*పుష్కరాల్లో రైల్వేకి ఊహించని ఎదురుదెబ్బ
* రూ.100 కోట్లు ఆశిస్తే.. వచ్చింది రూ.49 కోట్లు
* అన్‌రిజర్వ్‌డ్ రైళ్లతో చేయి కాల్చుకున్న వైనం
హైదరాబాద్: 'అనుకున్నదొకటి అయినది మరొకటి' అన్న చందంగా మారింది పుష్కరాల్లో రైల్వే శాఖ పనితీరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల మహా పుష్కరాలు ముగిసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో 12 రోజులపాటు ఇసుకేస్తే రాలనంత స్థాయిలో భక్తులు భారీగా పుష్కరఘాట్లకు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. దాదాపు 11 కోట్లమంది పుష్కరాలకు హాజరైనట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకూ కలిపి 823 ప్రత్యేక రైళ్లు నడిపి రూ.100 కోట్ల దాకా లాభాలు ఆర్జించాలని రైల్వే అధికారులు భావించారు. అనుకున్నట్లే అన్ని రైళ్లూ కిక్కిరిశాయి. తాజాగా లెక్కలు వేసిన అధికారులు ముక్కున వేలేసుకున్నారు. మొత్తం ఆదాయం రూ.49.10 కోట్లుగా తేల్చారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిపి ఉంటే ఈ మొత్తం రూ.100 కోట్లు దాటేదని ఉసూరుమంటూ నిట్టూర్చుతున్నారు.
ప్యాసింజర్ రైళ్లే కొంప ముంచాయి..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లతో రైల్వేశాఖ భారీ నష్టాలు చవి చూస్తోంది. టికెట్ ధరలు తక్కువగా ఉండటం, రైళ్ల నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో వాటితో చేయికాల్చుకుంటోంది. పుష్కరాల సందర్భంగా మొత్తం 823 ప్రత్యేక రైళ్లను నడిపినట్టు రైల్వే శాఖ పేర్కొంటోంది. ఇందులో 757 ప్యాసింజర్ రైళ్లే. కేవలం 66 మాత్రమే ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిపింది. సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జి రూ.65 ఉండగా.. అదే ప్యాసింజర్ రైలుకు కేవలం రూ.26 మాత్రమే. ఇలా అన్ని ప్రాంతాల ఛార్జీలు అంతే మొత్తంలో ఉండటంతో... రైళ్లు కిటకిటలాడినా ఆదాయం అంతంత మాత్రంగానే వచ్చింది.
వ్యయమే ఎక్కువ..
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పుష్కర క్షేత్రాలు దగ్గరగా ఉండటం, అన్ని ప్రాంతాలకు రైల్వే వసతి లేకపోవటంతో అతి తక్కువగా నడిపింది. మొత్తం 66 ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరిగితే 60 రైళ్లు రాజమండ్రికే పరుగుపెట్టాయి. తెలంగాణలో భద్రాచలం రోడ్ స్టేషన్‌కు మాత్రమే ఆరు ఎక్స్‌ప్రెస్‌రైళ్లు వచ్చాయి. ఇక 757 అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ రైళ్లు తిరిగితే అందులో తెలంగాణ పరిధిలో 356, ఏపీ పరిధిలో 401 రైళ్లు తిరిగాయి. వీటిద్వారా వచ్చిన ఆదాయంకంటే ఖర్చే ఎక్కువ ఉందని అధికారులు తేల్చారు. లాభాల కోసం కాకుండా కేవలం ప్రయాణికులకు ఇబ్బందులు కలగొద్దనే రైళ్లను నడిపామని, నష్టం ముందు ఊహించిందేనని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
అనుకున్నదొకటి.. అయినది మరొకటి!
Published Sat, Aug 1 2015 12:13 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement
Advertisement