ఫ్యాన్సీ సూత్రం
ఫ్యాషన్ వరల్డ్‌లో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్స్ వస్తుంటాయి.. పోతుంటాయి. తరాలు మారినా.. కాలాలు మారినా.. ఈ ట్రెడిషనల్ జ్యువెలరీ మాత్రం ఎప్పుడూ ఫ్రెష్‌గానే ఉంటుంది. దీని ప్రస్తావన లేకుండా పెళ్లికి ముందు జరిగే మాటాముచ్చట్లకు పరిపూర్ణత రాదు. ఈ నల్లపూసల హారానికి.. మాంగల్యబలాన్ని మరింత పెంచుతుందన్న క్రెడిట్ కూడా ఉంది. అందుకే బోషాణంలో బోలెడన్ని నగలున్నా.. మగువలు మాత్రం నల్లపూసల తర్వాతే మిగతావంటారు. నయా ఫ్యాషన్ వాకిట నిలిచిన ముదితలు.. పుస్తెల తాడు ప్లేస్‌ను కూడా నల్లపూసలతోనే భర్తీ చేస్తున్నారు.
పెళ్లయిన ప్రతి అమ్మాయికి లీగల్ లెసైన్స్ మంగళసూత్రమే. పుస్తెలతాడు కనిపిస్తే చాలు ఆ పడతికి పతి ఉన్నాడని తెలిసిపోతుంది. అయితే కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతున్న ఈ తరం భార్యామణులు మంగళసూత్రాలకు బదులు నల్లపూసలు వేసుకుంటున్నారు. గతంలో ఏ పేరంటానికి వెళ్లినా.. హెవీ పట్టుచీరలు.. వాటిపైన లాంగ్ చైన్, చంద్రహారం, కాసుల పేరు, రవ్వల నెక్లెస్.. ఇలా స్వర్ణ కాంతులతో మెరిసిపోయేవారు. ఆ రోజులకు చెక్‌పెడుతూ.. సింపుల్‌గా ఉండే సూపర్బ్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సంప్రదాయానికి కాస్త కలరింగ్ ఇచ్చి బ్లాక్ బీడ్‌స చెయిన్‌తో లాగించేస్తున్నారు.
వెరైటీ బీట్స్
కొత్తగా హల్చల్ చేస్తున్న బ్లాక్ బీడ్‌స ఫ్యాషన్‌కు వేలాది ఇన్నోవేటివ్ డిజైన్లతో మరింత ఊపునిస్తున్నారు జ్యువెలరీ డిజైనర్లు. పచ్చలు, కెంపులు, కలర్ బీడ్‌స, ముత్యాలు, రత్నాలు, పగడాలు, సీ జేడ్స్ ఇలా వెరైటీలు జత చేసిన బ్లాక్ బీడ్‌స చెయిన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఫంక్షనల్ వేరింగ్ కోసమే కాదు.. ఉద్యోగాలకు వెళ్లే అతివలకు నప్పే విధంగా క్లోస్డ్ నెక్ బ్లాక్ బీడ్‌స, రో బీడ్‌స, గసగసాల నల్లపూసలు, స్నేక్ స్కిన్ బ్లాక్ బీడ్‌స ఇలా రకరకాలుగా అందుబాటులో ఉన్నాయి.
చెయిన్ సైజ్‌ను బట్టి లాకెట్లు ప్రిఫర్ చేస్తున్నారు మహిళలు. టెంపుల్ లాకెట్, డ్రాప్ లాకెట్, నేచురల్ స్టోన్ లాకెట్ ఇలా రకరకాలుగా దొరుకుతున్నాయి. నయా ట్రెండ్‌కు సలామ్ కొడుతున్న వనితలు.. లాకర్ల నిండా బంగారు ఆభరణాలు ఉన్నా.. గోల్డ్, ప్లాటినం కలగలిపిన నల్ల పూసలు ఒక్కటే వేసుకుని వెళ్లిపోతున్నారు. ఏజ్‌తో సంబంధం లేకుండా నల్లపూసల వెరైటీస్‌తో ముస్తాబవుతున్నారు.
సింప్లీ సూపర్బ్..
ఈ తరహా బ్లాక్ బీడ్‌స చెయిన్లు ఈ మధ్య ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ప్లాటినం, గోల్డ్‌లోనే కాదు సెమీప్రీషియస్ జ్యువెలరీలో కూడా అనేక డిజైన్లు దొరుకుతున్నాయి. సింపుల్ బీడ్‌స ఉన్న షార్ట్ నల్లపూసల చెయిన్ల ధర వెయ్యి రూపాయల లోపే ఉంటుంది. మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బ్లాక్ బీడ్‌స చెయిన్ అయితే ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటాయి. అయితే బ్లాక్ బీడ్‌స కలర్ షేడ్ కాకుండా ఉండాలంటే.. పర్ఫ్యూమ్, డియోస్ వాటిపై పడకుండా చూసుకోవాలి. వాటిని ప్లాస్టిక్ కవర్లో గానీ, కాటన్ బాక్స్‌లో కానీ జాగ్రత్త చేస్తే ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
- శ్రీకాంత్ సంధి రెడ్డి, కుందన జ్యువెలరీ