సాక్షి, అమరావతి : వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో పైరవీలు, పలుకుబడుల సంప్రదాయానికి సీఎం జగన్ సర్కార్ చెక్ పెట్టింది. అడ్డగోలు డిప్యుటేషన్‌లను రద్దు చేసింది. ఉద్యోగులు డీఎంహెచ్‌వో, ఆర్డీ, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, అధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితికి తావివ్వకుండా వైద్య శాఖ చరిత్రలో తొలి సారి ఆన్‌లైన్ బదిలీలను చేపట్టింది. ఏపీ వైద్య విధాన పరిషత్ మినహా అన్ని విభాగాల్లో ఐదేళ్లు ఒకే చోట పని చేసిన ఉద్యోగుల్లో 30 శాతం మందిని ఇటీవల బదిలీ చేశారు. సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, స్పౌజ్ కోటా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ పారదర్శకంగా బదిలీలు చేపట్టారు.
ఉద్యోగులు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే పోస్టింగ్‌లు వచ్చాయి. ఎలాంటి పైరవీలు లేకుండా రాష్ట్ర చరిత్రలో వైద్య శాఖలో తొలిసారి ఇలా బదిలీలు చేపట్టడం ఓ రికార్డు అని, చంద్రబాబు పాలనలో ఈ తరహాలో ఏనాడైనా బదిలీలు జరిగాయా అని వైద్య శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లో అన్ని హోదాల్లో 3,710 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఐదేళ్లు ఒకే చోట సర్వీస్ పూర్తి చేసుకున్న వారిలో 923 మంది, రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకున్న 117 మంది.. మొత్తంగా 1,040 మంది బదిలీ అయ్యారు. వీరిలో ఇప్పటికే 1,022 మంది బదిలీ అయిన స్థానాల్లో రిపోర్ట్ చేశారు. ప్రజారోగ్య విభాగంలో 104 క్యాడర్‌లలో 4,761 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. వీరిలో ఇప్పటికే మెజారిటీ శాతం మంది కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు.
విప్లవాత్మక నిర్ణయాలు..
ఉమ్మడి రాష్ట్ర ఆవిర్భావం నుంచి వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెనుమార్పులను సీఎం వైఎస్ జగన్ సర్కార్ తీసుకువస్తోంది. నాడు–నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మారుస్తోంది. రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో మరమ్మతులు చేస్తున్నారు. భవనాలు, ఉపకరణాలు సమకూరుస్తున్నారు. వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీ, ఉద్యోగుల బదిలీలు, వారికి ఉద్యోగోన్నతుల్లోనూ నూతన శకాన్ని ప్రారంభించారు. గతంలో వైద్య శాఖలో ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతులు ప్రహసనంలా ఉండేవి. పాలకుల అండ ఉన్న వారికి మాత్రమే అగ్రతాంబూలం దక్కేది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసింది.
Comments
Please login to add a commentAdd a comment