tower cirlce
-
అందరూ భాగస్వాములు కావాలి
జిల్లా జడ్జి నాగమారుతిశర్మ టవర్‌సర్కిల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కోర్డు జడ్జి నాగమారుతీశర్మ అన్నారు. శుక్రవారం నగరంలోని 4వ డివిజన్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విరివిగా చెట్ల పెంపకం చేపట్టడం వలన సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. నగరంలో పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను హరిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులు భవిష్యత్ తరాలకు వారసులని, మొక్కలకు తమ పేర్లను పెట్టుకొని బాధ్యతతో పెంచాలని సూచించారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి మూడు మొక్కలను తప్పనిసరిగా పెంచాలన్నారు. హరితహారంలో అందరూ భాగస్వాములయితేనే ఫలితం పొందుతామని సూచించారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మట్లాడుతూ.. పచ్చదనం పెంపొందించనప్పుడే నగరంలో కాలుష్యాన్ని తగ్గించగలుగుతామని అన్నారు. అనంతరం మొక్కలను నాటి, విద్యార్థులకు, స్థానికులకు మొక్కలు, ట్రీగార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీ జోయల్ డేవిస్, ఆర్డీవో చంద్రశేఖర్, కార్పొరేషన్ కమిషనర్ కేవీ.రమణాచారి, కార్పొరేటర్లు ఎడ్ల సరితఅశోక్, వై.సునీల్‌రావు, కంసాల శ్రీనివాస్, పిట్టల శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్, ఏవీ.రమణ, మెండి చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారధి కళాభారతి బృందం మొక్కల పెంపకంపై ఆలపించిన గీతాలు అలరింపజేశాయి. హరితోద్యమంలో భాగస్వాములు కావాలి : జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితోద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించినపుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. శుక్రవారం నగరంలోని జెడ్పీ క్వార్టర్స్‌లో కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్వార్టర్స్ ఆవరణ, రోడ్డుకిరువైపులా 300 మొక్కలు నాటారు. చెట్లు లేని ప్రపంచాన్ని ఊహించలేమని, ఇప్పటికే చెట్ల సంఖ్య తగ్గడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నదని ఉమ పేర్కొన్నారు. అందుకే సీజన్లో వర్షాలు కురవకపోవడం, అకాల వర్షాలు పడడం జరుగుతుందన్నారు. భవిష్యత్ ప్రమాదాన్ని ఊహించిన కేసీఆర్ ప్రజా ఉద్యమంలా హరితహారాన్ని చేపట్టారని చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు, వాటి సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, కార్పొరేటర్ యాదగిరి సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు. కదిలిన జిల్లా యంత్రాంగం ముకరంపుర : హరితహారంలో భాగంగా ఆయా శాఖల అధికారులు మొక్కలు నాటేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. నగరంలోని వెటర్నరీ పాలిక్లినిక్‌లో 50 మొక్కలను ఒక ప్లాటుగా.. 200 మొక్కలు పాలిక్లినిక్ ప్రహారీ చుట్టూ నాటారు. ముఖ్య అతిథిగా సీపీవో సుబ్బారావు, పశుసంవర్దకశాఖ జేడీ రాంచందర్, డీడీలు షేక్ ఖలీల్ రహ్మాన్, వెంకటేశ్వర్లు, కిషన్, కళ్యాణి, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా మొక్కలు నాటారు. మార్కెటింగ్ శాఖ డీడీఎం కృష్ణయ్య, సిబ్బంది. కార్పొరేటర్లు పాల్గొన్నారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ ఉద్యానక్షేత్రంలో ఉద్యానశాఖ సిబ్బంది మొక్కలు నాటా రు. ఉద్యానశాఖ డీడీ సంగీతలక్ష్మి, ఏడీ జ్యోతి, అసిస్టెంట్ పీడీ మధుసూధన్ పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఐసోటీం స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మొక్కలను ఉచితంగా అందజేస్తూ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. హౌసింగ్ పీడీ నర్సింగరావు మొక్కను తీసుకుని పేరు నమోదు చేసుకున్నారు. వయోజన విద్య ఉపసంచాలకుల కార్యాలయంలో మొక్కలు నాటారు. ఉపసంచాలకులు ఎం.జయశంకర్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బాల సురేందర్, ఏపీవో దేవదాస్, పర్యవేక్షకులు వి.రాజేందర్ఱావు, ఆదిరెడ్డి పాల్గొన్నారు. -
గౌరవం పెరిగింది
టవర్‌సర్కిల్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పోరాటం ఫలించింది. తమ గౌరవ వేతనాలు పెంచాలంటూ కొన్నేళ్లుగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తున్న నేతలకు ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులకు సముచిత స్థానం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారి గౌరవ వేతనాలను భారీగా పెంచింది. వేతనాల పెంపును శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో స్థానిక ప్రజాప్రతినిధుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. ఈ పెంపుతో జిల్లాలో 2,520 మందికి ప్రయోజనం కలగనుంది. గ్రామ ప్రథమ పౌరులుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు గౌరవ వేతనం పెంచాలని సర్పంచులు రాజీలేని పోరాటం చేశారు. అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధమయ్యూరు. స్థానిక సంస్థల ‘గౌరవాన్ని’ పెంచుతామని కొద్ది రోజులుగా చెబుతున్న ప్రభుత్వం స్పందించి శుక్రవారం అసెంబ్లీలో వేతనాల పెంపును ప్రకటించింది. దీంతో జిల్లాలో 2,520 మందికి లబ్ధి చేకూరనుంది. జెడ్పీ చైర్పర్సన్, మేయర్, డెప్యూటీ మేయర్ తదితరుల వేతనాలను ఎవరూ ఊహించనంతగా పెంచారు. జెడ్పీ చైర్‌పర్సన్‌కు గతంలో నెలకు రూ.7500 గౌరవ వేతనం ఉండగా ప్రస్తుతం రూ.లక్షకు,కార్పొరేషన్ మేయర్లకు రూ.14 వేల నుంచి రూ.50 వేలకు, డెప్యూటీ మేయర్లకు రూ.8 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. మేయర్ల స్థారుులోనే విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ చైర్మన్లకు రూ.8 వేలు ఉండగా రూ.12 వేలకు, వైస్ చైర్మన్లకు రూ.3200 నుంచి 5 వేలకు అరకొరగా పెంచారు. జెడ్పీటీసీలకు రూ.2,250 నుంచి రూ.10 వేలు, ఎంపీపీలకు రూ.1500 నుంచి రూ.10 వేలుగా మెరుగైన వేతనాన్ని అమలు చేశారు. సర్పంచుల్లో నిరాశ గ్రామపంచాయతీల్లో సర్పంచులు మిగతా ప్రజాప్రతినిధుల కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. నిరక్షరాస్యులు, దినసరి కూలీలు, పనిభారం ఉన్న ప్రజలు గ్రామాల్లోనే ఎక్కువగా నివసిస్తుంటారు. వారంతా చిన్నాచితక పనులకు కూడా సర్పంచులపైనే ఆధారపడుతారు. అన్ని పనులు చేసే సర్పంచులకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఇన్నాళ్లు రూ.600 గౌరవ వేతనానికే పరిమితమైన సర్పంచులు తమ గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచాలని పోరాటం చేస్తున్నారు. వారు ఆశించిన రీతిలో న్యాయం జరగలేదు. సర్పంచులకు రూ.600గా ఉన్న వేతనాన్ని రూ.5 వేలకు మాత్రమే పెంచడంతో నిరాశ చెందుతున్నారు. ఎంపీటీసీ సభ్యులకు రూ.750 ఉన్న వేతనాన్ని సైతం రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన వేతనాలు రూ.67.5 లక్షలు జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులకు పెరిగిన వేతనాల ప్రకారం రూ.67.5 లక్షలు అదనంగా అందనున్నాయి. గత వేతనాల ప్రకారం జిల్లాలో ప్రజాప్రతినిధులకు రూ.18.5 లక్షలుండగా, పెరిగిన వేతనాలతో రూ.86 లక్షలు అందనున్నారుు. వేతనాలు సుమారు నాలుగున్నర రేట్లు పెరిగినట్లయింది. వీటిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు. జిల్లాలో 2,520 మందికి ప్రయోజనం... పెరిగిన వేతనాలతో జిల్లాలోని 2,520 మంది ప్రజాప్రతినిధులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లా పరిషత్ సభ్యులు 57 మంది, మండల పరిషత్ సభ్యులు 817 మంది, గ్రామ పంచాయితీ సర్పంచులు 1207 మంది, పురపాలక సభ్యులు 326 మంది, కోఆప్షన్ సభ్యులు 113 మంది పెరిగిన వేతనాల లబ్ధి పొందనున్నారు. అవినీతిలేని అభివృద్ధి కోసం... కేసీఆర్ కలలు కన్న బంగారు తెలంగాణ సాధించుకునే క్రమంలో అవినీతి లేని అభివృద్ధి జరగాల్సి ఉంది. ప్రజాప్రతినిధులకు మెరుగైన గౌరవ వేతనాలు అందించి స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో భాగమే ఈ వేతనాల పెంపు. ప్రజాప్రతినిధులకు తీపి కబురు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. - రవీందర్‌సింగ్, కరీంనగర్ మేయర్ ఆత్మగౌరవం కావాలి గతంలో ఏనాడూ పెరగని వేతనాలను రూ.5 వేలకు పెంచడాన్ని హర్షిస్తున్నాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవ వేతనం గౌరవమైన రీతిలో ఉండాలని కోరుకుంటున్నాం. కేరళ తరహాలో రూ.10 వేలన్నా పెంచాల్సి ఉండే. వేతనాల కంటే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అధికారాలు ఇచ్చి, ఆత్మగౌరవం పెంచాలి. - అంజనీ ప్రసాద్, సర్పంచుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు, అన్నయ్యగౌడ్, అధ్యక్షుడు అరుదైన గౌరవం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నాడనే దానికి నిదర్శనమే ఈ వేతనాల పెంపు. చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం కేసీఆర్ చేసి వేతనాలను భారీగా పెంచారు. మాపై మరింత బాధ్యత పెరిగింది. ప్రజాప్రతినిధులు సైతం జవాబుదారీగా ఉంటూ బంగారు తెలంగాణ దిశగా కృషిచేయాలి. - తుల ఉమ, జెడ్పీ చైర్పర్సన్ సీఎంకు ధన్యవాదాలు ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచి న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఏ సీఎం చేయలేని సంచలన నిర్ణయూలు తీసుకుంటున్నారు. అభివృద్ధి తర్వాతే వేతనాలకు ప్రాధాన్యత అన్న ముఖ్యమంత్రి అన్నట్లుగానే వేతనాలు పెంచడం సంతోషంగా ఉంది. - కొంకటి లక్ష్మీనారాయణ, రామగుండం మేయర్ సీఎం నిర్ణయం హర్షణీయం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను భారీగా పెంచిన సీఎం కేసీఆర్, మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు. వేతనాలు పెంచాలని జెడ్పీ సమావేశంలో తీర్మానం చేసి, సీఎంకు లేఖ ఇచ్చాం. ఇంత తొందరగా వేతనాలు పెంచుతారని అనుకోలేదు. - కందుల సంధ్యారాణి, జెడ్పీటీసీ, రామగుండం - కోల్‌సిటీ -
న‘గరం..గరంగా..’
టవర్‌సర్కిల్ : కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. పారిశుధ్య, టౌన్‌ప్లానింగ్, వీధి దీపాల అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఎజెండాలో పొందుపరిచిన 45 అంశాలతోపాటు టేబుల్ ఎజెండాలో నాలుగు అంశాలకు ఆమోదముద్ర వేశారు. నగరపాలక సర్వసభ్య సమావేశం మేయర్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన శనివారం కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే 7వ డివిజన్ కార్పొరేటర్ లింగంపల్లి శ్రీనివాస్ శానిటేషన్‌కు ఎలాంటి పొడిగింపులు లేకుండా టెండర్లు నిర్వహించాలని కోరారు. ఎజెండాలో మొదటి అంశంపై కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, ఎడ్ల సరిత మాట్లాడుతూ.. నగరంలో వ్యవసాయ భూములను కమర్షియల్‌గా మార్చాలని పలు దరఖాస్తులు చే సినా.. ఒకే స్థలాన్ని ఎజెండాలో చేర్చడంపై ప్రశ్నించగా, రానున్న కౌన్సిల్లో మిగతావి పెడతామని మేయర్ తెలిపారు. నగరంలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టడం లేదని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గందె మాధవి అధికారులపై ఆగ్రహించారు. అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలు తెలపాలని కోరారు. ఏసీపీ ఫోన్లో సమాధానం ఇవ్వడం లేదని పరిచయం చేయూలని 42వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కోర్టు నుంచి వావిలాలపల్లి రోడ్డ్‌లో ఉన్న రెండు ఫంక్షన్‌హాల్స్‌కు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో శుభకార్యాల సమయంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని 47వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు తెలిపారు. హౌసింగ్‌బోర్డు ఎంట్రన్స్ రోడ్డును మాస్టర్‌ప్లాన్ ప్రకారం తీయాలని 21వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల ప్రకాశ్ కోరారు. 20వ డివిజన్లో 19 మందికి పింఛన్లు రెండుసార్లు వచ్చాయని, వాటిని అర్హులకు ఇవ్వాలని కార్పొరేటర్ నేతికుంట కళావతి కోరారు. ఒక్క రూపాయి నల్లాకు ఆమోదం... నగరంలో ప్రవేశపెట్టిన ఒక్క రూపాయి నల్లా కనెక్షన్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పైపులు కొనుగోలుకు కేటారుుంచిన రూ.25 లక్షల నిధులకు ఆమోదం ముద్ర వేశారు. శానిటేషన్ వర్కర్ల పెంపు నగరపాలక సంస్థలో శానిటేషన్ వర్కర్లు, రిక్షాలు సరిపోవడం లేదని, వర్కర్ల సంఖ్యను పెంచి, మరో రెండు నెలలు పొడిగించి అయినా సరే టెండర్లు నిర్వహించాలని కార్పొరేటర్లు కోరారు. టెండర్లు ఆపడం మన పరిధిలో లేదని, అవసరమైతే వెంటనే 200 మంది వర్కర్ల కోసం మరో టెండర్ నిర్వహిస్తామని, రిక్షాలు కొనుగోలు చేస్తామని మేయర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి 17 ట్రాక్టర్లు వస్తాయని వివరించారు. అధికారుల వాకౌట్.. మేయర్ సముదాయింపు... అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే సదరు యజమానులు వచ్చి కలవగానే(ముడుపులు ఇవ్వగానే) టౌన్‌ప్లానింగ్ అధికారులు వదిలేస్తున్నారని 29వ డివిజన్ కార్పొరేటర్ ఉమాపతి ఆరోపించారు. అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే పనులెలా చేస్తారని, వెంటనే క్షమాపణ చెప్పాలని కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, ఆరిఫ్, నలువాల రవీందర్, పెద్దపల్లి రవీందర్ వాగ్వాదానికి దిగారు. తమ పట్ల కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తించడంతో అధికారులు వాకౌట్ చేసేందకు ప్రయత్నించగా మేయర్ కలుగజేసుకుని ఆపారు. పరాయిలుగా చూడకండి : కమిషనర్ అధికారులు, పాలకవర్గం అందరం ఒక కుటుంబం. మమ్మల్ని పరాయిలుగా చూడకండి. నొప్పించకుండా ఉంటే సేవకులుగా పనిచేస్తామని కమిషనర్ రమణాచారి తెలిపారు. కార్పొరేషన్లో సిబ్బంది కొరత ఉండడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. 69 అత్యవసర పోస్టులు అవసరమున్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్‌లో సిబ్బంది అంతా డిప్యూటేషన్లపైనే ఉండడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. సమావేశంలో అన్ని విభాగాల అధికారులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. -
విభేదాలు వీడండి
టవర్‌సర్కిల్ : జిల్లా నియోజకవర్గాల కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీల పనితీరు, అందుబాటులో ఉంటున్నారా? సమస్యలేమున్నారుు? అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు. 13 నియోజకవర్గాలకు సంబంధించి రెండున్నర గంటల పాటు జరిగిన సమీక్షలో ఇన్చార్జీల పనితీరు, పార్టీ బలోపేతానికి చేపట్టే చర్యలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాట కార్యక్రమాలను పెంచుకునే విధానంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దసాని కశ్యప్‌రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడడంతో బాబు ఒకింత ఆగ్రహానికి గురై నాముందే విమర్శలు చేసుకోవడం తగదని, కలిసికట్టుగా పనిచేయూలని మందలించారు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే నియమించాలని నగర అధ్యక్షుడు కళ్యాడపు ఆగయ్య కోరడంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం లేదని, త్వరలో హైదరాబాద్‌కు వస్తే పూర్తి విషయాలు మాట్లాడదామంటూ సూచించారు. రామగుండం ఇన్చార్జి నియామకంపై సందిగ్ధం తొలగించాలని, వేములవాడ నియోజకవర్గంలో గండ్ర నళిని స్థానికంగా ఉండేలా చూడాలని లేనిపక్షంలో మరొకరికి ఇవ్వాలని కోరారు. మానకొండూర్, ధర్మపురి, చొప్పదండి, హుస్నాబాద్, పెద్దపల్లి, జగిత్యాల నియోజకవర్గాల్లో పనితీరు బాగా ఉందని కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మరిన్ని కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. స్వాగత ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు చెందిన కొండూరి అంజయ్య, హుస్నాబాద్ నియోజకవర్గం మైసంపెల్లికి చెందిన పద్మకు, ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లికి చెందిన మోహన్‌నాయక్ కుటుంబాలు పార్టీ సహాయాన్ని కోరగా రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆలస్యంగా వచ్చి ముందే వెళ్లిన బాబు ప్రతినిధుల సభ, నియోజకవర్గాల సమీక్ష కోసం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఆలస్యంగా వచ్చి ముందే కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. ఉదయం 12.30కి వేదికపైకి రావాల్సిన బాబు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారు. సభ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. 6.30కు ప్రారంభమైన 13 నియోజకవర్గాల సమీక్ష రెండున్నర గంటల్లోనే ముగించారు. రాత్రి 12 గంటల వరకు నియోజకవర్గాల సమీక్షలు జరుగుతాయని, రాత్రి కరీంనగర్‌లోనే బస చేసి గురువారం ఉదయం హెలికాప్టర్లో తిరిగి వెళ్తారని షెడ్యూల్లో ఉన్నప్పటికీ రాత్రి 9 గంటలకే ఆయన తిరుగుప్రయూణమయ్యూరు. సభ నిర్వహణ బాగుందని జిల్లా నేతలను చంద్రబాబు అభినందించారు. సభలో అట్రాక్షన్ రేవంత్, నన్నూరి టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి మంగళవారం జరిగిన సభలో అట్రాక్షన్‌గా మిగిలారు. రేవంత్‌రెడ్డి మాట్లాడినంత సేపు సభికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. రాష్ట్ర పార్టీ నేత నన్నూరి నర్సిరెడ్డి సభలో కేసీఆర్ కుటుంబంపై, ప్రభుత్వ విధానాలపై విమర్శల వాన కురిపిస్తూ గతంలో టీడీపీ హయంలో జరిగిన అంకెలతో సహా వివరిస్తూ చేసిన ప్రసంగం చంద్రబాబుతో సహా వేదికపై ఉన్న నాయకులు, సభికుల నుంచి నవ్వుల జల్లులు కురిపించాయి. నగర శివారులోని అల్గునూరు బ్రిడ్జి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కాన్వాయ్‌తో కార్యకర్తలు వెంట రాగా బాబు అభివాదం చేసుకుంటూ కోతిరాంపూర్, కమాన్ మీదుగా అంబేద్కర్ స్టేడియానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం... సభా ప్రాంగణానికి చంద్రబాబు 12.30కు చేరుకోవాల్సి ఉండగా సరిగ్గా 3 గంటలకు వేదికపైకి చేరుకున్నారు. వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నూలుతో తయారుచేసిన పూలమాల వేసి స్వాగతం పలికారు. -
తిరుగులేని శక్తిగా చేద్దాం
టవర్‌సర్కిల్ : కరీంనగర్ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉందని.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు పార్టీకి అండగా నిలిచారని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేద్దామన్నారు. మంగళవారం నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ టీడీపీ జిల్లా ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసుకున్న గడ్డ అని, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న కొలువైన నేల అని జిల్లాను కీర్తించారు. ఆర్థిక సంస్కరణలతో దేశచరిత్రను తిరగరాసిన మహనీయుడు పీవీ నర్సింహరావు ఈ జిల్లా బిడ్డ కావడం గర్వకారణమన్నారు. పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసి, అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ... కరువుప్రాంతంగా ఉన్న కరీంనగర్ జిల్లా టీడీపీ హయూంలోనే సస్యశ్యామలంగా మారిందని, ఎస్సారెస్పీ నుంచి రూ.వెయ్యి కోట్లతో లైనింగ్ వేసి జిల్లాలోని గ్రామగ్రామానికి సాగునీరు అందించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తయితే కరీంనగర్ ఎడారిగా మారుతుందని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తే ఆనాడు కేసీఆర్ అపహాస్యం చేశాడని, ఇప్పుడేం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. రాయికల్ వచ్చిన కేసీఆర్ కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటిస్తారని, రైతుల కడగండ్లు తీరుస్తారని ఆశపడితే నిరాశే మిగిలిందన్నారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో నిలదీయాలని టీడీపీ శాసనసభ్యులను కోరారు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రా వు మాట్లాడుతూ పదవుల ఆశ కోసం మండల, నియోజవర్గ నేతలు పార్టీని వీడారని, గ్రామాల్లో క్యాడర్ కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. కేసీఆర్ మూడుసార్లు కరీంనగర్ ఎంపీగా గెలిచి జిల్లాకు ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించారు. కార్మికమంత్రిగా ఉండి బీడీ కట్టమీద పుర్రెగుర్తు వేయించాడని విమర్శించారు. నీరు, విద్యుత్ విషయంలో ముందుచూపు లేకపోవడం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అణచివేతనుంచి పుట్టిన టీడీపీకి వేడివాడీ తగ్గలేదని కరీంనగర్ సభ నిరూపించిందన్నారు. జెండాను వదలకుండా ఉన్న కార్యకర్తలకు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, వారిపై కేసులు పెట్టినా ఇక్కడే ఉండి పోరాడుతామని భరోసా ఇచ్చారు. రాజకీయ బిక్షపెట్టిన టీడీపీని విమర్షిస్తున్న గంగుల కమలాకర్ గుంటనక్కలా అధికారం కోసం, గ్రానైట్‌ను కాపాడుకోవడం కోసం పార్టీ మారాడని ఎద్దేవా చేశారు. ఎంతమంది పోయినా ఉల్లిగడ్డమీద పొట్టు పోయినట్లేనన్నారు. ఈ రోజు నుంచి టీఆర్ఎస్, టీడీపీ నువ్వానేనా అన్నట్లు పోరాడుతామన్నారు. కేసీఆర్ తాత వచ్చినా తాట తీస్తామని సవాలు విసిరారు. టీటీడీపీ ఎన్నికల కన్వీనర్ ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ... టీడీపీ జిల్లాలో ఖాళీ అయిందని ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్కు సవాలుగా సాహసోపేతంగా సభ నిర్వహించామన్నారు. ప్రజావ్యతిరేక టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ఇక్కడి నుంచే మొదలవుతుందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ... ఎస్సారెస్పీ కింద 9.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే, జిల్లాలోనే 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని ఎస్సారెస్పీ నీటిని సాగుకు వదలకుండా, తాగునీటి పేరుతో మానేరు నింపి సిద్దిపేటకు తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేటకు నీటిని నిలిపివేసి జిల్లాలోని చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీలు గరిగెపాటి రామ్మోహన్రావు, గుండు సుధారాణి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మండవ వెంకటేశ్వర్రావు, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ ఎంపీలు రమేశ్‌రాథోడ్, నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యేలు బోడ జనార్దన్, వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రాములు, నన్నూరి నర్సిరెడ్డి, టి.వీరేంద్రకుమార్గౌడ్, జెడ్పీటీసీ గంట అక్షితరాములు, నియోజకవర్గ ఇన్చార్జీలు ముద్దసాని కశ్యప్‌రెడ్డి, అన్నమనేని నర్సింగరావు, గండ్ర నళిని, మేడిపల్లి సత్యం, తాజొద్దీన్, కర్రునాగయ్య, సాంబారి ప్రభాకర్, పి.రవీందర్రావు, మద్దెల రవీందర్, కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ నాయకులు కళ్యాడపు ఆగయ్య, జాడిబాల్‌రెడ్డి, పుట్ట నరేందర్, దామెర సత్యం, చల్లోజి రాజు, గాజె రమేష్, కె.విజయేందర్‌రెడ్డి, తీట్ల ఈశ్వరి, దూలం రాధిక, అనసూర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
జాడలేని ఎల్ఈడీ
టవర్‌సర్కిల్: మున్సిపాలిటీలకు గుదిబండ గా మారిన విద్యుత్ చార్జీలను తగ్గించేం దుకు ప్రభుత్వం ప్ర వేశపెట్టాలని భావిం చిన ఎల్ఈడీ బల్బుల ప్రక్రియ అటకెక్కినట్లయింది. సెప్టెంబర్ తె లంగాణలోని 12 మున్సిపాలిటీలను ఎంపికచేసి ప్రయోగాత్మకంగా ఎల్ఈ డీ బల్బులను అమర్చాలని ఢిల్లీకి చెందిన ఈఈఎస్ఎల్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. కంపెనీయే ఎల్ఈడీ బల్బులను అమర్చుకొని పాత బల్బులు ఉన్నప్పుడు ఎంత బిల్లుచెల్లిస్తున్నారో అంత బిల్లులను మున్సిపాలిటీల నుంచి వసూలు చేసుకోవాలి. ఎల్ఈడీ బల్బులు అమర్చడం ద్వారా 50 శాతం విద్యుత్ ఆదా అవుతుందని, అంటే సగం విద్యుత్ బిల్లు మిగిలే అవకాశముంది. బిల్లులు చెల్లించగా మిగతా సొమ్మును బల్బులు అమర్చినందుకు కంపెనీకి జమచేసుకునే విధంగా ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టే పైలట్ ప్రాజెక్ట్‌లో జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు సిరిసిల్ల మున్సిపాలిటీని ఎంపిక చేశారు. ఈ ప్రక్రియం జరిగి మూడు నెలలు పూర్తవుతున్నా ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా ఎక్కడా ఎల్ఈడీ బల్బులు అమర్చిన దాఖలాలు లేవు. ఈఈఎస్ఎల్ కంపెనీ ప్రతినిధులు పలుమార్లు ఆయా మున్సిపాలిటీలలో పర్యటించినప్పటికీ ఎక్కడా బల్బులు అమర్చలేదు. దీంతో ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారింది. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దశలవారీగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఎల్ఈడీ బల్బులు అమర్చాలన్నది ప్రభుత్వం యోచన. కానీ ఈ ప్రక్రియకు ఆదిలోనే అవంతరాలు ఎదురవుతున్నాయి. ఎల్ఈడీ బల్బుల ఖర్చు ఎక్కువే... మున్సిపాలిటీలలో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు ప్రస్తుతం వాడుతున్న హైమాస్ట్ బల్బుల ధర కంటే రెండింతలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎల్ఈడీ బల్బును ఒకసారి బిగిస్తే పది సంవత్సరాల వరకు మన్నిక ఉంటుందని, ఎక్కువ ఖర్చుపెట్టి కొనుగోలు చేసినా నష్టం లేదనేది అధికారుల వాదన. అయితే బల్బుల ఏర్పాటుకు ఖర్చు ఎక్కువ కావడం, మున్సిపాలిటీల నుంచి వచ్చే విద్యుత్ బిల్లుల నుంచే తమను ఆదా చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో ఆ సంస్థ వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈఈఎస్ఎల్ కంపెనీ చెతులెత్తేసినట్టు తెలుస్తోంది. -
అటు విచారణ.. ఇటు భారీ నజరానా!
కరీంనగర్ క్రైం: కరీంనగర్ టవర్‌సర్కిల్‌లో బంగారు దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యాపారి కూతురు ఇంజనీరింగ్ చదువుతోంది. ఈ అమ్మాయిని ఓ వర్గం ముఠా ప్రేమ పేరుతో ట్రాఫ్ చేసింది. నగర శివారుకు తీసుకుని వెళ్లి మత్తుమందు కలిపి తాగించి,అసభ్యకరంగా వీడియో రికార్డ్ చేసింది. ఈ విషయం బయటకు చెబితే వీటిని సామాజిక వైబ్సైట్లలో పెడుతామని బెదిరించి ఆమె నుంచి డబ్బులు, సెల్ఫోన్లు లాంటివి తీసుకుంటున్నారని తెలిసింది.భగత్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న మహిళపై సదరు ముఠా కన్నుపడింది. పరిచయం పెంచుకుని ఒంటరిగా ఉన్న సమయంలో అమెను కూడా ఇలాగే వీడియో రికార్డు చేసి బేదిరింపుకుల గురిచేస్తున్నట్టు సమాచారం. రాంనగర్‌కు చెందిన ఓ తొమ్మిదో తరగతి చదవుతున్న బాలికను ఇదేవిధంగా ట్రాప్ చేశారని తెలిసింది. ఇలా కంటికి కనిపించిన వారిని ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం, అనంతరం వారిని అసభ్యకరంగా చిత్రించడం, లైంగికంగా, అర్థికంగా వేధింపులకు గురిచేయడం సదరు ముఠాకు నిత్యకృత్యంగా మారింది. అయితే సదరు బాధితులు బయటకు రావాడానికి కానీ, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కానీ జంకుతున్నారు. తాజాగా ఇలాంటిదే మరో రకమైన సంఘటన వెలుగుచూసింది. ధర్మారం మండలం పత్తిపాక గ్రామానికి చెందిన బూర మధుకర్(19) కరీంనగర్‌లోని గోదాంగడ్డలో నివాసం ఉంటూ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదవుతున్నాడు. ఈనెల 8వ తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎస్బీఎస్ ఫంక్షన్హాల్లో ఎదురు సందుకు రాగానే గుర్తుతెలియిన కొంతమంది వ్యక్తులు వచ్చి తమ వర్గం అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ఓ జెన్ కారులో తీసుకుని వెళ్లారు. అక్కడినుంచి కశ్మీర్‌గడ్డలోని ఐబీఎన్ గెస్ట్‌హౌస్‌లో తీవ్రంగా చితకబాదారు. అక్కడినుంచి నగరంలోని పలు ప్రాంతాలు తిప్పుతూ కొడుతూ మరోసారి తమ వర్గం అమ్మాయితో మాట్లాడితే చంపుతామని హెచ్చరించారు. గోదాంగడ్డ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి మరోసారి చితకబాది మధుకర్ వద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.500, ఏటీఎం తీసుకున్నారు. ఏటీఎం పిన్ నంబర్ కోసం మళ్లీ చితకబాదారు. పిన్ నంబర్ చెప్పడంతో వారు పోలీస్ హెడ్‌క్వార్టర్ పక్కనే ఉన్న అంధ్రాబ్యాంక్ ఏటీఎం నుంచి రూ.3000 డ్రా చేసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా పలుచోట్ల మధుకర్‌ను చితకబాది తెల్లపేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు. ఇప్పటికే నీలాంటి వాళ్లను ఎంతో మందిని చితకబాదామని, మరోసారి తమ వర్గం అమ్మాయితో మాట్లాడితే చంపుతామని బెదిరించి వెళ్లిపోయారని మధుకర్ ఈనెల 10వ తేదీన కరీంనగర్ టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులు 423/2014లో కేసు నమోదు చేశారు. దీనిపై ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు టుటౌన్ సీఐ హరిప్రసాద్ తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి మరి కొంతమంది బాధితులుగా మారకముందే ఈ ప్రమాదకమైన ముఠాలను కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.