గౌరవం పెరిగింది | Increased respect | Sakshi
Sakshi News home page

గౌరవం పెరిగింది

Published Sat, Mar 14 2015 3:11 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

Increased respect

టవర్‌సర్కిల్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పోరాటం ఫలించింది. తమ గౌరవ వేతనాలు పెంచాలంటూ కొన్నేళ్లుగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తున్న నేతలకు ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులకు సముచిత స్థానం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారి గౌరవ వేతనాలను భారీగా పెంచింది. వేతనాల పెంపును శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో స్థానిక ప్రజాప్రతినిధుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. ఈ పెంపుతో జిల్లాలో 2,520 మందికి ప్రయోజనం కలగనుంది.
 
 గ్రామ ప్రథమ పౌరులుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు గౌరవ వేతనం పెంచాలని సర్పంచులు రాజీలేని పోరాటం చేశారు. అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధమయ్యూరు. స్థానిక సంస్థల ‘గౌరవాన్ని’ పెంచుతామని కొద్ది రోజులుగా చెబుతున్న ప్రభుత్వం స్పందించి శుక్రవారం అసెంబ్లీలో వేతనాల పెంపును ప్రకటించింది. దీంతో జిల్లాలో 2,520 మందికి లబ్ధి చేకూరనుంది.
 
 జెడ్పీ చైర్‌పర్సన్, మేయర్, డెప్యూటీ మేయర్ తదితరుల వేతనాలను ఎవరూ ఊహించనంతగా పెంచారు. జెడ్పీ చైర్‌పర్సన్‌కు గతంలో నెలకు రూ.7500 గౌరవ వేతనం ఉండగా ప్రస్తుతం రూ.లక్షకు,కార్పొరేషన్ మేయర్లకు రూ.14 వేల నుంచి రూ.50 వేలకు, డెప్యూటీ మేయర్లకు రూ.8 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. మేయర్ల స్థారుులోనే విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ చైర్మన్లకు రూ.8 వేలు ఉండగా రూ.12 వేలకు, వైస్ చైర్మన్లకు రూ.3200 నుంచి 5 వేలకు అరకొరగా పెంచారు. జెడ్పీటీసీలకు రూ.2,250 నుంచి రూ.10 వేలు, ఎంపీపీలకు రూ.1500 నుంచి రూ.10 వేలుగా మెరుగైన వేతనాన్ని అమలు చేశారు.
 
 సర్పంచుల్లో నిరాశ
 గ్రామపంచాయతీల్లో సర్పంచులు మిగతా ప్రజాప్రతినిధుల కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. నిరక్షరాస్యులు, దినసరి కూలీలు, పనిభారం ఉన్న ప్రజలు గ్రామాల్లోనే ఎక్కువగా నివసిస్తుంటారు. వారంతా చిన్నాచితక పనులకు కూడా సర్పంచులపైనే ఆధారపడుతారు. అన్ని పనులు చేసే సర్పంచులకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఇన్నాళ్లు రూ.600 గౌరవ వేతనానికే పరిమితమైన సర్పంచులు తమ గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచాలని పోరాటం చేస్తున్నారు. వారు ఆశించిన  రీతిలో న్యాయం జరగలేదు. సర్పంచులకు రూ.600గా ఉన్న వేతనాన్ని రూ.5 వేలకు మాత్రమే పెంచడంతో నిరాశ చెందుతున్నారు. ఎంపీటీసీ సభ్యులకు రూ.750 ఉన్న వేతనాన్ని సైతం రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
 పెరిగిన వేతనాలు రూ.67.5 లక్షలు
 జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులకు పెరిగిన వేతనాల ప్రకారం రూ.67.5 లక్షలు అదనంగా అందనున్నాయి. గత వేతనాల ప్రకారం జిల్లాలో ప్రజాప్రతినిధులకు రూ.18.5 లక్షలుండగా, పెరిగిన వేతనాలతో రూ.86 లక్షలు అందనున్నారుు. వేతనాలు సుమారు నాలుగున్నర రేట్లు పెరిగినట్లయింది. వీటిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు.
 జిల్లాలో 2,520 మందికి ప్రయోజనం...
 పెరిగిన వేతనాలతో జిల్లాలోని 2,520 మంది ప్రజాప్రతినిధులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లా పరిషత్ సభ్యులు 57 మంది, మండల పరిషత్ సభ్యులు 817 మంది, గ్రామ పంచాయితీ సర్పంచులు 1207 మంది, పురపాలక సభ్యులు 326 మంది, కోఆప్షన్ సభ్యులు 113 మంది పెరిగిన వేతనాల లబ్ధి పొందనున్నారు.
 
 అవినీతిలేని అభివృద్ధి కోసం...
 కేసీఆర్ కలలు కన్న బంగారు తెలంగాణ సాధించుకునే క్రమంలో అవినీతి లేని అభివృద్ధి జరగాల్సి ఉంది. ప్రజాప్రతినిధులకు మెరుగైన గౌరవ వేతనాలు అందించి స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో భాగమే ఈ వేతనాల పెంపు. ప్రజాప్రతినిధులకు తీపి కబురు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
 - రవీందర్‌సింగ్, కరీంనగర్ మేయర్
 
 
 ఆత్మగౌరవం కావాలి
 గతంలో ఏనాడూ పెరగని వేతనాలను రూ.5 వేలకు పెంచడాన్ని హర్షిస్తున్నాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవ వేతనం గౌరవమైన రీతిలో ఉండాలని కోరుకుంటున్నాం. కేరళ తరహాలో రూ.10 వేలన్నా పెంచాల్సి ఉండే. వేతనాల కంటే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అధికారాలు ఇచ్చి, ఆత్మగౌరవం పెంచాలి.
 - అంజనీ ప్రసాద్, సర్పంచుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు, అన్నయ్యగౌడ్, అధ్యక్షుడు
 
 అరుదైన గౌరవం
 పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నాడనే దానికి నిదర్శనమే ఈ వేతనాల పెంపు. చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం కేసీఆర్ చేసి వేతనాలను భారీగా పెంచారు. మాపై మరింత బాధ్యత పెరిగింది. ప్రజాప్రతినిధులు సైతం జవాబుదారీగా ఉంటూ బంగారు తెలంగాణ దిశగా కృషిచేయాలి.
 - తుల ఉమ, జెడ్పీ చైర్‌పర్సన్
 
 సీఎంకు ధన్యవాదాలు
 ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచి న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఏ సీఎం చేయలేని సంచలన నిర్ణయూలు తీసుకుంటున్నారు. అభివృద్ధి తర్వాతే వేతనాలకు ప్రాధాన్యత అన్న ముఖ్యమంత్రి అన్నట్లుగానే వేతనాలు పెంచడం సంతోషంగా ఉంది.
 - కొంకటి లక్ష్మీనారాయణ, రామగుండం మేయర్
 
 సీఎం నిర్ణయం హర్షణీయం
 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను భారీగా పెంచిన సీఎం కేసీఆర్, మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు. వేతనాలు పెంచాలని జెడ్పీ సమావేశంలో తీర్మానం చేసి, సీఎంకు లేఖ ఇచ్చాం. ఇంత తొందరగా వేతనాలు పెంచుతారని అనుకోలేదు.
 - కందుల సంధ్యారాణి, జెడ్పీటీసీ, రామగుండం
 - కోల్‌సిటీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement