ఇక కీలక ఘట్టమే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల వివరాలివే!
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శుక్రవారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. దీనికి భారీ ఊరేగింపు సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సిటీలోని మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తర్వాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు.
నిమజ్జనానికి వచ్చే ప్రజలు వీలున్నంత వరకు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. నగరంలోని దాదాపు 30 గంటల పాటు ప్రైవేట్ బస్సులు, లారీలు (గణేషులని తెచ్చేవి మినహా), ఇతర భారీ వాహనాలకు అనుమతి ఉండదు. ఆంక్షలు, మళ్లింపులు నేపథ్యంలో అత్యవసర వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ వాహనాలు ఆంక్షలు మార్గంలో ఇటు–అటు మారడానికి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వద్ద అవకాశం కల్పిస్తున్నారు.
ప్రధాన ఊరేగింపు మార్గం
►కేశవగిరి–నాగుల్చింత–ఫలక్‌నుమా–చార్మినార్–మదీనా–అఫ్జల్‌గంజ్–ఎంజే మార్కెట్–అబిడ్స్–బషీర్‌బాగ్–లిబర్టీ–ఎన్టీఆర్ (పీవీఎన్ఆర్) మార్గ్
సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేది..
►ఆర్పీ రోడ్–ఎంజీ రోడ్–కర్బాలామైదాన్–ముషీరాబాద్ చౌరస్తా–ఆర్టీసీ క్రాస్‌రోడ్స్– నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్–హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది.
చదవండి: (Hyderabad: సెప్టెంబర్ గండం.. గ్రేటర్ వాసుల వెన్నులో వణుకు)
ఈస్ట్‌జోన్ నుంచి వచ్చేది..
►ఉప్పల్–రామాంతపూర్–అంబర్పేట్–ఓయూ ఎన్సీసీ–డీడీ హాస్పిటల్ల మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్ దాంతో కలుస్తుంది.
►వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి.
►నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం.
►వెస్ట్–ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్ వద్దే అవకాశం ఉంటుంది.
►వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్ రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
కి.మీ పరిధిలో సందర్శకులకు పార్కింగ్..
హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం కి.మీ పరిధిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు.
అవి.. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, లోయర్ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకోవాలి.
హెల్ప్లైన్ల ఏర్పాటు:
ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 94905 98985, 90102 03626లను సంప్రదించవచ్చు.
ఇంత రాద్ధాంతమా: తలసాని
కవాడిగూడ: వినాయక నిమజ్జనంపై కొన్ని శక్తులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ర్యాలీలు, దీక్షలు చేయాల్సిన అవసరం ఏముందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. బుధవారం ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో వినాయక చవితి ఏర్పాట్లు జరగలేదన్నారు. ప్రజలను కొందరు గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు మండపాల నిర్వాహకులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు.
ట్యాంక్‌బండ్‌పై క్రేన్ల ఏర్పాటు
ఎట్టకేలకు ఈసారి సైతం హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జరగనున్నాయని తెలుస్తోంది. నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దాదాపు వారం రోజులుగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, బీజేపీ నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం లేదని, ఓ దశలో తామే చేస్తామని చెప్పడంతో ప్రభుత్వం తరపునే అన్నీ నిర్వహిస్తామని మంత్రి తలసాని పేర్కొనడం తెలిసిందే. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి సైతం ఎన్టీఆర్ మార్గ్‌వైపు 9 క్రేన్లు, ట్యాంక్‌బండ్‌పై 16 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. వీటితోపాటు పీపుల్స్‌ప్లాజా దగ్గర రెండు బేబిపాండ్లు, ట్యాంక్‌బండ్ చిల్డ్రన్స్పార్కువద్ద 3 బేబిపాండ్లలో నిమజ్జనాలు జరగనున్నాయి.
ఫ్లైఓవర్లు బంద్
వినాయక నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఫ్లైఓవర్లన్నింటినీ మూసివేస్తారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు నిమజ్జనం పూర్తయ్యే వరకూ నిమజ్జనం జరిగే చెరువులు, ట్యాంక్‌లు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. పలుచోట్ల ట్రాఫిక్, మళ్లింపులు ఉంటాయన్నారు. అత్యవసర సహాయం కోసం 040–23002424, 85004 11111లను సంప్రదించవచ్చు.
ఏర్పాట్లు ముమ్మరం
రేపటి గణేశ్ విగ్రహాల నిమజ్జనాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు 74 కోనేర్లలో నిమజ్జనాలు జరగనున్నాయి. బాలాపూర్ నుంచి శోభాయాత్ర పొడవునా 303 కి.మీ మేర ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా జీహెచ్ఎంసీతోపాటు వివిధ విభాగాలు ఏర్పాట్లు చేశాయి. 303.30 కి.మీ మేర శోభాయాత్ర సాగనుంది.