నిన్నటి హీరో నేటి విలన్!
విశ్లేషణ
విజయ్ మాల్యా ఎన్ని తప్పులు చేసినా, ఎంపీలలో ఒక సెలబ్రిటీనే. ఆయన వారిలో ఒకరు కాడు, వారిలోని ఉన్నత శ్రేణికి చెందిన వాడు. తమలో ఒకడే అయిన అతగాడు హఠాత్తుగా విలన్‌గా ఎలా మారిపోయాడు?
మాల్యా, మహారాజా లా జీవించిన వ్యాపార వేత్తగానే ఎక్కువగా కనిపించేవాడు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక వ్యవహారాలలో లాగా తప్పుడు వ్యాపా ర నిర్ణయాలు తీసుకు న్నారు. ఆ తప్పుల వల్ల మాల్యా ప్రధాన కార్య రంగమైన లిక్కర్ వ్యాపార ప్రయోజనాలు కూడా దెబ్బతిన్నాయి. దాదాపు రూ. 750 కోట్ల డాలర్ల వరకు వచ్చిన ఆ నష్టాల నుంచి ఆయన ఐదేళ్లకుగానీ బయటపడలేదు.
ఆ లిక్కర్ సామ్రాజ్యాధినేత అన్ని రాజ కీయపార్టీలతోనూ సంబంధాలున్న రాజకీయ వేత్త కూడా. కర్ణాటక నుంచి ఆయన రెండు దఫా లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇది రెండవ దఫా. మొదటిసారి ఆయనను జనతాదళ్ (లౌకిక వాద) రాజ్యసభకు పంపగా, బీజేపీ, కాంగ్రెస్‌లు మద్దతిచ్చాయి. అవసరమైన దాని కంటే ఎక్కువ ఓట్లు రావడమే ఆయనకున్న వ్యాపార- రాజకీయానుబంధాన్ని చాలా వరకు చెబు తుంది. ఆయనలాంటి వారిని, వారికున్న వనరు లను చూశాక, కాదు అని చెప్పడం కష్టం.
కింగ్‌ఫిషర్ ఎయిర్వేస్కు బ్యాంకులు అంత భారీ ఎత్తున రుణాలను ఇవ్వడాన్ని, వాటిలో కొంత భాగాన్ని అవి షేర్లుగా మార్చుకోవడాన్ని ఇది కొంత వరకు వివరించవచ్చు. రూ. 9,000 కోట్ల భారీ రుణం ఉన్నా మాల్యాను ఆ బ్యాంకులు సహా అంతా ఎంతో గౌరవంగా చూశారు. అందుకు భిన్నంగా, తమిళనాడుకు చెందిన రైతు జీ బాలన్ అప్పు చెల్లించ లేదని ఒక ప్రైవేటు బ్యాంకు ఏజెంట్లు, పోలీసులు కలిసి అతన్ని చావ బాదారు. పలువురు ఇతర రైతులు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. బ్యాం కుల నుంచి అప్పు తీసుకునేవారిలో స్పష్టంగానే రెండు రకాల వారుంటారు. నిర్దాక్షిణ్యంగా అప్పు తిరిగి చెల్లించేంతవరకు వెంటపడాల్సినవారు ఒక రకం బకాయిదారులు. ఇక అప్పులు తిరిగి చెల్లించలేకపోయినా, మళ్లీ అప్పులివ్వాల్సిన మాల్యాలాంటి వారు రెండో రకం. అప్పుల్లో మునిగిన రైతు మృత్యువు ఒడిలో దాక్కోవాలని చూస్తాడు. బ్యాంకుల క్రియాశీలంగాలేని ఆస్తులు పేరుకుపోయేలా చేసేవారు పారిశ్రామికరంగ నేతలవుతారు.
వ్యాపారవేత్తలు ఎంపీలు కావడం గురించి పెద్దగా చర్చే జరగలేదు. మాల్యా వారిలో ఒకరు. ఏ పార్టీకీ చెందకుండానే ఇంకా పలువురు సభ్యు లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాంటి వారు చట్టనిర్మాణ సంస్థలోకి ప్రవేశానికి మార్గాన్ని కొనుక్కున్నారే మోనని భయం. ఎంపీ మాల్యా ఆ పదవికి ఎన్నిక కావడం వల్ల లభిస్తున్న గౌరవం వల్ల, ఈ ప్రపంచంలోని అతి పవిత్రమైన ఉన్నత వర్గ బృందాలలో ఆయన అత్యంత పలుకుబడి గలవారు కావడం వల్లనే ఆయన ఎంత పెద్ద అప్పు ఎగవేత దారైనా రక్షణ లభించడమే వైచిత్రి. భారత్‌లో ఫార్ములా 1 రేసింగ్‌ను తలపెట్టేటప్పుడు ఆ.. విషయంలో జోక్యం చేసుకోవద్దని, వాటిని నిర్వహించడమెలాగో ప్రైవేటు రంగానికి తెలుసని ప్రభుత్వానికి చెప్పగల ధైర్యం ఆయనది. తన ఎయిర్‌లైన్స్‌లో ప్రజాధనాన్ని పెట్టడంలోనూ బహుశా ఆయన అలాంటి మాటలే చెప్పి ఉండొచ్చు.
లోక్‌సభ, రాజ్యసభల సమావేశాలను గమనించేవారిలో ఎవరూ... ముఖ్యమైన చర్చలు జరుగుతుండగా మాల్యా వెనుక బెంచీలలో ఉండటమైనా చూశామని చెప్పలేరు. అయితే జూన్ 2010 నుంచి మార్చి 2016 మధ్య ఆయన హాజరు 30 శాతమని రాజ్యసభ ప్రొసీడింగ్స్ (పీఆర్ఎస్) చెబుతున్నాయి. పౌర విమాన యానం, లిక్కరుకు సంబంధించిన సమస్యలపై ఆయన ప్రశ్నలను లేవనెత్తారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ చెబుతోంది. అయితే పీఆర్ఎస్ సమా చారం ప్రకారం ఆయన 216 ప్రశ్నలు లేవ నెత్తారు. ఆ విధంగా చూస్తే, ఆయన ‘‘క్రియాశీల’’ ఎంపీ. ఇంతకూ ఆయన సభకు ఎలా హాజర య్యారనేదే కీలకమైన అంశం. అంటే ఆయన రిజిస్టర్లో సంతకం పెట్టి, రాజ్యసభ కార్యకలాపాలు జరిగే హాలులోకి ప్రవేశించ కుండా వెళ్లిపోగా, ఆ మరుసటి రోజునే ఆయన గురించి చర్చ జరిగీ ఉండొచ్చా ? ఆయన ఎక్కడికో తెలియని గమ్యానికి విమానంలో వెళ్లిపోయిన కారణంగా ఆగ్రహం వెలిబుచ్చిన ప్రతిపక్షంలోని ఆయన సహ ఎంపీలకు మాల్యా అప్పుల ఎగవేతదారని తెలియదా? ఆయన గమ్యం లండన్ కావ చ్చు లేక బహమాస్ కావచ్చు. కానీ ఆయన అంతకు ముందు రోజు వరకు వారితో భుజాలు రాచుకు తిరిగాడు.
విజయ్ మాల్యా ఎన్ని తప్పులు చేసినా, ఎంపీలలో సైతం ఆయన సెలబ్రిటీనే అయి ఉండాలి. ఆయన వారిలో ఒకడు కాదు, వ్యాపారవేత్త కాబట్టి వారిలోని ఉన్నత శ్రేణికి చెందిన వాడు. తాను మీడియాపై ‘‘సహాయం, ఉపకారాలు, సర్దుబాట్లు’’ కురిపించడం గురించి ఆయన ట్వీట్ చేశాడు. అతగాడు చచ్చేంత ఆకర్షణను, ప్రచారాన్ని కొనుక్కున్నాడు. ఒక సినిమా పత్రికలో ప్రయోజనాలను కూడా కొన్నాడు. బ్యాంకులు అతను దేశం విడిచి పోరా దంటూ ఆయనపై ఆంక్ష విధించడానికి ముందు వరకు రోజుకో విమానంలో తిరిగాడు. తమలో ఒకడే అయిన అతగాడు హఠాత్తుగా ప్రతిపక్షానికి విలన్‌గా ఎలా మారిపోయాడు?
మాల్యాకు ఒక విమాన సంస్థ ఉన్నా, పౌర విమానయానంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఉండేవాడు. ఇప్పుడాయన వాణిజ్య కమిటీ ప్యానల్లో ఉన్నారు. వ్యాపార వేత్తగా ఉంటూ రాజ్యసభకు ఎన్నికై, కమిటీలలో ఉన్న ఎంపీ గురించి ఎథిక్స్ కమిటీ దృష్టి పెట్టాల్సింది. అలా అని వ్యాపారవేత్తలు కాని రాజకీయవేత్తలకు ఏ ప్రయోజనాలూ ఉండవని కాదు. కానీ హఠాత్తుగా అంతా సచ్ఛీలురై పోయారు. అదే విడ్డూరం అనిపిస్తోంది.
- మహేశ్ విజాపుర్కార్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com