నేడు తిరంగా యాత్ర ముగింపు సభ
- హన్మకొండ జేఎన్ఎస్లో సాయంత్రం నాలుగు గంటలకు..
- హాజరుకానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
- పూర్తికావొచ్చిన ఏర్పాట్లు
హన్మకొండ : బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తిరంగా యాత్ర ముగింపు సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హన్మకొండ జేఎన్ఎస్లో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొననుండగా.. సభను విజయవంతం చేసేందుకు బీజేపీ అర్భన్, రూరల్ జిల్లా శాఖలు తీవ్రంగా శ్రమించాయి.
గత అయిదు రోజులుగా వర్షం కురుస్తుండడంతో శనివారం జరుగనున్న సభకు అటంకం కలుగకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ నిర్వహించనున్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వర్షం కురిసినా సభకు హాజరైన వారు తడవకుండా రూ.28 లక్షల వ్యయంతో రేకులతో పెద్ద ఎత్తున షెడ్ వేశారు. 50 వేల మంది సభకు హాజరవుతారని పార్టీ నాయకులు భావిస్తున్నారు. నిజాం పాలన నుంచి విమోచనం పొందిన రోజును తెలంగాణ స్వాతంత్య్ర దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ గత కొనేళ్లుగా డిమాండ్ చేస్తోంది. అయితే, పాలకులు స్పందించకపోవడంతో బీజేపీ ఆధ్వర్యాన ఏటా సెప్టెంబర్ 17న జాతీయ పతాకాన్ని అవిష్కరిస్తూ తెలంగాణ విమోచన దినంగా నిర్వహిస్తునఆనరు. అయితే, ఈసారి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్న సందర్భంగా ఆనాడు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడం, జీవించి ఉన్న వారిని సన్మానించేందుకు తిరంగా యాత్ర చేపట్టారు. అయితే, ఈ యాత్ర ఆగస్టులో ముగియాల్సి ఉన్నా తెలంగాణకు సెప్టెంబర్ 17న స్వాతంత్య్ర దినం రావడంతో అప్పటి వరకు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు యాత్ర కొనసాగించారు. అయితే, తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ నాయకులు తిరంగా యాత్ర, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణకు ప్రధాన కేంద్రంగా ఉన్న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
రోడ్డు మార్గాన సభకు..
హన్మకొండలో శనివారం జరగనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రోడ్డు మార్గాన రానున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గాన వస్తారు. కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సభలో పాల్గొనున్న నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, కమిషనర్ జి.సుధీర్‌బాబు జేఎన్ఎస్లో ఏర్పాట్లను ఏసీపీ శోభన్‌కుమార్, సీఐ సంపత్‌రావుతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.