టూరుగల్లు
జాలువారే జలపాతాలు.. అబ్బుర పరిచే శిల్పకళా సంపద.. పచ్చని అటవీ ప్రాంతం.. ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు.. కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాలు ఉమ్మడి ఓరుగల్లు సొంతం. చారిత్రక, వారసత్వ నేపథ్యం ఉన్న వరంగల్ జిల్లా పర్యాటక ప్రాంతంగా శోభిల్లుతోంది. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు దేశీయులనే కాదు.. విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను
సంతరించుకుని అలరారుతున్నాయి. ఆహ్లాదాన్ని, అనందాన్ని పంచుతున్న సుందరమైన దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లాలో వేయిస్తంభాల దేవా యలం, భద్రకాళి ఆలయం, వరంగల్ కోట, వనవిజ్ఞా న్, కాజీపేట దర్గా, ఫాతిమా, మడికొండలోని మెట్టుగుట్ట, ఐనవోలు మల్లన్న దేవాలయం పర్యాటకులు ఆకట్టుకుంటున్నాయి. వేయిస్తంభాల దేవాలయం శిల్పకళా తోరణాలు అత్యద్భుతం. వరంగల్ కోటలోని తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో పాకాల సరస్సు ప్రకృతి రమణీయతను పంచుతోంది. అన్నారం షరీఫ్ దర్గాను కుల మతాలకు అతీతంగా దర్శిస్తున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యాటక ప్రాంతంగా అలారారుతోంది. గణపురం కోటగుళ్లు, కాకతీయుల కాలంలో చక్కని కళా సంపదతో నిర్మించిన రామప్ప దేవాల యం, పాండవుల గుట్టలు, మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలు, తాడ్వాయి, ఏటూరునాగారం, మహాదేవ్‌పూర్ అటవీ అందాలు, దామెరవాయి ఆది మానవుల గుహలు, బొగత జలపాతం, మల్లూరు దేవా లయం, మైలారం గుహలు పర్యాటకులు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పాండవుల గుట్టల్లో రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. లక్నవరంలోని వేలాడే వంతెన ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. మహబూబాబాద్ జిల్లాలో కురవి, అనంతారంలోని దేవాలయాలు, మాటేడు ఆలయాలు, భీమునిపాదం వద్ద జలపాతం, బయ్యారం చెరువు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. జనగామ జిల్లాలో ఖిలాషాపురంలోని సర్వాయి పాపన్న కోట, జఫర్‌గఢ్ కోట, పాలకుర్తిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పర్యాటకులను ఆకరిస్తున్నాయి.
కోటి మొక్కులు...
మేడారం జాతర పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఒక్క మేడారం జాతర కారణంగానే పర్యాటక రంగంలో ఉమ్మడి వరంగల్ జిల్లా హైదరాబాద్‌ను మించిపోతోంది. రెండేళ్లకోసారి జరిగే జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే సగటున ప్రతి జాతరకూ కోటి మంది వస్తున్నారు. ఇలా వచ్చి పోయే భక్తులు మార్గమధ్యలో లక్నవరం, రామప్ప, ఖిలావరంగల్ వంటి చారిత్రక ప్రాంతాలను పర్యటిస్తున్నారు. జాతర జరిగే ఏడాది పర్యాటకుల సంఖ్య రెండు కోట్లకు చేరుతోంది. జాతర లేని ఏడాదిలో ఈ సంఖ్య పదిహేను లక్షల దగ్గర ఉంటోంది. దీంతో పాటు కాళేశ్వరం జయశంకర్ జిల్లాలో కలవడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు పెరిగారు.
అంకెల్లో...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని పర్యాటకులను అకర్షిస్తోంది. వరంగల్ ఫోర్ట్, వేయిస్తంభాలు, భద్రకాళి ఆలయాలు, రామప్ప, లక్నవరం సరస్సు, బొగత జలపాతం, పాం డవులగుట్ట, కోటగుళ్లు, మేడారం సమ్మక్క–సారలమ్మ వన దేవతలను సందర్శించేందుకు దేశ, విదేశీయులు భారీ సంఖ్యలో వస్తున్నారు. మేడారం జాతర జరిగే ఏడాది పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2015లో దేశీయ పర్యాటకులు 98,09,162 మంది రాగా, విదేశీ పర్యాటకులు 1,794 మంది వచ్చారు. 2016లో 2,62,31,497 మంది దేశీయ పర్యాటకులు రాగా, 1,987 మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. ఇందులో కోటి మంది వరకు మేడా రం జాతరకు వచ్చిన వారుంటారు. 2017 నవంబర్ మాసం వరకు 23,45,460 మంది దేశీయ పర్యాటకులు రాగా, 1,237 మంది విదేశీ పర్యాటకులు వచ్చారు.
వంతెనలతో..
కాళేశ్వరం, ఏటూరునాగారం వద్ద గోదావరిపై కొత్తగా వంతెనలు నిర్మాణం జరగడంతో పర్యాటక రంగం పుంజుకుంది. వరంగల్, హైదరాబాద్ వాసులకు దగ్గరి దారి అందుబాటులోకి వచ్చినట్లయింది. ఫలితంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బొగత, లక్నవరం వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇటీవల మల్లూరుకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా వెంకటాపురం మండలంలో మరో జలపాతం, పాండవులగుట్ట రాక్ క్లైంబింగ్, తాడ్వాయి అడ్వెంచర్ టూర్, ఏకో టూరిజంను పర్యాటక శాఖ ప్రమోట్ చేస్తోంది.