పర్యాటక ప్రాధాన్యంతో రాజధాని మాస్టర్ ప్లాన్
సింగపూర్ అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యం లభించేలా రాజధాని మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో రాజధాని మాస్టర్ ప్లాన్‌పై సింగపూర్ ప్రతినిధి బృందం.. ముఖ్యమంత్రి సమక్షంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. 200 చదరపు కి.మీ పరిధిలోని రాజధాని ప్రాంతంలో చేపట్టాల్సిన నిర్మాణాలు, ప్రాధాన్యతలపై గల ఎనిమిది అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఐటీ విద్యా సంస్థలు, సూపర్ స్పెషాలిటీ వైద్య ఆరోగ్య సంస్థలతో వైజ్ఞానిక కేంద్రంగా రూపుదిద్దుకునేలా మాస్లర్‌ప్లాన్‌ను రూపొందించాలన్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను కలుపుతూ రింగురోడ్లు, రేడియల్ రోడ్ల నిర్మాణంపై సింగపూర్ ప్రతినిధి బృందానికి పలు సూచనలు చేశారు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి, నందిగామ తదితర పట్టణాలు మాస్టర్‌ప్లాన్‌లో ఎలా ఉండాలనే విషయమై కొన్ని సూచనలు చేశారు.
చంద్రబాబు నివాసంలో హోలీ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు బంజారాలతో కలిసి డప్పు కొట్టి, నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
సీఎంతో అమెరికా సంస్థ డెరైక్టర్ భేటీ
విశాఖపట్నంలో వైమానిక నగర నిర్మాణంపై అమెరికా ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సౌత్ అండ్ ఈస్ట్ ఏసియా ప్రాంతీయ సంచాలకులు హెన్రీ స్టీన్ గాస్ బుధవారం సీఎం చంద్రబాబునాయుడుతో చర్చించారు.