఇప్పట్లో కాంగ్రెస్ తో పనవ్వడం కష్టమే అనే నిర్ణయానికి వచ్చిన జగ్గారెడ్డి తన 'జంపింగ్' అస్త్రాన్ని ప్రయోగించాడు. జంప్ కొట్టడం జగ్గయ్యకు వెన్నతో పెట్టిన విద్యే..ఆయన తీరును పెద్దగా తప్పు పడితే.. మనం తప్పున పడుతాం. కాని దేశ సమైక్యత, సమగ్రత అనే భారీ పదజాలాన్ని పదే పదే ఉపయోగిస్తూ.. జంపింగ్ లకు తాను దూరమని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆమాట మరిచి.. తాను అందరూ రాజకీయ నాయకుడిల్లో ఒకరినని చెప్పకనే చెప్పాడు. వేదికలపై ఉన్నత ఆశయాలున్నట్టు పొలిటికల్ ట్రిక్కులకు పాల్పడితే.. ప్రజలు ఎప్పుడు గమనిస్తునే ఉంటారని పవన్ తెలుసుకుంటే మంచిదనుకుంటా.