TNCA
-
‘ధోనికి రుణపడి ఉంటా’అశ్విన్ భావోద్వేగం
చెన్నై: దాదాపు 13 ఏళ్ల క్రితం తనకంటూ ఎలాంటి గుర్తింపు లేని రోజుల్లో అండగా నిలిచి అవకాశాలు కల్పించిన మహేంద్ర సింగ్ ధోనికి తాను జీవితకాలం రుణపడి ఉంటానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. 100 టెస్టులు పూర్తి చేసుకోవడంతో పాటు 500 వికెట్ల మైలురాయిని దాటిన అశ్విన్‌ను శనివారం తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన 2011 ఐపీఎల్ ఫైనల్‌ను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. ‘కొత్త బంతితో నన్ను క్రిస్ గేల్‌కు బౌలింగ్ చేసే అవకాశాన్ని ధోని కల్పించాడు. నాలుగో బంతికే నేను వికెట్ తీయగలిగా. ఇప్పటికీ చాలా మంది దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే అందుకు ధోనినే కారణం. అతనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. సాధారణంగా నేను మాట్లాడేప్పుడు పదాల కోసం ఎప్పుడూ తడబడను. కానీ ఈ రోజు నా పరిస్థితి భిన్నంగా ఉంది. టీఎన్‌సీఏ నాకు ఎంతో గౌరవం కల్పించింది కాబట్టే ఎప్పుడైనా క్లబ్ క్రికెట్ కూడా సిద్ధంగా ఉంటా. నేను రేపు చచ్చిపోయినా నా ఆత్మ ఈ స్టేడియంలోనే తిరుగుతూ ఉంటుంది’ అని అశ్విన్ అన్నాడు. ఈ సన్మాన కార్యక్రమంలో అశ్విన్‌కు ప్రత్యేక జ్ఞాపికగా ‘సెంగోల్’ అందించడం, అతని పేరిట స్టాంప్ విడుదలతో పాటు రూ. 1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందించారు. -
టీఎన్‌సీఏ అధ్యక్షురాలిగా రూప
చెన్నై: తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) నూతన అధ్యక్షురాలిగా.... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూప గురునాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారంతో నామినేషన్ గడువు ముగిసింది. అధ్యక్ష పదవికి రూప ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించారు. దీంతోపాటు సంఘంలోని ఇతర పదవులు శ్రీనివాసన్ వర్గానికే దక్కాయి. ఉపాధ్యక్షులుగా టీజే శ్రీనివాస్ రాజ్ (సిటీ), డా.పి అశోక్ సిగమణి (జిల్లాలు), సెక్రటరీగా ఆర్ఎస్ రామసామి, జాయింట్ సెక్రటరీగా కేఏ శంకర్, సహ కార్యదర్శిగా ఎన్.వెంకట్రామన్, కోశాధికారిగా జె.పార్థసారథిలను ఎన్నుకున్నారు. -
టీఎన్‌సీఏ చేతులెత్తేసింది!
చెన్నై:వచ్చే నెల్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నగరంలో జరగాల్సిన రెండు అండర్-19 టెస్టు మ్యాచ్‌ల నిర్వహణపై తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) చేతులెత్తేసింది. లోధా కమిటీ సిఫారుల అమల్లో భాగంగా ఆ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు ఎన్ శ్రీనివాసన్, సెక్రటరీ విశ్వనాథన్‌లు తమ పదవుల్ని వదులుకోవాల్సి వస్తుంది. కూలింగ్ ఆఫ్ పిరియడ్ నిబంధన ప్రకారం శ్రీనివాసన్, విశ్వనాథన్‌లు తమ తమ హోదాలకు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇదే సమయంలో భారత్-ఇంగ్లండ్‌ల మధ్య చెన్నైలో జరగాల్సిన ఉన్న రెండు అండర్-19 టెస్టులను నిర్వహించడడం టీఎన్‌సీఏకు తలనొప్పిగా మారింది. 'వర్దా తుపానుతో పలు తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లను కోల్పోవాల్సి వచ్చింది. దీన్ని నిర్వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. దాంతో పాటు టీఎన్‌సీఏ ఫస్ట్ డివిజన్ మ్యాచ్‌లను కూడా నిర్వహించాలి. లోయర్ డివిజన్ గేమ్స్ తో పాటు, ఇంటర్ యూనివర్శిటీ మ్యాచ్‌లను సైతం నిర్వహించాలి. మా సొంత మ్యాచ్‌లకు గ్రౌండ్ల అవసరం ఉంది. ఆ క్రమంలోనే భారత్-ఇంగ్లండ్ ల మధ్య చెన్నైలో జరగాల్సిన ఉన్న రెండు అండర్ 19 మ్యాచ్‌లను నిర్వహించడం కష్టం' అని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి టీఎన్‌సీఏ జాయింట్ సెక్రటరీ ఆర్ ఏ పలనా ఓ లేఖలో తెలిపారు. -
పిచ్, అవుట్‌ఫీల్డ్ ఓకే
చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి ఇక్కడ జరగనున్న ఐదో టెస్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందీ లేదని తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ప్రకటించింది. ‘వర్దా’ తుపాను కారణంగా సోమవారం నగరం మొత్తం తీవ్రంగా దెబ్బతింది. అయితే చిదంబరం స్టేడియంలోని అవుట్‌ఫీల్డ్, పిచ్ మాత్రం పాడు కాలేదని టీఎన్‌సీఏ కార్యదర్శి కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ‘మైదానంలో సైట్ స్క్రీన్లు, బల్బ్‌లు, ఎయిర్‌కండిషనర్లు దాదాపు పూర్తిగా చెడిపోయాయి. కానీ వికెట్, గ్రౌండ్‌ను మాత్రం జాగ్రత్తగా సంరక్షించుకున్నాం’ అని ఆయన చెప్పారు. రెండు రోజుల్లోగా ఇతర సమస్యలు కూడా అధిగమించి, అన్ని ఏర్పాట్లతో మ్యాచ్ నిర్వహించగలమని విశ్వనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ పరాజయం
హైదరాబాద్: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు 164 పరుగుల తేడాతో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) చేతిలో ఓడింది. చెన్నైలో శనివారం ముగిసిన ఈ రెండు రోజుల మ్యాచ్‌లో చివరి రోజు ఆటలో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ బి. సందీప్ (127 బంతుల్లో 115 నాటౌట్; 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించాడు. డానీ డెరిక్ ప్రిన్స్ 49 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ 77 ఓవర్లలో 255 పరుగులు చేసి ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో విఘ్నేష్, ఎం. అశ్విన్ చెరో 3 వికెట్లు తీశారు. సిద్ధార్థ్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలిరోజు ఆటలో తమిళనాడు జట్టు 3 వికెట్ల నష్టానికి 419 పరుగుల భారీస్కోరు చేసింది. -
ఎన్ శ్రీనివాసన్ 15వసారి..
చెన్నై: తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్ శ్రీనివాసన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన టీఎన్‌సీఏ ఏజీఏం (వార్షిక సర్వసభ్య సమావేశం)లో శ్రీనివాసన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవికి శ్రీనివాసన్ ఒక్కడే పోటీలో నిలవడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. తద్వారా వరుసగా 15వ సారి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌కు శ్రీనివాసన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో పాటు 2016-17 సంవత్సరానికి కార్యనిర్వాహక కమిటీ ఆఫీస్ బేరర్స్ కూడా ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.