సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నియంత్రించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజస్(ఎన్‌సీడీ) 2.0 సర్వే ద్వారా పొగాకు వ్యసనపరులను గుర్తిస్తోంది. ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్ చేస్తున్నారు. బీడీ, చుట్టా, సిగరెట్‌తో పాటు, గుట్కా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్న వారి వివరాలను తెలుసుకుంటున్నారు.
ఇప్పటికే 2,13,12,792 మందిని స్క్రీనింగ్ చేసి.. 2,96,226 మంది పొగాకు వ్యసనపరులను గుర్తించారు. వీరిని పొగాకు వినియోగం నుంచి దూరం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి వైద్య నిపుణులు ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,86,303 మందికి ఫోన్ చేశారు. తొలుత కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్ పొగాకు వినియోగించే వ్యక్తికి ఫోన్ చేసి ఆ వ్యక్తి ఏం పనిచేస్తుంటారు? ఎన్నేళ్ల నుంచి పొగాకు వినియోగిస్తున్నారు? తదితర వివరాలను తెలుసుకుంటున్నారు. పొగాకు వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తున్నారు.
వ్యసనాన్ని వీడటానికి మొగ్గు చూపిన వారిని కాల్ సెంటర్‌లోని కౌన్సెలర్‌కు ట్యాగ్ చేస్తున్నారు. వారు పొగాకు వినియోగాన్ని వీడేలా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అనంతరం జిల్లాల్లోని డీ–అడిక్షన్ సెంటర్లకు సంబంధిత వ్యక్తులను ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,86,303 మందికి గాను 10,066 మంది పొగాకు వినియోగాన్ని వదలిపెట్టేందుకు ముందుకు వచ్చారు. డీ–అడిక్షన్ సెంటర్లలోని వైద్యులు వీరికి ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. మరోవైపు డీ–అడిక్షన్ సెంటర్‌కు మ్యాపింగ్ అయిన వ్యక్తులకు అక్కడ చికిత్స ఏ విధంగా అందుతోంది? వారిలో మార్పు వచ్చిందా? అనే అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వెబ్ అప్లికేషన్ రూపొందిస్తున్నారు. త్వరలో ఈ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment