గాంధీభవన్ లో టీపీసీసీ కార్యవర్గం భేటీ
హైదరాబాద్: గాంధీ భవన్ లో మంగళవారం టీపీసీసీ కార్యవర్గం సమావేశమైంది. ఎన్నికల హామీల అమలు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5,6,7 తేదీల్లో రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలనకు టీకాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లు, తహశీల్దార్లకు వినతి పత్రాలు అందజేయనున్నారు. అదేవిధంగా ఈ నెల 13 నుంచి 18 వరకు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రజలకు దరఖాస్తులు పంపిణీ చేయనున్నారు.
అనంతరం 21 నుంచి 31 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని సీఎం, గవర్నర్, రాష్ట్రపతి కి సమర్పించాలని కార్యవర్గ భేటీలో నేతలు నిర్ణయించినట్టు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ 19 న నిర్వహించే రాజీవ్ సద్భావ స్మారక కార్యక్రమానికి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టు ఉత్తమ్ తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను నిర్లక్ష్యం చేస్తూ.. విద్యావ్యవస్థను ప్రభుత్వం కుప్పకూలుస్తోందని మండిపడ్డారు. రుణమాఫీ వల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్నారు. రుణమాఫీ కాక, పంట భీమీ అందక వ్యవసాయ సంక్షోభం తలెత్తిందన్నారు.