స్పాట్ ఫిక్సింగ్ కేసులో చండిలా, మరో ఇద్దరికి బెయిల్
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాంలో సస్పెండయిన క్రికెటర్ అజిత్ చండిలా, మరో ఇద్దరికి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో కొన్ని లింకులు అదృశ్యమయ్యాయని వ్యాఖ్యానించింది. రాజస్థాన్ రాయల్స్కు చెందిన అజిత్ చండిలా, మాజీ రంజీ క్రీడాకారుడు బాబూరావ్ యాదవ్, బుకీ దీపక్ కుమార్లకు ఒక్కొక్కరికీ రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతోప ఆటు అంతే మొత్తానికి సమానమైన ఒకరి ష్యూరిటీ కూడా ఇవ్వాలన్న షరతుతో అదనపు సెషన్స్ జడ్జి ధర్మేష్ శర్మ బెయిల్ ఇచ్చారు.
ఈ కేసులో అజిత్ చండిలా మే 16న అరెస్టయ్యాడు. ఇదే కేసులో అరెస్టయిన మరో ఐదుగురు నిందితుల బెయిల్ అభ్యర్థనలను మాత్రం కోర్టు తిరస్కరించింది. వారిలో నలుగురిపై మోకా చట్టం కింద కేసులున్నాయని తెలిపింది. జితేందర్ కుమార్ జైన్, రమేష్ వ్యాస్, అశ్వనీ అగర్వాల్, సునీల్ భాటియా, ఫిరోజ్ ఫరీద్ అన్సారీలకు బెయిల్ దక్కలేదు.
సిండికేట్తో అజిత్ చండిలాకున్న సంబంధాలు చాలా సుదూరమైనవని కోర్టు వ్యాఖ్యానించింది. కేసులో కొన్ని అంశాలు అదృశ్యం అయ్యాయని, దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. దీనిపై నెల రోజుల్లోగా పరిశీలించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ను ఆదేశించారు. గతంలో శ్రీశాంత్, అంకిత్ చవాన్లకు మంజూరుచేసిన బెయిల్ రద్దుచేయాలని పోలీసులు కోరగా, దానిపై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేశారు.