చిన్న’చూపు
- ఆదాయం ఉన్నా అభివృద్ధి సున్నా
- కశింకోట రైల్వేస్టేషన్ దుస్థితి ఇది
- ఈసారి బడ్జెట్‌లోనూ లేని ప్రస్తావన
- సాధారణ స్టేషన్లను పట్టించుకోని ప్రభుత్వం
కశింకోట : ఎవరికీ పట్టని, అభివృద్ధికి నోచని రైల్వేస్టేషన్లలో కశింకోటది మొదటిస్థానమని చెప్పొచ్చు. బ్రిటీష్ వారి కాలంలో ఏర్పాటైన ఈ స్టేషన్ పరిస్థితిలో అప్పటికీ ఇప్పటికీ మార్పు అంటూ ఏమైనా ఉందంటే షెల్టర్ల ఏర్పాటు ఒక్కటే. చిన్నస్టేషన్లపట్ల రైల్వేశాఖ నిర్లక్ష్యానికి ఈ స్టేషన్ సజీవసాక్ష్యం. ఈసారి బడ్జెట్‌లోనైనా చిన్నస్టేషన్ల అభివృద్ధికి నిధులు మంజూరవుతాయని ఆశించిన స్థానికులకు నిరాశే మిగిలింది. కశింకోటలో 20 వేల జనాభా ఉంది. చుట్టుపక్కల సంపతిపురం, వెదురుపర్తి, తమ్మయ్యపేట తదితర గ్రామాల్లో ఐదు వేల జనాభా ఉంది. వీరందరికీ ఈ స్టేషనే ఆధారం.
రోజూ ఐదు నుంచి ఆరు వందల మంది ప్రయాణికులు అటు విజయనగరం, రాయగడ, ఇటు యలమంచిలి, తుని, అన్నవరం, రాజమండ్రి, విజయవాడ వంటి ప్రాంతాలకు రాకపోకలు జరుపుతారు. ఏటా రూ.8 లక్షల ఆదాయం సమకూరుతుంది. అయినా అధికారులకు చిన్నచూపే. టికెట్ల అమ్మకం కూడా ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. స్టేషన్‌లో ఎక్కువభాగం తుప్పలు పెరిగిపోయాయి. మరుగుదొడ్లు ఏళ్ల క్రితమే అవి మూలకు చేరాయి. మంచినీటి సదుపాయం లేదు. స్టేషన్‌లోని నాలుగ షెల్టర్లలో ఒకటి ధ్వంసమైంది. కొన్నిచోట్ల సిమెంటు బల్లలు విరిగిపోయాయి.
పాసింజర్లు మాత్రమే
కశింకోట స్టేషన్లో రోజూ ఎనిమిది పాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కొన్నయినా నిలపాలన్న స్థాని కుల డిమాండ్ పట్టించుకున్న వారు లేరు. విశాఖ-మచిలీపట్నం-విశాఖ మధ్య నడిచే ఫాస్ట్ పాసింజర్‌నైనా ఆపాలన్న స్థానికుల కోరిక నెరవేరలేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు అనకాపల్లి స్టేషన్‌కి వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తోంది.
రెలైక్కాలంటే పాట్లే
కశింకోట రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారం చాలా కిందికి ఉంటుంది. దీంతో రెలైక్కాలంటే పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఇక్కట్లే. సాధారణంగా ఈ స్టేషన్‌లో ఆగే రైళ్లు నిమిషాల వ్యవధిలోనే కదిలిపోతాయి. ఈ స్వల్ప సమయంలోనే రెలైక్కే హడావుడిలో ప్రమాదం బారిన పడిన వారు ఎందరో ఉన్నారు. ఇక్కడి పరిస్థితుల కారణంగా రెలైక్కలేమని భావిం చి చాలా మంది సమీపంలోని అనకాపల్లి వెళ్లిపోతుంటారు. ప్లాట్‌ఫారం సగం వరకే పలకలు వేశారు. మిగిలిన భాగాన్ని మట్టితో కప్పేశారు. దీనివల్ల వర్షం వస్తే బురదలో ప్రయాణికులు జారిపోతుంటారు. మామూలు రోజుల్లో గడ్డి పెరిగిపోయి విషపురుగుల సమస్య వేధిస్తోంది. దీంతో రాత్రిపూట వచ్చివెళ్లేవారు ఆందోళన చెందుతుంటారు.
ఫాస్ట్‌పాసింజర్ ఆపాలి
మచిలీపట్నం ఫాస్ట్‌పాసింజర్‌ను ఇక్కడ ఆపాలి. సదుపాయాలు మెరుగుపరచాలి. షెల్టర్లు లేక వర్షం వస్తే ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతం. తుప్పలతో స్టేషన్‌లో పరిస్థితి భయానకంగా ఉంది. అధికారులు చర్యలు చేపట్టాలి.
- కొత్తాడ విశ్వనాథ్, డైలీపాసింజర్స్ అసోసియేషన్
ప్లాట్‌ఫారాల ఎత్తుపెంచాలి
స్టేషన్ ప్లాట్‌ఫారాల ఎత్తు బాగా తక్కువ. కనీసం మూడడుగులకు పెంచాలి. కిందికి ఉండడం వల్ల పిల్లలు, వృద్దులు ఇబ్బంది పడుతున్నారు. మంచినీటి సదుపాయం కల్పించాలి. మరుగుదొడ్లు, ఇతరత్రా సౌకర్యాలు మెరుగుపర్చాలి.
- భమిడిపాటి కామేశ్వరరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు