కల్లుగీత కార్మికురాలిపై ఎస్ఈబీ సీఐ దాష్టీకం
సాక్షి, పీసీపల్లి: కల్లు అమ్ముకుంటున్న మహిళపై ఎస్ఈబీ సీఐ జులుం ప్రదర్శించారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పీసీపల్లి మండల పరిధిలోని పెదయిర్లపాడులో శనివారం జరిగింది. కనిగిరి ఎస్ఈబీ సీఐ జలీల్ ఖాన్ తన సిబ్బందితో కలిసి గ్రామంలోకి వెళ్లారు. అక్కడ కల్లు విక్రయిస్తున్న పద్మజ, బండ్ల రమేష్, శ్రీనులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రభుత్వ అనుమతితోనే కల్లు విక్రయిస్తున్నామని చెప్పినా వినలేదని, కల్లులో మాదక ద్రవ్యాలు కలిపారంటూ నానా దుర్బాషలాడుతూ రోడ్డు వెంట ఈడ్చుకెళ్లారని పద్మజ అనే కల్లు గీత కార్మికురాలు వాపోయింది. సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన పద్మజను 108లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం శ్రీనును అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ వ్యవహారంపై కల్లుగీత కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళ.. అని కూడా చూడకుండా దాడి చేసిన సీఐ జలీల్ఖాన్ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి
గ్రామంలో గంజాయి, నాటుసారా విక్రయిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కల్లు విక్రయిస్తున్న వారిని విచారించేందుకు వెళ్లాం. కల్లు విక్రయిస్తున్న వారు బాధ్యతాయుతమైన సమాధానం ఇవ్వకుండా దుర్బాషలాడారు. దీంతో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మా విచారణలో వారి వద్ద ఎటువంటి మాదక ద్రవ్యాలూ లభించలేదు.
– జలీల్ ఖాన్, సెబ్ సీఐ
సీఐపై చర్యలు తీసుకోవాలి
మహిళ..అని కూడా చూడకుండా విచక్షణా రహితం దాడి చేసిన సీఐ జలీల్ఖాన్పై వెంటనే చర్యలు తీసుకోవాలి. విధుల నుంచి సస్పెండ్ కూడా చేయాలి. ఫిర్యాదులు వస్తే విచారణ చేయాలేగానీ స్వలాభం కోసం విచక్షణా రహితంగా దాడి చేయడం హేయం.
– బ్రహ్మంగౌడ్, కల్లు గీత సంఘ అధ్యక్షుడు, కనిగిరి
గాయాలు చూపుతున్న పద్మజ