రేపు పాఠశాలల బంద్
అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. స్థానిక ఏబీవీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగార్జున మాట్లాడారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు యథేచ్చగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్నారు.
పాఠశాలల్లో పుస్తకాలు, వస్త్ర దుకాణాలు ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నాయని విమర్శించారు. మరోపక్క ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. వీటిని నిరసిస్తూ ఈనెల 28న బంద్ చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏపీబీవీ నాయకులు కిరణ్కుమార్, పులిరాజు, భాస్కర్, శ్రీనివాసులు, నరేష్ పాల్గొన్నారు.