tobacco ban
-
ఏపీ: మత్తు వదలాలి.. స్క్రీనింగ్ చేస్తున్న ఏఎన్ఎంలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నియంత్రించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజస్(ఎన్సీడీ) 2.0 సర్వే ద్వారా పొగాకు వ్యసనపరులను గుర్తిస్తోంది. ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్ చేస్తున్నారు. బీడీ, చుట్టా, సిగరెట్‌తో పాటు, గుట్కా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్న వారి వివరాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 2,13,12,792 మందిని స్క్రీనింగ్ చేసి.. 2,96,226 మంది పొగాకు వ్యసనపరులను గుర్తించారు. వీరిని పొగాకు వినియోగం నుంచి దూరం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి వైద్య నిపుణులు ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,86,303 మందికి ఫోన్ చేశారు. తొలుత కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్ పొగాకు వినియోగించే వ్యక్తికి ఫోన్ చేసి ఆ వ్యక్తి ఏం పనిచేస్తుంటారు? ఎన్నేళ్ల నుంచి పొగాకు వినియోగిస్తున్నారు? తదితర వివరాలను తెలుసుకుంటున్నారు. పొగాకు వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తున్నారు. వ్యసనాన్ని వీడటానికి మొగ్గు చూపిన వారిని కాల్ సెంటర్లోని కౌన్సెలర్‌కు ట్యాగ్ చేస్తున్నారు. వారు పొగాకు వినియోగాన్ని వీడేలా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అనంతరం జిల్లాల్లోని డీ–అడిక్షన్ సెంటర్లకు సంబంధిత వ్యక్తులను ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,86,303 మందికి గాను 10,066 మంది పొగాకు వినియోగాన్ని వదలిపెట్టేందుకు ముందుకు వచ్చారు. డీ–అడిక్షన్ సెంటర్లలోని వైద్యులు వీరికి ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. మరోవైపు డీ–అడిక్షన్ సెంటర్‌కు మ్యాపింగ్ అయిన వ్యక్తులకు అక్కడ చికిత్స ఏ విధంగా అందుతోంది? వారిలో మార్పు వచ్చిందా? అనే అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వెబ్ అప్లికేషన్ రూపొందిస్తున్నారు. త్వరలో ఈ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. -
పొగరాయుళ్లకు చెక్: నో మోర్ లూజ్ సిగరెట్స్
బెంగళూరు: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే పొగరాయుళ్లకు చెక్‌పెడుతూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిగరెట్లతో పాటు వివిధ రకాల పొగాకు ఉత్పత్తులను విడిగా విక్రయించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ధూమపానాన్ని నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లూజ్ సిగరెట్లు, బీడీలు ఇతర చూయింగ్ పొగాకు ఉత్పత్తుల విక్రయం ఇకమీదట నేరంగా పరిగణిస్తారు. 2003 కోప్టా చట్టంలోని సెక్షన్లు 7, 8 ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. తాజా ఆదేశాల ప్రకారం... సిగరెట్లను పెట్టెగానే విక్రయాలి. విడిగా అమ్మడం కుదరదు. విడిగా విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శాలిని రాజేష్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధంతో ధూమపానం తగ్గినప్పటికీ లూజ్ సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. ఈ నిషేధం పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని మరింత తగ్గిస్తుందని తాము భావిస్తున్నాన్నారు. సెప్టెంబరు 11 న ఈ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బుధవారంనుంచి ఈ నిషేధాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈ ఆదేశాల పటిష్ట అమలుకోసం ఒక ప్రభుత్వం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోందని యాంటీ టొబాకో సెల్‌లోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
ప్రత్యామ్నాయం చూపాలి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే పొగాకు నిషేధంపై ఆలోచించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ను కోరారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం తీసుకురానున్న బిల్లుపై వారు మంత్రితో చర్చించారు. కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలు కూడా గమనంలోకి తీసుకోవాలని కోరారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పొగాకు ఎక్కువగా పండుతుందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగలు, తదితర పంటలను ముందుకు తీసుకువచ్చినా వాటి వల్ల రైతాంగం నష్టపోయిన సంగతి గుర్తు చేశారు. పొగాకు వాడకం వల్ల కేన్సర్ వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి హర్షవర్ధన్ ప్రస్తావించారు.దీనిపై ఎంపీతో పాటు రైతుల ప్రతినిధి బృందం స్పందిస్తూ దీనికి తాము ఏకీభవిస్తామని, అదేసమయంలో లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా చర్యలు తీసుకుంటేనే రైతులను ఆ పంటలు వేసుకునే విధంగా ప్రోత్సహించే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో దీని గురించి ఆలోచించాలని కోరారు. ప్రతినిధి బృందంలో పొగాకు రైతు ప్రతినిధులు పీవీ సత్యనారాయణ రెడ్డి, ఆర్ నరేంద్ర, గద్దె శేషగిరిరావు, వెంకటరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు ఉన్నారు. -
పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఎత్తేయాలి
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వం సువాసనల వక్కపొడి, సువాసనల పొగాకుపై నిషేధం విధించడాన్ని వ్యాపారులు, విక్రేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ముంబై బీడీ-తంబాకు వ్యాపారీ సంఘ్ అధ్యక్షుడు శరద్ రావ్ మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులపై ఆదివారం (18 వ తేదీ)లోగా ప్రభుత్వం నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలోని విక్రేతలు, పాన్ స్టాళ్ల వారు సోమవారం (19 వ తేదీ) నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల ఇంటి ముందు ‘ఘంటానాద్’ చేస్తామని హెచ్చరించారు. అంతేకాక నిషేధం అసలు అవసరమా? అనేదానిపై అధ్యయనం చేయడానికి కమిటీని నియమించాలని, ఆరు నెలల్లోగా సమితి నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని డిమాండ్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సువాసనల వక్కపొడి, పొగాకుపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఒక స్టాల్ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడని సంఘం కార్యాధ్యక్షుడు నందకుమార్ హెగిష్టే తెలిపారు. ఉత్పత్తిదారులు, విక్రేతలు, డిస్ట్రిబ్యూటర్లకు దీని వల్ల నష్టం ఏర్పడుతోందన్నారు. ఈ వ్యాపారానికి సంబంధించిన రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రచురణదారులు, ఇతర కార్మికులను కలిపి మొత్తం రెండు కోట్ల మంది ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వీరందరూ ఉపాధి కోల్పోతారు. తొలుత వారికి పునరావాసం కల్పించిన తర్వాతే నిషేధం అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. సాంగ్లీ మాదిరిగా ఐక్యతను చూపండి... సాంగ్లీ జిల్లాలో విక్రేతలపై చర్యలు తీసుకోడానికి వచ్చిన అధికారులను ఘెరావ్ చేశారు. దాంతో వారు వెళ్లిపోయారు. అలా ఇతర జిల్లాల్లో కూడా విక్రేతలు, వ్యాపారులు ఐకమత్యంగా ఉండాలని శరద్రావ్ సూచించారు. ప్రభుత్వం స్టాళ్లపై చర్యలు తీసుకునే అధికారాన్ని పోలీసులకు ఇచ్చి స్టాళ్లవారిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కాబట్టి పోలీసులు వస్తే విక్రేతలతో సహా స్టాళ్లవారందరూ వారిని ఎదిరించాలని రావ్ పిలుపునిచ్చారు.