టీఎంసీ ఉపమేయర్‌పై దాడి
ఠాణే: నగరపాలక సంస్థ (టీఎంసీ) అనుబంధ రవాణా కమిటీ చైర్మన్ పదవికి సోమవారం జరిగిన ఎన్నికల్లో శివసేన అభ్యర్థి పప్పూకదమ్ పరాజయంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కాషాయకూటమి కార్యకర్తలు ఉపమేయర్ మిలింద్ పాటంకర్‌పై దాడికి పాల్పడ్డారు. టీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ సభ్యుడు అజయ్ జోషి... బరిలోకి దిగిన కదమ్‌కి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఎన్సీపీ తరఫున బరిలోకి దిగిన శైలేష్ భగత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. భగత్‌కు నాలుగు ఓట్లు రాగా కదమ్‌కు కేవలం మూడు ఓట్లే పడ్డాయి. శివసేన అభ్యర్థి పరాజయం పాలయ్యాడనే వార్తతో టీఎంసీ పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన బీజేపీ, శివసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు మూకుమమ్మడిగా ఉపమేయర్ కార్యాలయంలోకి చొరబడ్డారు. అక్కడి కుర్చీలను ధ్వంసం చేశారు.దీనిని గమనించిన బీజేపీ నాయకుడు రాజు కాలే పాటంకర్కు రక్షణగా నిలిచారు. దాడికి పాల్పడిన వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలవడంతో ఎన్సీపీ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కాగా ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ పి.వేల్రసు వ్యవహరించారు.
రాజీనామా చేసిన డిప్యూటీ మేయర్
నాలుగు గంటలపాటు తనను గదిలో బంధించడమే కాకుండా శివసేన, బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్రమనస్థాపానికి గురైన ఉపమేయర్, బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మేయర్‌కు అందజేవారు.