ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ గద్దె దిగిపోవడానికి సమయం దగ్గరకొస్తోంది. సుప్రీం కోర్టు నిర్ణయంతో శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంటులోని దిగువ సభ జాతీయ అసెంబ్లీలో ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభలో మెజార్టీ లేకపోయినప్పటికీ ఆఖరి బాల్ వరకు పోరాడుతానంటూ ఇమ్రాన్ ఇంకా మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్‌లో ప్రతిపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
విపక్షాలన్నీ చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గలేక ఇమ్రాన్ గద్దె దిగిపోతే అధ్యక్షుడు అరిఫ్ అల్వీని తొలగించడానికి ప్రణాళికలు రూపొందించాయి. అదే విధంగా యూకేలో ప్రవాసానికి వెళ్లిపోయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని తిరిగి పాక్‌కి తేవాలని భావిస్తున్నాయి. పాకిస్తాన్ ముస్లింమ్ లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) అధ్యక్షుడు, జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు షెబాజ్ షరీఫ్ (70) కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
ప్రమాణ స్వీకారమయ్యాక ఆయన ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి వెల్లడించే అవకాశాలున్నాయని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఒక నివేదికలో వెల్లడించింది. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా విపక్షాల అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర దాగి ఉందన్న ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రభుత్వం. రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ తారిక్ ఖాన్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వీధుల్లో నిరసన తెలపండి: ఇమ్రాన్
పాకిస్తాన్‌లో ‘దిగుమతి అయిన ప్రభుత్వాన్ని’ ఎంతమాత్రం అంగీకరించబోనని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం తేల్చిచెప్పారు. తనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ‘బెదిరింపు లేఖ’ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. శనివారం అవిశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్న ఇమ్రాన్ పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం సాయంత్రం తనతో కలిసి వీధుల్లో నిరసన తెలపాలని మద్దతుదారులకు సూచించారు. దీన్నిబట్టి పదవి నుంచి దిగిపోక తప్పదన్న నిర్ణయానికి ఆయన వచ్చి నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి, పదవి నుంచి తప్పుకున్న తొలి పాక్ ప్రధానిగా చరిత్రకెక్కుతారు.
Comments
Please login to add a commentAdd a comment