రహదారుల్ని దిగ్బంధించడం, రాజధానిని ముట్టడించడం ఘర్షణలకు దిగడం, పోలీసుల్ని కిడ్నాప్ చేయడం హింసా మార్గంలోనే డిమాండ్లను సాధించడం మొదట్నుంచి ఇదే వారి పని. మత మౌఢ్యంతో రెచ్చిపోయే ఆ సంస్థను కట్టడి చేయకుండా, వారు చెప్పినట్టుగా తలూపుతున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ టీఎల్‌పీపై నిషేధం ఎత్తివేయడంతో ఏం జరగబోతోంది?
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఉగ్రవాద మూకలకు దాసోహమన్నారు. ఇస్లాం ఉగ్రవాద సంస్థ తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్‌పీ)పై నిషే«ధాన్ని ఎత్తేశారు. పాకిస్తాన్‌లో అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసే నాలుగో షెడ్యూల్ నుంచి టీఎల్‌పీని తొలగిస్తూ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పాకిస్తాన్ కేబినెట్ ఉగ్రవాద నిరోధక చట్టం, 1997 ద్వారా టీఎల్‌పీపై విధించిన నిషేధాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు ఎత్తివేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. గతకొద్ది రోజులుగా టీఎల్‌పీ చేస్తున్న ఆందోళనలకు ఇమ్రాన్ ప్రభుత్వం తలవంచింది. ఉగ్రవాదుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇమ్రాన్ వా రికి మోకరిల్లడంతో పరిణామాలు ఎలా ఉంటాయోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొన్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో లాహోర్‌లో రోడ్లను దిగ్బంధించిన టీఎల్‌పీ కార్యకర్తలు(ఫైల్) (ఇన్‌సెట్ రిజ్వీ)
ఎందుకీ ఆందోళనలు
గతకొద్ది నెలలుగా పాకిస్తాన్‌లో టీఎల్‌పీ హింసను రాజేస్తోంది. ప్రధాన నగరాలను ముట్టడిస్తూ ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హడలెత్తిస్తోంది. మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా ఫ్రాన్స్‌కు చెందిన పత్రిక చార్లీ హెబ్డో ఆయన కేరికేచర్లు ప్రచురించడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. 2015 ఇస్లాం అతివాదులు చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి చేసి 12 మందిని కాల్చిచంపారు. నిందితులకు శిక్ష ఖరారయ్యే దశలో గత ఏడాది ఆ మ్యాగజైన్ పాత కేరికేచర్లను తిరిగి ప్రచురిస్తామని ప్రకటించింది. దీంతో పాక్‌లో నిరసనలు భగ్గుమన్నాయి.
టీఎల్‌పీ చీటికి మాటికి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ఉండడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం టీఎల్‌పీపై ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసి పార్టీ చీఫ్ సాద్ రిజ్విని అరెస్ట్ చేసింది. వీరి డిమాండ్లను పాక్ ప్రభుత్వం తిరస్కరించడంతో రోడ్డెక్కిన టీఎల్‌పీ కార్యకర్తలు అక్టోబరు చివరి వారంలో ప్రధాన నగరాలను దిగ్బంధించారు. ఇస్లామాబాద్, రావల్పిండిలకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు లేకుండా హైవేలను దిగ్బంధించారు. హింసను నిరోధించడానికి పాక్ ప్రభుత్వం వాళ్ల డిమాండ్లు అన్నింటికి అంగీకరించకుండా మధ్యేమార్గంగా అరెస్టయిన టీఎల్‌పీ సభ్యులు 2 వేల మందిని ఇటీవల జైళ్ల నుంచి విడుదల చేసింది. అయినా ఆ సంస్థ పట్టు వీడలేదు.
పాక్‌లో ఫ్రాన్స్ రాయబారిని బహిష్కరించాలని, టీఎల్‌పీ చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్విని విడుదల చేయాలని, తమపై ఉగ్రవాద సంస్థ ముద్రను తొలగించాలని , రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ గుర్తింపునివ్వాలన్న డిమాండ్లతో హింసకు దిగింది. గత వారంలో లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కి లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌కు వేలసంఖ్యలో మద్దతుదారులు పోటెత్తడంతో ప్రభుత్వం రాజీ కొచ్చింది. మతపెద్దలను రంగంలోకి దింపి.. సంప్రదింపుల ద్వారా రాజీ కుదుర్చుకుంది. దాంతో టీఎల్‌పీ రాజధాని ముట్టడిని విరమించుకుంది. ఇటీవల టీఎల్‌పీ సృష్టించిన విధ్వంసంలో 21 మంది మరణించగా, అందులో 10 మంది పోలీసులే.
పరిణామాలు ఎటు దారి తీస్తాయి ?
టీఎల్‌పీకి పూర్తి స్థాయిలో ఇమ్రాన్ ప్రభుత్వం మోకరిల్లడంపై పాక్ మేధోవర్గంలోనూ, అంతర్జాతీయంగా ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ సంస్థ ఏర్పాటయ్యాక హింసామార్గంలోనే ప్రభుత్వాన్ని కనీసం ఏడుసార్లు దారిలోకి తెచ్చుకుంది. అయిదేళ్లలో ఏడుసార్లు అతి పెద్ద నిరసన కార్యక్రమాలకు దిగింది. మరోసారి టీఎల్‌పీ ప్రధాన డిమాండ్లన్నింటికీ ప్రభుత్వం అంగీకరించడంతో ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ప్రధాని ఇమ్రాన్‌పై విరుచుకుపడింది. టీఎల్‌పీ చెప్పుచేతల్లోకి ప్రభుత్వం వెళ్లిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా కూడా ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తోంది.
దేశం అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోవడం, ఐఎస్‌ఐ కొత్త చీఫ్ నియామకం వంటి చర్యలతో ఇప్పటికే ఇమ్రాన్ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. టీఎల్‌పీపై నిషేధాన్ని ఎత్తివేస్తే ఆ సంస్థ సానుభూతిపరుల మద్దతు లభిస్తుందన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యమేలుతూ ఉండడం పాక్ కూడా అదే మార్గంలో ఉగ్రవాదులకు బహిరంగంగానే మద్దతు పలుకుతూ ఉండడంతో పరిస్థితులు ఎటువైపు తిరుగుతాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి.
ఏమిటీ టీఎల్‌పీ ?
తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ అంటే మహమ్మద్ ప్రవక్త అనుచరుల ఉద్యమం (బరేల్వి) అని అర్థం. ఇస్లాంను దూషించేవారిని కఠినంగా శిక్షించడం, దీనికి సంబంధించిన చట్టాలను పకడ్బందీగా అమలయ్యేలా చూడడానికే ఈ సంస్థ పుట్టుకొచ్చింది. పాకిస్తాన్‌లో సగం మంది ప్రజల్లో బరేల్వి ఉద్యమం పట్ల మద్దతు ఉంది. సూఫీ సంప్రదాయాలతో కూడిన ఇస్లాంను వ్యాప్తి చేయడమే వీరి ఉద్దేశం. పాకిస్తాన్‌లోని దైవదూషణకి సంబంధించిన చట్టాలను సంస్కరించాలని ప్రయత్నించిన పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్‌ని పోలీసు గార్డ్ ముంతాజ్ ఖాద్రి 2011లో దారుణంగా హతమార్చాడు.
ఖాద్రిని జైలు నుంచి విడుదల చెయ్యాలన్న డిమాండ్‌తో 2015లో లాహోర్ మసీదులోని మతబోధకుడు ఖాదిమ్ హుస్సేన్ రిజ్వి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఖాద్రికి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయడంతో అతని అంతిమ యాత్రలో తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ పాకిస్తాన్ పేరుతో రాజకీయ పార్టీగా అవతరించింది. వేలాది మంది ఇస్లాం అతివాదులు ఈ పార్టీలో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన టీఎల్‌పీ సింధ్ ప్రావిన్స్‌లో రెండు స్థానాలను గెలుచుకుంది. గత ఏడాది నవంబర్‌లో ఖాదిమ్ అనారోగ్యంతో మరణించగా అతని కుమారుడు సాద్ రిజ్వి టీఎల్‌పీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment