అమరావతికి పర్యాటక శోభ
విజయవాడ: అమరావతి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోనుంది. నూతన రాజధానికి అమరావతి పేరు పెట్టిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నారు. బౌద్ధుల పుణ్యక్షేత్రంగా పేరున్నా, ప్రాచీన అమరేశ్వరాలయం ఉన్నా ఇప్పటివరకూ గ్రామం అభివృద్ధి చెందలేదు. బౌద్ధమత చరిత్ర, అమరేశ్వరాలయం ప్రాశస్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీనికి పర్యాటక ప్రాధాన్యత కల్పించింది. అందులో భాగంగా రెండు కేంద్ర ప్రభుత్వ పథకాలకు అమరావతిని ఎంపిక చేసింది.
వీటి ద్వారా సుమారు రూ.70 కోట్లను గ్రామాభివృద్ధికి వినియోగించనున్నారు. హ్రిదయ్ (హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ అగ్‌మెంటేషన్ యోజన) పథకం కింద దేశంలోని 12 హెరిటేజ్ నగరాల్లో ఒకటిగా కేంద్రం అమరావతిని కొద్దిరోజుల క్రితం ఎంపిక చేసింది. గ్రామ ప్రాచీనతను కాపాడేందుకు, మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఈ పథకం కింద కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.22.26 కోట్లు కేటాయించింది. కేంద్ర పర్యాటక శాఖ అమలు చేస్తున్న ప్రసాద్ (పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్ప్రిట్యువల్ అగ్‌మెంటేషన్ డ్రైవ్) పథకానికీ అమరావతి ఎంపికైంది. దీని కింద రూ.47 కోట్లు మంజూరయ్యే అవకాశం ఉంది. హ్రిదయ్’ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందుకు ప్రతిపాదనలు రూపొందించింది.
గ్రామంలోని పర్యాటక ప్రదేశాలైన అమరేశ్వరాలయం నుంచి ధ్యాన బుద్ధ ప్రాజెక్టుల వరకు సులభంగా వెళ్లేందుకు కరకట్టను విస్తరించి రోడ్డు వేసేందుకు ప్రతిపాదించారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు, ప్రధాన రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బుద్ధిస్టు మ్యూజియం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, మహాచైత్యం (స్థూపం) ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మార్చడానికి, బౌద్ధారామాలు, కాటేజీలు నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేశారు. ఏపీ టూరిజం శాఖ కాటేజీలు, పార్కులు ఏర్పాటుచేసే యోచనలో ఉంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అమరావతి రూపురేఖల్ని మార్చడమే లక్ష్యంగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి.