బదిలీలకు వేలాయె!
- నేడు కౌన్సెలింగ్ ప్రారంభం
- కుప్పలు తెప్పలుగా సమస్యలు
- చాలా అంశాల్లో కొరవడిన స్పష్టత
- జీఓ అమలు చేయాలంటూ సాయంత్రం ఉత్తర్వులు
- గందరగోళంలో ఉపాధ్యాయులు
- ఉదయం హెచ్ఎంలు, మధ్యాహ్నం పీడీలు, పీఈటీలకు కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది. చాలా అంశాల్లో స్పష్టత లేకుండానే కౌన్సెలింగ్‌కు ముందుకు వెళ్తున్నారు. శనివారం స్థానిక సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ప్రధానోపాధ్యాయులకు, మధ్యాహ్నం 2 గంటలకు పీడీ, పీఈటీలకు కౌన్సెలింగ్ ఉంటుందని డీఈఓ లక్ష్మీనారాయణ శుక్రవారం తెలిపారు. ప్రాథమిక సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి సరిచేసి శుక్రవారం నాటికి తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది.
కానీ అర్ధరాత్రి వరకు తుదిజాబితా రాలేదు. రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) ద్వారా ఎన్ని స్కూళ్లు మూతపడుతున్నాయి..ఎన్ని పోస్టులు ఇతర స్కూళ్లకు విలీనం అవుతున్నాయి...ఎంతమంది టీచర్లు ప్రభావితం అవుతున్నారనే వివరాలపై చివరి రోజు వరకు స్పష్టత లేదు. అలాగే సబ్జెక్టుల వారీగా ఖాళీలు లేక్క తేల్చనేలేదు. ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపామని చెప్తున్నా.. ఎప్పుడు ఆమోద ముద్ర పడుతుందో వారికే తెలియాలి. దీంతో అన్ని కేడర్ల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 177 మంది ప్రధానోపాధ్యాయులు, 218 మంది పీఈటీలు, 49 మంది పీడీలు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు.
జీఓ అమలు చేయాలంటూ ఉత్తర్వులు :
70 శాతం వికలత్వం ఉంటే ప్రిపరెన్షియల్ కేటగిరీకి అర్హులు. అయితే తాజాగా ఇచ్చిన 50 జీఓ ప్రకారం 40 శాతం వికలత్వం ఉంటే చాలు ప్రిపరెన్షియల్ కేటగిరీకి అర్హులు. గురువారం జీఓ విడుదల చేసినా...జిల్లా అధికారులకు శుక్రవారం సాయంత్రం 50 జీఓ అమలు చేయాలంటూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అనేక సమస్యలతో అల్లాడుతున్న విద్యాశాఖ సిబ్బంది ఆగమేఘాల మీద ప్రధానోపాధ్యాయులకు గ్రూపు మెసేజ్‌లు, వాట్సాఫ్ల ద్వారా సమాచారం చేరవేశారు. 50 జీఓ ప్రకారం 40 శాతం వికలత్వం కలిగిన హెచ్ఎంలు రాత్రి 8 గంటలకు సంబంధిత వైద్యధ్రువీకరణ పత్రం, ఎస్ఆర్, దరఖాస్తు హార్డ్‌కాపీ తీసుకొని సైన్స్సెంటర్కు రావాలని సమాచారం ఇచ్చారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి రావాలంటే ఎలా సాధ్యమని హెచ్ఎంలు మండిపడుతున్నారు.
కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి :
కౌన్సెలింగ్ నిర్వహించడానికి జిల్లా సైన్స్ సెంటర్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు హెచ్ఎంల కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఉపాధ్యాయినులు ఒకరిని తోడుగా కేంద్రంలోకి తీసుకెళ్లవచ్చు. బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ తీసుకునే కౌన్సెలింగ్ హాలులోకి అనుమతిస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు పీడీలు, పీఈటీలకు కౌన్సెలింగ్ ఉంటుంది.
సమస్యలు దండిగా...:
అనేక సమస్యలపై స్పష్టత కరువైంది. అర్హులైన వారికి రావాల్సిన పాయింట్లు రాలేదు. అనర్హులకు వచ్చిన పాయింట్లు తొలిగించలేదు. అయినా కౌన్సెలింగ్ ప్రక్రియను మొండిగా కొనసాగిస్తున్నారు. ఒకటి రెండు పాయింట్ల తేడాతోనే సీనియార్టీ జాబితాలో వందల సంఖ్య తేడాలోకి వెళ్తారు. రావాల్సిన పాయింట్లు కూడా రాక, అధికారులు పట్టించుకోక టీచర్లు అల్లాడిపోతున్నారు.
– తాడిపత్రి మండలం బోడాయిపల్లి, వెలమనూరు, యల్లనూరు మండలం వేములపల్లి, గుత్తి మండలం అబ్బేదొడ్డి, యాడికి మండలం సి.వెంగనపల్లి, నగరూరు తదితర పాఠశాలలు గతంలో నాల్గో కేటగిరిలో ఉన్నాయి. వీటిలో కొన్ని స్కూళ్లు 2–3 ఏళ్లు ఉన్నా.. 4–5 ఏళ్లు నాల్గో కేటగిరీ ఉన్నట్లు పాయింట్లు వాడుకున్నారు. అయితే కొందరు టీచర్లు పొరబాటున ఈ పాయింట్లు వేసుకున్నామని రాతపూర్వకంగా రాసిచ్చినా...ఆన్లైన్లో మాత్రం అప్డేట్ కాలేదు. నేటికీ పాయింట్లు అలానే కొనసాగుతున్నాయి.
– ఎండీఎంకు సంబంధించిన రూపొందించిన యాప్‌లో బెళుగుప్ప మండలం కాలువపల్లి, పామిడి మండలం ఖాదర్‌పేట స్కూళ్లు లేవు. దీనికి హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండు స్కూళ్లకు ఎండీఎం పాయింట్లు ‘0’గా చూపుతున్నాయి. హెచ్ఎంతో పాటు టీచర్లందరూ పాయింట్లు కోల్పోవాల్సిన పరిస్థితి. అధికారులతో పాటు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు.
– యూపీ స్కూళ్ల హెచ్ఎంలు సీసీఈ పాయింట్లు లేదా హెచ్ఎం పాయింట్లలో ఏదో ఒకటి పొందొచ్చని స్వయంగా కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. చాలా మంది హెచ్ఎంలు ఫిర్యాదులు చేసినా పాయింట్లు జనరేట్ కాలేదు.
– నార్పల మండలం పి.బండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో నలుగురు టీచర్లు పని చేస్తున్నారు. వీరందరికీ సీసీఈ పాయింట్లు నమోదు కాలేదు. ఫిర్యాదు చేయగా ముగ్గురి టీచర్లకు జనరేట్ అయ్యాయి. బి. చంద్ర అనే టీచరుకు పాయింట్లు జనరేట్ కాలేదు. అయితే పాయింట్లు అయినట్లు మొబైల్‌కు ఎస్ఎంఎస్ వచ్చింది కానీ దరఖాస్తులో పాయింట్లు మారలేదు.