Ajit Chandila
-
స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం.. మాజీ క్రికెటర్‌కు ఊరట
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో మాజీ స్పిన్నర్ అజిత్ చండీలాకు ఊరట లభించింది. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో భాగమైన అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. తాజాగా బీసీసీఐ అంబుడ్స్‌మన్ వినీత్ శరణ్ ఏడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. విషయంలోకి వెళితే.. 2013 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న చండీల, మాజీ క్రికెటర్ శ్రీశాంత్, అంకిత్ చవాన్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నాడు. బుకీ నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నాడని అజిత్ చండీలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. చండీల ఆ బుకీ చెప్పినట్టుగా చేయనుందుకు అతడికి రూ.20 లక్షలు తిరిగిచ్చేశాడు. మిగతా రూ.5 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. ఈ క్రికెటర్ బుకీ నుంచి డబ్బులు తీసుకున్నాడనే విషయాన్ని పోలీసులు ఢిల్లీ కోర్టులో నిరూపించలేకపోయారు. దాంతో, కోర్టులో తీర్పు అజిత్ చండీలాకు అనుకూలంగా వచ్చింది. అందుకని అతను తనపై జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని బీసీసీఐ అంబుడ్స్‌మన్ తలుపు తట్టాడు. తనపై విధించిన నిషేధాన్ని తగ్గించాలని అతను విన్నవించుకున్నాడు. అతని అభ్యర్థనను స్వీకరించిన అంబుడ్స్‌మన్ నిషేధాన్ని తగ్గిస్తూ నిర్ణయం వెల్లడించాడు. ఇప్పటికే అంకిత్ చవాన్, శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం ఎత్తేసిన విషయం తెలిసిందే. కెరీర్లో రెండు ఫస్ట్‌క్లాస్, తొమ్మిది లిస్ట్-ఏ, 28 టి20 మ్యాచ్‌లు ఆడిన అజిత్ చండీలా ఐపీఎల్లో 2013 వరకు రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ ఐదో ఎడిషన్‌లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా అజిత్ చండీలా నిలిచాడు. ఐపీఎల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన ఏడో బౌలర్‌గా నిలిచాడు. తనపై ఏడేళ్ల నిషేధం తగ్గించడంపై అజిత్ చండీలా స్పందించాడు. ''ఎంత సంతోషంగా ఉన్నాననేది చెప్పలేను. నా పొరపాటు ఏం లేకున్నా కూడా ఇన్నాళ్లు నేను, నా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. విధిని ఎవరు తప్పించగలరు. అయితే.. దేవుడు నా వైపు ఉన్నాడు. నాపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో దగ్గరి వాళ్లు కూడా దూరం అయ్యారు. అలాగని నేను బాధ పడడం లేదు. ఎందుకంటే మనందరం చనిపోయేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్తాం'' అని చండీలా అన్నాడు. చదవండి: కేఎల్ రాహుల్ విషయంలో మాజీల మధ్య తిట్ల పురాణం 'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్ -
చండీలాపై జీవిత కాల నిషేధం
-
చండీలాపై జీవిత కాల నిషేధం
♦ హికేన్ షాపై ఐదేళ్లు ♦ బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం ముంబై: ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆఫ్ స్పిన్నర్ అజిత్ చండీలాపై జీవిత కాల నిషేధం విధించారు. సోమవారం శశాంక్ మనోహర్ నేతృత్వంలోని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే సహచర ఆటగాడిని ఫిక్సింగ్ కోసం సంప్రదించినందుకు ముంబైకి చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ హికేన్ షాపై ఐదేళ్ల నిషేధం విధించారు. 2013లో జరిగిన ఐపీఎల్ ఎనిమిదో సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చండీలా మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు డబ్బులు తీసుకోవడంతో పాటు ఉద్దేశపూర్వకంగా పేలవ ప్రదర్శన కనబరచడం, మరో ఆటగాడితో ఫిక్సింగ్ చేయించాలని ప్రయత్నించిన ఆరోపణల్లో దోషిగా తేలడంతో బోర్డు కఠిన చర్య తీసుకుంది. ‘బీసీసీఐ అవినీతి వ్యతిరేక కోడ్‌లోని పలు నిబంధనల ప్రకారం చండీలాపై జీవిత కాల నిషేధం విధించాం. ఇక తను బోర్డుకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనడానికి వీల్లేదు. దేశవాళీల్లో సహచర ఆటగాడిని ఫిక్సింగ్ చేయాల్సిందిగా ఒత్తిడి చేసినందుకు హికేన్ షాపై ఐదేళ్ల నిషేధం పడింది. క్రికెట్లో స్వచ్ఛత కోసం మేం పాటుపడుతున్నాం. ఎలాంటి అవినీతి చర్యలకు దిగినా పరిస్థితి సీరియస్‌గా ఉంటుంది’ అని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. మరోవైపు పాక్ అంపైర్ అసద్ రవూఫ్ తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై స్పందించేందుకు సోమవారం నాటి సమావేశానికి హాజరుకాలేదు. అయితే ఈ విచారణ నిస్పాక్షికంగా జరగడం లేదని, తిరిగి మరో విచారణ అధికారి ఆధ్వర్యంలో మొదటినుంచి జరపాలని లేఖ రాశారు. అయితే కమిటీ దీన్ని తిరస్కరించింది. వచ్చే నెల 9లోగా ఫిక్సింగ్ ఆరోపణలపై రాతపూర్వక సమాధానాన్ని పంపించేందుకు ఆయనకు ఆఖరి అవకాశాన్నిస్తున్నట్టు పేర్కొంది. అదే నెల 12న రవూఫ్‌పై నిర్ణయాన్ని ప్రకటిస్తారు. -
ఐపీఎల్ ఫిక్సింగ్; మరో ఇద్దరు క్రికెటర్లపై వేటు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరు క్రికెటర్లపై వేటు పడింది. అజిత్ చండీలాపై జీవితకాలం, హీకెన్ షాపై ఐదేళ్ల చొప్పున బీసీసీఐ నిషేధం విధించింది. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల బృందం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2013 ఐపీఎల్ సీజన్లో అప్పటి రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లతో పాటు చండీలాను ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశాంత్, చవాన్లపై ఇప్పటికే బీసీసీఐ జీవితకాల నిషేధం విధించగా, తాజాగా చండీలా, ముంబై క్రికెటర్ హీకేన్ షాలపై చర్యలు తీసుకుంది. -
ఐపీఎల్ స్పాట్ ఫీక్సింగ్ కేసు
-
ఫిక్సింగ్ ఆటగాళ్లపై బీసీసీఐ అయిదేళ్ల వేటు!
ముంబయి : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నలుగురు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు దోషులుగా తేలారు. శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకీత్ చవాన్ ఫిక్సింగ్ పాల్పడినట్లు బీసీసీఐ దర్యాప్తు కమిటీ నిర్దారించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకీత్ చవాన్‌ల వ్యవహారంపై రవి సవానీ నేతృత్వంలోని దర్యాప్తు కమిటీ విచారణ జరిపింది. కమిటీ విచారణలో నలుగురు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ మేరకు దర్యాప్తు నివేదిక సమర్పించిన కమిటీ... ఆ నలుగురిపై ఐదేళ్ల నుంచి జీవితకాల నిషేధం విధించాలని సూచించింది. కాగా ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కున్న రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా భవితవ్యంపై నేడు బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ ముగ్గురి వ్యవహారంపై ఇప్పటికే అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ రవి సవానీ గత నెలలో బోర్డు వర్కింగ్ కమిటీకి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ నేడు సమావేశం అవుతోంది. అరుణ్ జైట్లీ, నిరంజన్ షా నేతృత్వంలోని ఈ కమిటీ వీరి గురించి చర్చించనుంది. తదనంతరం తమ అభిప్రాయాలను ఈనెల 29న జరిగే వార్షిక సమావేశం ముందుంచుతారు. ఢిల్లీ పోలీసులచే అరెస్ట్ అయిన ఈ త్రయం ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. ఫిక్సింగ్ వ్యవహారం బయటపడగానే ఈ ముగ్గురి ఆటగాళ్ల ఒప్పందాన్ని రాజస్థాన్ జట్టు ఉపసంహరించుకుంది. -
ఫిక్సింగే లేదు: చండీలా
న్యూఢిల్లీ: ఇండి యన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అసలు ఫిక్సింగే జరగలేదని, తన పాత్ర ఏమీ లేకపోయినా పూర్తిగా తప్పుడు కేసులో ఇరికించారని అజిత్ చండీలా వ్యాఖ్యానించాడు. ఇటీవలే బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చండీలా...‘నేను సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లాంటి మేటి క్రికెటర్ల వికెట్లు తీశాను. నా ప్రదర్శన చూస్తే చాలు నేనే తప్పూ చేయలేదని తెలుస్తుంది. పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలే’ అన్నాడు. రెండు నిమిషాలు అజ్ఞాత వ్యక్తులతో మాట్లాడటం తనను దోషిగా రుజువు చేయలేదని, త్వరలోనే నిజాయితీ నిరూపించుకుంటానని చండీలా చెప్పాడు. మరో వైపు ఫిక్సింగ్పై విచారణ నిమిత్తం బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ అక్రమమా, కాదా అన్న అంశంపై విచారణను సుప్రీం కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. -
స్పాట్ ఫిక్సింగ్ కేసులో చండిలా, మరో ఇద్దరికి బెయిల్
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాంలో సస్పెండయిన క్రికెటర్ అజిత్ చండిలా, మరో ఇద్దరికి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో కొన్ని లింకులు అదృశ్యమయ్యాయని వ్యాఖ్యానించింది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన అజిత్ చండిలా, మాజీ రంజీ క్రీడాకారుడు బాబూరావ్ యాదవ్, బుకీ దీపక్ కుమార్‌లకు ఒక్కొక్కరికీ రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతోప ఆటు అంతే మొత్తానికి సమానమైన ఒకరి ష్యూరిటీ కూడా ఇవ్వాలన్న షరతుతో అదనపు సెషన్స్ జడ్జి ధర్మేష్ శర్మ బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో అజిత్ చండిలా మే 16న అరెస్టయ్యాడు. ఇదే కేసులో అరెస్టయిన మరో ఐదుగురు నిందితుల బెయిల్ అభ్యర్థనలను మాత్రం కోర్టు తిరస్కరించింది. వారిలో నలుగురిపై మోకా చట్టం కింద కేసులున్నాయని తెలిపింది. జితేందర్ కుమార్ జైన్, రమేష్ వ్యాస్, అశ్వనీ అగర్వాల్, సునీల్ భాటియా, ఫిరోజ్ ఫరీద్ అన్సారీలకు బెయిల్ దక్కలేదు. సిండికేట్‌తో అజిత్ చండిలాకున్న సంబంధాలు చాలా సుదూరమైనవని కోర్టు వ్యాఖ్యానించింది. కేసులో కొన్ని అంశాలు అదృశ్యం అయ్యాయని, దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. దీనిపై నెల రోజుల్లోగా పరిశీలించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. గతంలో శ్రీశాంత్, అంకిత్ చవాన్లకు మంజూరుచేసిన బెయిల్ రద్దుచేయాలని పోలీసులు కోరగా, దానిపై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేశారు.