![Today is the no-confidence test for Pak PMM Imran Khan - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/3/PAK-PM.jpg.webp?itok=YP0ZpARM)
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో ఆదివారం ఓటింగ్ జరుగనుంది. తక్షణ రాజీనామా, అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం, ఎన్నికలకు వెళ్లడమనే మూడు ఆప్షన్లను ప్రత్యర్థులు తనకిచ్చారని ఇమ్రాన్ శనివారం చెప్పారు. వారెవరన్నది బయట పెట్టలేదు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి క్షణం దాకా పోరాడతానని స్పష్టం చేశారు. కొందరు ద్రోహులు తమ కూటమిని వీడి విపక్షాలతో చేతులు కలిపారని మండిపడ్డారు.
ఎంపీలను సంతల్లో మేకల్లా కొనేస్తున్నారని ధ్వజమెత్తారు. విదేశీ కుట్రకు స్వదేశీ నేతలు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన లాయర్లతో మాట్లాడానని, ద్రోహులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యువత నిశ్శబ్దం వీడాలని కోరారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వీగిపోవాలంటే ఆయనకు అనుకూలంగా 172 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ, తమకు 175 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రతిపక్ష కూటమి చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment