టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చ
సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్రాల్లోని పార్టీకి చెందిన ఆస్తులు, భవనాల నుంచి వస్తున్న ఆదాయం దుర్వినియోగమవుతోందని టీపీసీసీ అభిప్రాయపడింది. బుధవారం పాతబస్తీలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో పార్టీకి ఉన్న ఆస్తులు, వాటి నుంచి వస్తున్న ఆదాయం, వినియోగంపై టీపీసీసీ చర్చించింది. ఏఐసీసీ, టీపీసీసీ ముఖ్యులు ఆర్.సి.కుంతియా, కొప్పుల రాజు, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం వివరాలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మీడియాకు తెలి పారు. టీపీసీసీ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించినట్టుగా వెల్లడించారు. జిల్లాల్లోని భవనాలపై అద్దెలు సరిగా రావడంలేదని, వస్తున్న ఆదాయాన్ని వినియోగిస్తున్న తీరు కూడా సరిగా లేదని టీపీసీసీ కోశాధికారి ఇచ్చిన నివేదికపై చర్చించినట్టుగా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఉన్న ఆస్తులను సక్రమంగా వినియోగించుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు మల్లు రవి తెలిపారు.
ఒక్కో పోలింగ్ బూత్‌కు ఐదుగురు కార్యకర్తల చొప్పున ఓ జాబితాను ఏఐసీసీకి పంపిస్తామని, దీనికోసం నివేదికను త్వరలోనే తయారు చేస్తామని ఆయన తెలిపారు. అలాగే నెలరోజుల్లోగా కొత్త జిల్లాలకు, మండలాలకు అధ్యక్షులను నియమించాలని నిర్ణయించామన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తామన్నారు. మహబూబాబాద్‌లో రైతు గర్జనకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి హాజరవుతారని, నిజామాబాద్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ పాల్గొంటారని చెప్పారు.