వంద రోజుల ఇందిరమ్మ రైతు బాట
ఈనెల 18 నుంచి డిసెంబర్ 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ
► టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వెల్లడి
► ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో నిర్ణయం
► భూ హక్కుదారులకు అండగా ఉంటామని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రైతులు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటూ, వారి హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వంద రోజుల పాటు ‘ఇందిరమ్మ రైతు బాట’పేరిట కార్యక్రమాలు చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం శుక్రవారం గాంధీభవన్‌లో ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది.
ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, టీపీసీసీ కార్యని ర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ దక్షిణ భారత కో ఆర్డినేటర్ జె.గీతారెడ్డి, టీపీసీసీ ఆఫీసు బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల చైర్పర్సన్లు పాల్గొన్నారు. సమావేశం వివరా లను ఉత్తమ్ మీడియాకు వివరించారు. ఇందిర మ్మ రైతు బాట పేరిట వరుసగా 100 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే ఇందిరమ్మ రైతు బాట.. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. అలాగే ఈనెల 18 నుంచి 22 వరకు పార్టీ క్రియాశీల కార్యకర్తలకు అవగాహన సభలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బూత్‌స్థాయి కమిటీల కన్వీనర్‌గా రామ్మోహన్ రెడ్డి
పోలింగ్ బూత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి, పర్యవేక్షించడానికి బూత్‌స్థాయి కమిటీల కన్వీనర్‌గా ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డిని నియమించారు. బూత్‌స్థాయిలో పీసీసీ కమిటీలను ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేపట్టడం తదితరాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని ఉత్తమ్ వెల్లడించారు. కమిటీలో ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, ఎన్.పద్మావతీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత సభ్యులుగా ఉంటారని తెలిపారు.
హత్యా రాజకీయాలను ప్రతిఘటిస్తాం
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఎర్రగుంట పల్లిలో శ్రీనివాస్ అలియాస్ బాబు అనే యువజన కాంగ్రెస్ కార్యకర్తను టీఆర్ఎస్ గూండాలు హత్య చేశారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ గూండా రాజకీయాలకు పాల్పడితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
రాజకీయ ప్రయోజనం కోసమే..
రైతు సమన్వయ సమితులతో గ్రామాల్లో టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తున్నదని ఉత్తమ్ విమర్శించారు. భూములు, హక్కుల చట్టాలకు సంబంధించి గ్రామానికి ఇద్దరు చొప్పున కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలకు అవగాహన కల్పిస్తామని, భూముల వివరాలు, భూ సమస్యలు, పరిష్కారాల గురించి చెబుతామని వివరించారు. రెవెన్యూ రికార్డుల సవరణలు, భూసర్వే, టీఆర్ఎస్ హామీ మేరకు దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు సంరక్షణ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు.
దళితలకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హుల నుంచి ఇంటింటికీ తిరిగి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు అందజేసి అర్హులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. డిసెంబరు 28న అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా పండుగ చేపడుతామన్నారు. నవంబర్ 19న ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇందిరమ్మ రైతు బాట పేరుతో నిర్వహిస్తున్నామని వివరించారు.