నెల రోజులుగా పదవీ గండం ఎందుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (69) కీలక సమయంలో తనలోని కెప్టెన్‌ను పూర్తిస్థాయిలో బయటికి తీశారు. అవిశ్వాస తీర్మానంపై డిప్యూటీ స్పీకర్‌తో పదునైన యార్కర్ వేయించారు. ఆ తీర్మానం చెల్లదనే నిర్ణయంతో విపక్షాలను డిప్యూటీ స్పీకర్ క్లీన్‌బౌల్డ్ చేయగానే జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసేశారు. అందుకు అధ్యక్షుడు ఆమోదముద్ర వేయడంతో దేశంలో ముందస్తు ఎన్నికల నగారా మోగింది. ఇదంతా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఇమ్రాన్ యార్కర్‌ను నో బాల్‌గా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే విచారణపై అంతటా ఉత్కంఠ నెలకొంది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఇమ్రాన్‌ఖాన్‌పై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం జరిగిన జాతీయ అసెంబ్లీ కీలక సమావేశం అనూహ్య పరిణామాలకు వేదికైంది. డజనుకు పైగా అధికార పార్టీ సభ్యులు కూడా తీర్మానానికి మద్దతివ్వడంతో ఇప్పటికే మైనారిటీలో పడిన ఇమ్రాన్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడటం లాంఛనమేనని అంతా భావించారు.
స్పీకర్ అసద్ ఖైజర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవచ్చన్న అనుమానంతో సమావేశం మొదలవగానే విపక్షాలు ఆయనపై అవిశ్వాస నోటీసు కూడా ఇచ్చాయి. దాంతో సమావేశానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి, తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి విపక్షాలకు ఊహించని షాకిచ్చారు. ‘‘తీర్మానం దేశ రాజ్యాంగానికి, నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ అదలా లేదని న్యాయ మంత్రి స్పష్టంగా చెప్పారు. అది విదేశీ కుట్రలో భాగంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అందుకే తీర్మానాన్ని తిరస్కరిస్తున్నా’’ అని ప్రకటించారు. ఆ వెంటనే సభను వాయిదా వేశారు. దీనిపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి.
ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ దుయ్యబట్టాయి. నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేదాకా సభను వీడేది లేదన్నాయి. సభలో గలాభా జరుగుతండగానే ఇమ్రాన్ హుటాహుటిన అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కలిసి జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం, అందుకు ఆయన ఆమోదముద్ర వేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇమ్రాన్ ఇచ్చిన వరుస షాకులతో నోరెళ్లబెట్టడం విపక్షాల వంతైంది. పాక్ చరిత్రలో ఇప్పటిదాకా ఏ ప్రధానీ పూర్తికాలం పాటు పదవిలో కొనసాగలేదు. షెడ్యూల్ ప్రకారం పాక్‌లో 2023 ఆగస్టులో ఎన్ని కలు జరగాల్సి ఉంది. ఇమ్రాన్ 2018 ఆగస్టు 18న దేశ 22వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
విదేశీ కుట్ర భగ్నం: ఇమ్రాన్
జాతీయ అసెంబ్లీ రద్దు సిఫార్సు అనంతరం ఇమ్రాన్ జాతిని ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానం ముసుగులో ప్రభుత్వాన్ని మార్చేందుకు జరిగిన విదేశీ కుట్రను విజయవంతంగా అడ్డుకున్నట్టు ప్రకటించారు. దేశ భవితవ్యాన్ని అవినీతి శక్తులు నిర్ణయించలేవన్నారు.
ఎన్నికలకు సిద్ధమవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానం నిజానికి విదేశీ కుట్రలో భాగమని అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ ఆరోపించారు. తీర్మానం నెగ్గి ప్రభుత్వం పడిపోగానే ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి కుట్ర జరిగిందన్నారు. దాన్ని భగ్నం చేశామని, 90 రోజుల్లోపు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఇమ్రాన్ 15 రోజుల పాటు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారన్నారు. ఈ పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని సైన్యం అధికార ప్రతినిధి బాబర్ ఇఫ్తికర్ ప్రకటించారు.
అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీం నోటీసులు
జాతీయ అసెంబ్లీ రద్దును విపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇమ్రాన్‌ను దేశద్రోహి అంటూ విపక్ష నేతలు షాబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జర్దారీ, మరియం ఔరంగజేబ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పిరికి నిర్ణయాల ద్వారా తన తప్పిదాలను పరోక్షంగా అంగీకరించారని దుయ్యబట్టారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ విపక్షాలు సుప్రీంకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. అత్యవసరంగా విచారణకు స్వీకరించి తక్షనం తీర్పు వెల్లడించాలని కోరాయి.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం ఉదంతంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ అసెంబ్లీ రద్దు విషయంలో అధ్యక్షుడు, ప్రధాని తీసుకున్న నిర్ణయాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ తదితరులకు నోటీసులు జారీ చేసి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు ఎలాంటి రాజ్యాంగవిరుద్ధ చర్యలకూ పాల్పడొద్దని ఇరు వర్గాలనూ ఆదేశించింది.
రాజ్యాంగ విరుద్ధమే: నిపుణులు
డిప్యూటీ స్పీకర్ చర్య, జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు రెండూ రాజ్యంగ విరుద్ధమేనని పాక్ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు ఆర్టికల్ 6 ప్రకారం వారిద్దరిపై న్యాయ విచారణ జరిగే చాన్సుందని సుప్రీంకోర్టు బార్ అధ్యక్షుడు అషన్ భూన్ అన్నారు. మైనారిటీలో పడటమే గాక పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న ప్రధానికి సభ రద్దుకు సిఫార్సు చేసే అధికారం ఉండదని ప్రముఖ న్యాయ నిపుణుడు, కేంద్ర మాజీ మంత్రి అభిషేక్ మను సింఘ్వి కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ చౌధరి సర్వర్‌ను ఇమ్రాన్ బర్తరఫ్ చేశారు.
అవిశ్వాసం నుంచి అవిశ్వాసం దాకా...
2021లో ఇమ్రాన్ తొలిసారి అవిశ్వాస పరీక్ష గట్టెక్కిన నాటి నుంచి జాతీయ అసెంబ్లీ రద్దు దాకా పాకిస్థాన్‌లో జరిగిన కీలక రాజకీయ పరిణామాలు...
► 2021 మార్చి 3: సెనేట్ ఎన్నికల్లో ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్‌పై విపక్ష నేత యూసుఫ్ రజా గిలానీ నెగ్గడంతో తొలిసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ఇమ్రాన్ ప్రభుత్వం
► మార్చి 6: అవిశ్వాస పరీక్షను నెగ్గిన ఇమ్రాన్
► 2022 మార్చి 8: ద్రవ్యోల్బణం అదుపులో విఫలమయ్యారంటూ ఇమ్రాన్‌పై మరోసారి విపక్షాల అవిశ్వాస తీర్మానం
► మార్చి 19: విపక్ష కూటమికి మద్దతు ప్రకటించిన పలువురు అధికార పీటీఐ ఎంపీలకు ఇమ్రాన్ షోకాజ్ నోటీసులు
► మార్చి 25: అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించకుండానే సభను వాయిదా వేసిన స్పీకర్
► మార్చి 27: తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని ఇమ్రాన్ ఆరోపణ
► మార్చి 28: జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్ష నేత షాబాజ్ షరీఫ్
► మార్చి 30: కీలక భాగస్వామ్య పక్షం విపక్షాలతో చేతులు కలపడంతో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ప్రభుత్వం
► ఏప్రిల్ 1: తనకు ప్రాణహాని ఉందని ఇమ్రాన్ ఆరోపణ
► ఏప్రిల్ 3: అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్ ఖసీం సూరి. జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదం. వారి నిర్ణయాలు తమ విచారణకు లోబడి ఉంటాయన్న సుప్రీంకోర్టు.
Comments
Please login to add a commentAdd a comment