ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో మాజీ స్పిన్నర్ అజిత్ చండీలాకు ఊరట లభించింది. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో భాగమైన అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. తాజాగా బీసీసీఐ అంబుడ్స్‌మన్ వినీత్ శరణ్ ఏడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.
విషయంలోకి వెళితే.. 2013 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న చండీల, మాజీ క్రికెటర్ శ్రీశాంత్, అంకిత్ చవాన్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నాడు. బుకీ నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నాడని అజిత్ చండీలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. చండీల ఆ బుకీ చెప్పినట్టుగా చేయనుందుకు అతడికి రూ.20 లక్షలు తిరిగిచ్చేశాడు. మిగతా రూ.5 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పాడు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. ఈ క్రికెటర్ బుకీ నుంచి డబ్బులు తీసుకున్నాడనే విషయాన్ని పోలీసులు ఢిల్లీ కోర్టులో నిరూపించలేకపోయారు. దాంతో, కోర్టులో తీర్పు అజిత్ చండీలాకు అనుకూలంగా వచ్చింది. అందుకని అతను తనపై జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని బీసీసీఐ అంబుడ్స్‌మన్ తలుపు తట్టాడు. తనపై విధించిన నిషేధాన్ని తగ్గించాలని అతను విన్నవించుకున్నాడు. అతని అభ్యర్థనను స్వీకరించిన అంబుడ్స్‌మన్ నిషేధాన్ని తగ్గిస్తూ నిర్ణయం వెల్లడించాడు. ఇప్పటికే అంకిత్ చవాన్, శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం ఎత్తేసిన విషయం తెలిసిందే.
కెరీర్‌లో రెండు ఫస్ట్‌క్లాస్, తొమ్మిది లిస్ట్-ఏ, 28 టి20 మ్యాచ్‌లు ఆడిన అజిత్ చండీలా ఐపీఎల్‌లో 2013 వరకు రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ ఐదో ఎడిషన్‌లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా అజిత్ చండీలా నిలిచాడు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన ఏడో బౌలర్‌గా నిలిచాడు. తనపై ఏడేళ్ల నిషేధం తగ్గించడంపై అజిత్ చండీలా స్పందించాడు.
''ఎంత సంతోషంగా ఉన్నాననేది చెప్పలేను. నా పొరపాటు ఏం లేకున్నా కూడా ఇన్నాళ్లు నేను, నా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. విధిని ఎవరు తప్పించగలరు. అయితే.. దేవుడు నా వైపు ఉన్నాడు. నాపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో దగ్గరి వాళ్లు కూడా దూరం అయ్యారు. అలాగని నేను బాధ పడడం లేదు. ఎందుకంటే మనందరం చనిపోయేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్తాం'' అని చండీలా అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment