అంధుల కోసం స్పెషల్ మెనూ!
‘బ్రెయిలీ లిపి’ అంధులకు లూయీ బ్రెయిలీ అందించిన అద్భుత సదుపాయం. దీన్ని ఆధారం చేసుకుని అనేక విషయాల్లో అంధులకు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో... బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని ‘ఓమ్’ అనే రెస్టారెంట్ అంధుల కోసం ప్రత్యేకంగా మెనూ కార్డ్‌ను తయారుచేసింది. రుచిగా, శుచిగా ఆహారాన్ని అందిస్తుందనే పేరున్న ఈ వెజిటేరియన్ రెస్టారెంట్ మెనూకార్డ్ను బ్రెయిలీ లిపిలో ప్రింట్ చేసి అందుబాటులో ఉంచింది.
దీర్ఘ దృష్టి సమస్య ఉన్న వారి కోసం కూడా పెద్ద పెద్ద అక్షరాలతో ఉండే ఈ మెనూ కార్డ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ వారు అంధులకు ఈ సౌకర్యం తీసుకురావడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఓమ్ రెస్టారెంట్‌కు పక్కగా ఒక ఎన్జీవో ఆఫీస్ ఉంటుంది. విజువల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ కోసం పనిచేసే ఆ సంస్థ కార్యాలయానికి చాలామంది అంధులు వస్తుంటారు.
పని మీద ఆ ఎన్జీవో ఆఫీస్‌కు వచ్చి, తినడానికి వచ్చే వారి కోసం రెస్టారెంట్ ఓనర్లు ఈ అవకాశాన్ని కల్పించారు. తమకు కావలసిన ఆహారం గురించి చదువుకొని.. ఆర్డర్ చేసేంత కాన్ఫిడెన్స్‌ను ఇస్తోంది రెస్టారెంట్. ఈ ఏడాది ఉగాది నుంచే ఈ మెనూ కార్డ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే తాము చేసిన పనికి ప్రచారం వస్తోందని, అనేక మంది రెస్టారెంట్ ఓనర్లు ఈ ప్రయత్నం చేస్తున్నారని ఓమ్ రెస్టారెంట్ ఓనర్లు తెలిపారు.