traffic asi
-
మతి స్థిమితం లేని మహిళపై.. ట్రాఫిక్ ఏఎస్ఐ అమానుషం
సాక్షి, బనశంకరి (కర్ణాటక): మతి స్థిమితం లేని మహిళపై కనికరం లేకుండా దౌర్జన్యం చేసిన హలసూరు ట్రాఫిక్ ఏఎస్ఐ ఆర్.నారాయణ్‌ను నగర పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ సస్పెండ్ చేశారు. నారాయణ్ దాడిపై అన్నివైపులా నుంచి ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో కమిషనర్ చర్యలు తీసుకోక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఏఎస్ఐ నారాయణ్ టోయింగ్ వాహనంలో ఉండగా మతిస్థిమితం లేకుండా రోడ్డుపై అనాథగా తిరుగుతున్న మంజుల అనే మహిళ రాయి విసిరింది. అది తగిలి ఏఎస్ఐకి ముఖం మీద రక్తం కారింది. వెంటనే వాహనం నుంచి దిగిన ఏఎస్ఐ ఆ మహిళను అసభ్యంగా దూషిస్తూ ఇష్టానుసారం కొట్టాడు. కొట్టొద్దు అని ఆమె అతని కాళ్లపై పడితే బూటుకాళ్లతో తన్నాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణమంతా కొందరు వీడియోలు తీయడంతో సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో వైరల్ అయ్యింది. ఎందుకనో ఆ మహిళకు టోయింగ్ చేయడం కనబడితే సహించలేకపోతున్నట్లు తెలిసింది. ఎక్కడైనా టోయింగ్ చేస్తుంటే అడ్డుకునేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఎస్జే.పార్కు పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు. విచారణ చేయిస్తాం: హోంమంత్రి ట్రాఫిక్ ఏఎస్ఐ దౌర్జన్యంపై హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విచారణకు ఆదేశించారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు, దీనికి పోలీసులు మినహాయింపు కాదన్నారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులూ హద్దులు దాటొద్దు: సీఎం శివాజీనగర: టోయింగ్ వ్యవస్థను పునర్ పరిశీలిస్తామని, కాపాడాల్సిన వారే హద్దులు దాటి ప్రవర్తిస్తే తాను సహించనని సీఎం బసవరాజ బొమ్మై హెచ్చరించారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా విధానసౌధ ఆవరణలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. ట్రాఫిక్ ఏఎస్ఐ ఉదంతాన్ని గమనించానని, ప్రజలతో చట్టబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. పోలీస్ వ్యవస్థపై సోమవారం డీజీపీ, పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమావేశమై ప్రజలతో సత్సంబంధాలతో ప్రవర్తించేలా తీర్మానాలు చేస్తానన్నారు. -
స్టేషన్‌కు వెళ్లి మరీ ట్రాఫిక్ ఎస్సైపై దాడి.. కత్తితో కడుపులో..
భోపాల్: భోపాల్‌లో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసును కత్తితో కడుపులో పొడిచాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ‘‘నిందితుడు హర్ష్ మీనా శనివారం జ్యోతి టాకీస్‌కు వెళ్లాడు. అక్కడ అతను తన బైక్‌ను నో పార్కింగ్ జోన్లో పార్క్ చేశాడు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ దూబే, నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసిన వాహనాలను పోలీసు క్రేన్ సహాయంతో ఎత్తి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే సమాచారం అందుకున్న హర్ష్ మీనా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. జరిమానా డబ్బులు రూ.600 చెల్లించడానికి ఇంటికి వెళ్లి వచ్చి డిపాజిట్ చేశాడు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ వద్ద క్రేన్ దగ్గర నిలబడి ఉన్న ఎస్ఐ శ్రీరామ్ దూబేని నిందితుడు చూశాడు. అతడి దగ్గరకు వెళ్లి ఎస్ఐను కత్తితో కడుపులో పొడిచాడు. కాగా నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. క్రేన్ దగ్గర ఉన్న వ్యక్తులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే జరిమానా డిపాజిట్ చేసిన తర్వాత నిందితుడు ట్రాఫిక్ పోలీసును పై కత్తితో ఎందుకు దాడి చేశాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అంతే కాకుండా విచారణ సమయంలో నిందితుడు పలు రకాల సమాధానాలు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు స్టేషన్లో సైకో లాగా ప్రవర్తించాడని, పెద్దగా నవ్వడం, అరవడం వంటివి చేశాడని పోలీసులు తెలిపారు. కాగా ఎస్ఐ దుబేను చికిత్స కోసం జేపీ ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్సీ రాజేష్ భదౌరియా తెలిపారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఎస్ఐని డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. -
ట్రాఫిక్ ఏఎస్సైపై డిప్యూటీ మేయర్ దాడి
నిజామాబాద్: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఏఎస్సైపై నిజామాబాద్ నగర డిప్యూటీ మేయర్ దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు డిప్యూటీ మేయర్ ఫయిమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో నాగం రవీందర్ తెలిపిన వివరాలివీ.. నగర ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా నగర డిప్యూటీ మేయర్ ఫయీం కుమారుడు బషీర్ అదునన్, అతని స్నేహితుడు బైక్‌పై అటువైపు వచ్చారు. ట్రాఫిక్ ఏఎసై శ్యాంకుమార్ వారిని ఆపి బైక్ కాగితాలను చూపించాలని అడిగారు. దానికి వారు అది డిప్యూటీ మేయర్‌కు సంబంధించి బైక్ అని బదులిచ్చారు. అయినా సరే కాగితాలు చూపించాలని అనటంతో వారు గొడవకు దిగారు. ఆయన్ను దూషించారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్సైలు నరేష్, టాటాబాబు సముదాయించినా ఆగలేదు. బైక్‌కు నంబర్, టీఆర్ రిజిస్ట్రేషన్ లేక పోవటంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న డిప్యూటీ మేయర్ ఆగ్రహంతో ఏఎస్సై శ్యాంకుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. ఏఎసై షర్ట్ పట్టుకుని పక్కకు నెట్టివేయటంతో బటన్ ఊడింది. ట్రాఫిక్ ఎస్సైలు డిప్యూటీ మేయర్‌ను సముదాయించగా వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బైక్‌పై వచ్చిన వారిని తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. అనంతరం ఏఎసై శ్యాంకుమార్ ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్‌హెచ్‌వో రవీందర్‌కు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ మేయర్‌పై సెక్షన్ 353, బైక్‌పై వచ్చిన వారిపై రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.