పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఎత్తేయాలి
Published Sat, Aug 17 2013 11:36 PM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వం సువాసనల వక్కపొడి, సువాసనల పొగాకుపై నిషేధం విధించడాన్ని వ్యాపారులు, విక్రేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ముంబై బీడీ-తంబాకు వ్యాపారీ సంఘ్ అధ్యక్షుడు శరద్ రావ్ మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులపై ఆదివారం (18 వ తేదీ)లోగా ప్రభుత్వం నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలోని విక్రేతలు, పాన్ స్టాళ్ల వారు సోమవారం (19 వ తేదీ) నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల ఇంటి ముందు ‘ఘంటానాద్’ చేస్తామని హెచ్చరించారు.
అంతేకాక నిషేధం అసలు అవసరమా? అనేదానిపై అధ్యయనం చేయడానికి కమిటీని నియమించాలని, ఆరు నెలల్లోగా సమితి నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని డిమాండ్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సువాసనల వక్కపొడి, పొగాకుపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఒక స్టాల్ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడని సంఘం కార్యాధ్యక్షుడు నందకుమార్ హెగిష్టే తెలిపారు. ఉత్పత్తిదారులు, విక్రేతలు, డిస్ట్రిబ్యూటర్లకు దీని వల్ల నష్టం ఏర్పడుతోందన్నారు. ఈ వ్యాపారానికి సంబంధించిన రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రచురణదారులు, ఇతర కార్మికులను కలిపి మొత్తం రెండు కోట్ల మంది ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వీరందరూ ఉపాధి కోల్పోతారు. తొలుత వారికి పునరావాసం కల్పించిన తర్వాతే నిషేధం అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
సాంగ్లీ మాదిరిగా ఐక్యతను చూపండి...
సాంగ్లీ జిల్లాలో విక్రేతలపై చర్యలు తీసుకోడానికి వచ్చిన అధికారులను ఘెరావ్ చేశారు. దాంతో వారు వెళ్లిపోయారు. అలా ఇతర జిల్లాల్లో కూడా విక్రేతలు, వ్యాపారులు ఐకమత్యంగా ఉండాలని శరద్‌రావ్ సూచించారు.
ప్రభుత్వం స్టాళ్లపై చర్యలు తీసుకునే అధికారాన్ని పోలీసులకు ఇచ్చి స్టాళ్లవారిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కాబట్టి పోలీసులు వస్తే విక్రేతలతో సహా స్టాళ్లవారందరూ వారిని ఎదిరించాలని రావ్ పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement