ఇస్లామాబాద్: జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ గురువారం సంచలన ప్రకటన చేశారు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తానని విపక్షాలకు ఇమ్రాన్ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఓ ముఖ్యమైన వ్యక్తి ద్వారా జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన షాబాజ్ షరీఫ్‌కు ప్రధానమంత్రి సందేశాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇమ్రాన్ ఇచ్చిన ఆఫర్‌ను ప్రతిపక్షాలు అంగీకరిస్తే పాక్‌లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ ఆఫర్‌ను ప్రతిపక్షాలు తిరస్కరించినట్లు సమాచారం.
ఏప్రిల్ 3కు వాయిదా
పాకిస్తాన్ పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే డిప్యూటీ స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో పాకిస్తాన్ పార్లమెంట్ ఏప్రిల్ 3కు వాయిదా పడింది. కాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మార్చి 28న ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత, పీఎంఎల్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ ఫరీఫ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
జాతినుద్దేశించి ప్రసంగం
తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో జాతీయ భద్రతా కమిటీతో ఇమ్రాన్ ఖాన్‌కు గురువారం అత్యవసర సమావేశం కానున్నారు. ప్రధాని నివాసంలోనే ఆ మీటింగ్ జరగనుంది. ప్రధాని ఇమ్రాన్‌తో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
నెగ్గడం కష్టమే..
అవిశ్వాస తీర్మానం నుంచి ఇమ్రాన్ ఖాన్ గట్టేక్కడం కష్టతరంగా మారింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ అవిశ్వాసంలో నెగ్గాలంటే 172 సభ్యుల ఓట్లు అవసరం. ప్రస్తుతం ఇమ్రాన్‌కు మిత్రపక్షంతో కలిపి 176 మంది సభ్యుల బలముంది. అయితే ఎంక్యూఎం-పీ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించడంతో ఇమ్రాన్ ప్రభుత్వం బలం 163కి పడిపోయింది. అంతేగాక సొంతపార్టీ పీటీఐ నుంచి 12 మందికి పైగా ఎంపీలు సైతం ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించాయి. కానీ వారు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం తీవ్ర విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంది. అవిశ్వాస తీర్మానానికి ముందే ఇమ్రాన్ ఇంటి దారి పట్టేలా కనిపిస్తోంది.
అయితే ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయమన్న వార్తల నేపథ్యంలోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేసే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి ఎలాగైనా దింపేందకు అవసరమైన బలాన్ని విపక్షాలు కూడగడుతున్నాయి. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ దిగిపోతే ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్ షహబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు పాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment