బాబోయ్.. ఈ నగరాల్లో రద్దీ
హైదరాబాద్
నిత్యం ఉండే రద్దీని చూసి రోడ్డుపైకి రావాలంటేనే భయపడే రోజులు. దేశంలో ఈ పట్టణం, ఆ నగరం అంటూ తేడా లేకుండా విపరీతంగా పెరిగిపోయిన రద్దీ జీవన ప్రమాణాన్ని కూడా తగ్గిస్తోంది. ఇరుకైన రోడ్లు, గతుకుల మార్గాలకు తోడు ఎడాపెడా పెరిగిపోయిన ట్రాఫిక్ లో ప్రయాణం అంటేనే భయపడే రోజులొచ్చాయి. అయితే ఈ పరిస్థితి ఒక్క మన దేశంలోనే కాదు. అనేక దేశాల్లో ఈ సమస్య ఉంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాలేంటి? ఇండియాలోనే అవి ఉన్నాయా? అన్నప్పుడు... అనేక ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే నగరాల లెక్క తేల్చడానికి డచ్ కు చెందిన టామ్ టామ్ సంస్థ సమగ్ర అధ్యయనం జరిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయా నగరాల్లో రద్దీ, ట్రాఫిక్ సమాచారం ఇవ్వడం, ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించడం... వంటి వ్యవహారాల్లో దాదాపు 9 సంవత్సరాలుగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజా నివేదిక ప్రకారం వివిధ కోణాల్లో ప్రపంచ వ్యాప్తంగా 390 నగరాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది. ప్రతి ఒక్క సిటీకి రద్దీ స్థాయిని అంచనా వేయడానికి వంద పాయింట్లను ఎంపిక చేసుకుంది. అందులో అత్యధిక రద్దీ ఉండే సిటీకి 66 శాతం, అతి తక్కువగా రద్దీ ఉన్న సిటీ 9 శాతం వచ్చింది. రోడ్డుపైకి వచ్చిన తర్వాత సాధారణంగా (రద్దీ లేని) సమయాల్లో పట్టే టైమ్ ను విపరీతంగా రద్దీ ఉండే టైమ్ ను ప్రమాణికంగా తీసుకుని టామ్ టామ్ సంస్థ ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే నగరాల వివరాలను వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత రద్దీ ఉండే నగరాల విషయంలో టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ లో ఇండియాలోని నగరాలను చేర్చలేదు. మనం రోడ్లపైకి వెళ్లాలంటే... అబ్బో ట్రాపిక్ అని ఆందోళన చెందుతాం. కానీ ప్రచంలో మనలా ఎన్నో పట్టణాల్లో మనకన్నా ట్రాఫిక్ రద్దీ మరీ దారుణంగా ఉన్నట్టు ఈ సంస్థ గణాంకాలను బట్టి తెలుస్తోంది. టామ్ టామ్ సంస్థ గత ఆరేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పట్టణాల్లో పెరుగుతున్న రద్దీపై అధ్యయనం చేసి రద్దీని తప్పించుకోవడానికి, తద్వారా తీసుకోవలసిన చర్యలను సూచిస్తుంది. 2016 లో విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలోని 48 దేశాల్లోని మొత్తం 390 నగరాల్లో రద్దీ వివరాలను అధ్యయనం చేసి 189 నగరాలకు రేటింగ్స్ ప్రకటించింది.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మామూలు సమయంలో ప్రయాణానికి, రద్దీ ఉన్నప్పుడు పడుతున్న టైమ్ ను లెక్కలోకి తీసుకుని పీక్ సమయంలో ఎంత ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎంత టైమ్ పడుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పీక్ టైమింగ్స్ ఏంటి. అందులో కూడా అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే సమయమేంటి. హైవేలు, నాన్ హైవేలు, మొత్తం రోడ్ నెట్ వర్క్ ఎంత. ఆ నగరంలో జనాభా ఎంత. జనాభా లెక్కల ప్రకారం ఆ నగరం ప్రపంచంలో ఎన్నో ర్యాంకులో ఉంది. ఒక సిటీలో ట్రాఫిక్ అంతరాయానికి ప్రతిబంధంకంగా మారిన పాయింట్స్ ఏంటి. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలేంటివి... వంటి అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ అధ్యయనం నిర్వహిస్తుంది. ఈ మొత్తం వివరాలను జీపీఎస్ ఆధారంగా, పూర్వపు ట్రాఫిక్ డాటా బేస్ తో పోల్చి రేటింగ్ తయారు చేస్తారు. అన్ని అంశాలను కలిపి మొత్తం వంద శాతం పరిగణలోకి తీసుకుని ప్రతిబంధకాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రేటింగ్ ఇవ్వగా తాజా నివేదిక ప్రకారం మెక్సికో సిటీ (66 శాతం) ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరంగా తేల్చింది. అతి తక్కువ రద్దీ ఉండే నగరంగా డేటన్ (అమెరికా) (9శాతం) నిలిచింది.
అత్యంత రద్దీగా ఉండే 25 నగరాల వివరాలు :
25. లండన్, యూకే (40%)
24. తైపీ, తైవాన్ (40%)
23. తియాంజిన్, చైనా (41%)
22. షాంగై, చైనా (41%)
21. సెయింట్ పీటర్స్ బర్గ్, రష్యా (41%)
20. కోషీంగ్, తైవాన్ (41%)
19. బునోస్ ఎయిర్స్, అర్జెంటీనా (42%)
18. షిజియాజువాంగ్, చైనా (42%)
17. సాంటియాగో, చిలీ (43%)
16. హాంగ్ జ్యువో, చైనా (44%)
15. షెంజెన్, చైనా (44%)
14. గువాంజువో, చైనా (44%)
13. మాస్కో, రష్యా (44%)
12. లాస్ ఏంజెలెస్, అమెరికా (45%)
11. చాంగ్షా, చైనా (45%)
10. బీజింగ్, చైనా (46%)
9. తియానన్, తైవాన్ (46%)
8. రియో డి జనేరియో, బ్రెజిల్ (47%)
7. చెంగ్డూ, చైనా (47%)
6. ఇస్తాంబుల్, టర్కీ (49%)
5. బుచారెస్ట్, రొమేనియా (50%)
4. చాంగ్కింగ్, చైనా (52%)
3. జకార్తా, ఇండొనేషియా (58%)
2. బాంకాక్, థాయిలాండ్ (61%)
1. మెక్సికో సిటీ, మెక్సికో (66%)