టీఎన్సీఏ చేతులెత్తేసింది!
చెన్నై:వచ్చే నెల్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నగరంలో జరగాల్సిన రెండు అండర్-19 టెస్టు మ్యాచ్ల నిర్వహణపై తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్సీఏ) చేతులెత్తేసింది. లోధా కమిటీ సిఫారుల అమల్లో భాగంగా ఆ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు ఎన్ శ్రీనివాసన్, సెక్రటరీ విశ్వనాథన్లు తమ పదవుల్ని వదులుకోవాల్సి వస్తుంది. కూలింగ్ ఆఫ్ పిరియడ్ నిబంధన ప్రకారం శ్రీనివాసన్, విశ్వనాథన్లు తమ తమ హోదాలకు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇదే సమయంలో భారత్-ఇంగ్లండ్ల మధ్య చెన్నైలో జరగాల్సిన ఉన్న రెండు అండర్-19 టెస్టులను నిర్వహించడడం టీఎన్సీఏకు తలనొప్పిగా మారింది.
'వర్దా తుపానుతో పలు తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్)లను కోల్పోవాల్సి వచ్చింది. దీన్ని నిర్వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. దాంతో పాటు టీఎన్సీఏ ఫస్ట్ డివిజన్ మ్యాచ్లను కూడా నిర్వహించాలి. లోయర్ డివిజన్ గేమ్స్ తో పాటు, ఇంటర్ యూనివర్శిటీ మ్యాచ్లను సైతం నిర్వహించాలి. మా సొంత మ్యాచ్లకు గ్రౌండ్ల అవసరం ఉంది. ఆ క్రమంలోనే భారత్-ఇంగ్లండ్ ల మధ్య చెన్నైలో జరగాల్సిన ఉన్న రెండు అండర్ 19 మ్యాచ్లను నిర్వహించడం కష్టం' అని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి టీఎన్సీఏ జాయింట్ సెక్రటరీ ఆర్ ఏ పలనా ఓ లేఖలో తెలిపారు.