చంటోడిని కారులో వదిలి.. నైట్క్లబ్బుకు వెళ్లిన తల్లి!
పిల్లాడి కంటే ఆ మహాతల్లికి నైట్క్లబ్బే ఎక్కువ అయిపోయింది. మూడేళ్ల కొడుకును వేడిగా ఉన్న కారులో ఒంటరిగా వదిలిపెట్లి, క్లబ్బుకు వెళ్లిన ఆ తల్లిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈశాన్య హారిస్ కౌంటీకి చెందిన ఉజ్మా షేక్ అనే మహిళ తన పిల్లవాడితో సహా నైట్ క్లబ్బులోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే, తలుపు వద్ద ఉన్న కాపలాదారు.. ఆమెను లోనికి వెళ్లనివ్వలేదు. దాంతో వెనక్కి తిరిగి వెళ్లి, ఈసారి ఒంటరిగా వచ్చింది.
తన స్నేహితురాలి వద్ద పిల్లాడిని వదిలిపెట్టినట్లు అతడికి చెప్పింది. దాంతో ఆ కాపలాదారుకు అనుమానం వచ్చి, కారు వద్దకు వెళ్లాడు. తీరా చూస్తే కారులో పిల్లాడు ఒంటరిగా ఉన్నాడు. పిల్లాడిని నిర్లక్ష్యంగా అలా వదిలేసినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేసి.. తర్వాత 1.20 లక్షల రూపాయల బాండు సమర్పించడంతో వదిలిపెట్టారు.