Trailblazers
-
WTC 2022: విజృంభించిన పూజ.. స్మృతి టీమ్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన
పుణే: అమ్మాయిల మెరుపుల క్రికెట్ టోర్నీ ‘టి20 చాలెంజ్’లో సూపర్ నోవాస్ శుభారంభం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ 49 పరుగుల తేడాతో స్మృతి కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ ట్రయల్ బ్లేజర్స్ జట్టుపై జయభేరి మోగించింది. తొలుత సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించగా, హర్లీన్ (19 బంతుల్లో 35; 5 ఫోర్లు), డాటిన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. బ్లేజర్స్ స్పిన్నర్లు హేలీ మాథ్యూస్ 3, సల్మా ఖాటున్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులకే పరిమితమైంది. స్మృతి మంధాన (23 బంతుల్లో 34; 4 ఫోర్లు) ఆరంభంలో వేగంగా ఆడింది. అయితే పేసర్ పూజ వస్త్రకర్ (4/12) వైవిధ్యమైన బంతులతో ట్రయల్ బ్లేజర్స్‌ను దెబ్బ తీసింది. ఒకదశలో 7 ఓవర్లలో 63/1 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న బ్లేజర్స్ అనూహ్యంగా 10 పరుగుల వ్యవధిలోనే ఏకంగా 6 వికెట్లను కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. ఇదే వేదికపై నేడు మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరిగే మ్యాచ్‌లో సూపర్ నోవాస్‌తో వెలాసిటీ జట్టు తలపడుతుంది. -
చాంపియన్ ట్రయల్ బ్లేజర్స్
షార్జా: మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్లో కొత్త చాంపియన్ అవతరించింది. ఇప్పటికే రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకున్న డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్‌ను ఓడించి ట్రయల్ బ్లేజర్స్ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ 16 పరుగులతో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. స్మృతి మంధాన (49 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు ఆమాత్రం స్కోరు సాధించగలిగింది. నోవాస్ బౌలర్ రాధా యాదవ్ మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించింది. అనంతరం సల్మా ఖాతూన్ (3/18), దీప్తి శర్మ (2/9)ల ధాటికి సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మ¯న్‌ప్రీత్ కౌర్ (36 బంతుల్లో 30; 2 ఫోర్లు), శశికళ సిరివర్ధనే (18 బంతుల్లో 19; 1 ఫోర్) రాణించారు. విజేతగా నిలిచిన ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. కెప్టెన్ మెరుపులు... టైటిల్‌పై గురిపెట్టిన స్మృతి దూకుడే మంత్రంగా చెలరేగింది. అనుజా బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6తో తన ఉద్దేశాన్ని చాటింది. డాటిన్ (32 బంతుల్లో 20; 1 ఫోర్) రాణించడంతో పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులు సాధించింది. తర్వాత నోవాస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగుల వేగం తగ్గింది. డాటిన్‌ను అవుట్ చేసిన పూనమ్ యాదవ్ ఓవర్లోనే వరుసగా 4, 6తో స్మృతి జోరు పెంచింది. ఈ క్రమంలో 38 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుది. జట్టు స్కోరు 101 వద్ద స్మృతి రెండో వికెట్‌గా వెనుదిరిగింది. రాధ మాయాజాలం... డెత్ ఓవర్లలో రాధ కొట్టిన దెబ్బకి బ్లేజర్స్ ఇన్నింగ్స్ కకావిలకమైంది. 18వ ఓవర్లో బంతినందుకున్న ఆమె... దీప్తి శర్మ (9), రిచా ఘోష్ (10)లను డగౌట్ చేర్చి భారీ స్కోరుకు కళ్లెం వేసింది. ఇక చివరి ఓవర్లోనైతే ఏకంగా 3 వికెట్లతో విజృంభించింది. తొలి బంతికి ఎకెల్‌స్టోన్ (1), నాలుగో బంతికి హర్లీన్ (4), ఐదో బంతికి జులన్ గోస్వామి (1) వికెట్లను పడగొట్టి కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చింది. చివరి బంతికి చాంథమ్ (0) రనౌట్‌గా వెనుదిరగడంతో ఆ వికెట్ ఆమె ఖాతాలో చేరలేదు. ఈ దెబ్బకి చివరి ఐదు ఓవర్లలో నోవాస్ కేవలం 17 పరుగులే చేయగలిగింది. అతి జాగ్రత్తతో... ఆరంభంలోనే నోవాస్‌కు షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న చమరి ఆటపట్టు (6) వికెట్‌ను రివ్యూ కోరి బ్లేజర్స్ దక్కించుకుంది. దీంతో అతి జాగ్రత్తకు పోయిన నోవాస్ పవర్‌ప్లేలో 28 పరుగులే చేసింది. తానియా (14), జెమీమా (13) విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడింది. శశికళ (19)తో కలిసి నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించి మ్యాచ్‌పై ఆశలు రేపింది. విజయానికి 12 బంతుల్లో28 పరుగులు చేయాల్సి ఉండగా... రెండు పరుగుల వ్యవధిలో అనుజా, హర్మన్, పూజలను పెవిలియన్ చేర్చి సల్మా ఖాతూన్ నోవాస్ నుంచి టైటిల్‌ను లాగేసుకుంది. -
సగర్వంగా ఫైనల్‌కు..
షార్జా: డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్ అనుకున్నది సాధించింది. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని మహిళల టి20 చాలెంజ్ టోరీ్నలో ఫైనల్ బెర్తును ఒడిసి పట్టింది. గెలుపు... ట్రయల్ బ్లేజర్స్వైపు మొగ్గుతోన్న దశలో రాధా యాదవ్ (2/30) అద్భుత బౌలింగ్‌తో సూపర్ నోవాస్‌ను 2 పరుగులతో గెలిపించింది. బ్లేజర్స్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా... రాధ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ను దక్కించుకుంది. దీంతో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్‌కు ఓటమి తప్పలేదు. మూడు జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు ముగిశాక మూడు జట్లూ ఒక్కో విజయంతో రెండు పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్ బ్లేజర్స్ (+2.109), హర్మన్‌ప్రీత్ కెపె్టన్సీలోని సూపర్ నోవాస్ (–0.054) జట్లు ఫైనల్లోకి ప్రవేశించగా... హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తున్న వెలాసిటీ (–1.869) జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. సోమవారం జరిగే ఫైనల్లో ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ అమీతుమీ తేల్చుకుంటాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చమరి ఆటపట్టు జయాంగని (48 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రయల్ బ్లేజర్స్ జట్టు 20 ఓవర్లు ఆడి 5 వికెట్లకు 144 పరుగులు చేసి ఓడిపోయింది. దీప్తి శర్మ (43 నాటౌట్) రాణించినా జట్టును గెలిపించలేకపోయింది. -
గెలిస్తేనే ఫైనల్లోకి...
షార్జా: అదిరే ఆరంభం... ఆపై నిరాశజనక ప్రదర్శన... తొలి రెండు మ్యాచ్‌ల్లో మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నీ సాగిన తీరిది. కరోనా విరామం తర్వాత భారత మహిళలు తలపడుతోన్న ఈ టోర్నీలో ఊహకందని ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్... అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ట్రయల్ బ్లేజర్స్‌ను నేడు ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది దర్జాగా ఫైనల్‌కు చేరేందుకు స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ పక్కాగా సిద్ధమైంది. లీగ్‌లో నిలవాలంటే గెలవడం తప్ప సూపర్ నోవాస్‌కు మరో దారి లేదు. ఈ మ్యాచ్‌లో గెలుపొందితే నెట్ రన్‌రేట్ సహాయంతో వెలాసిటీ (–1.869) జట్టును వెనక్కి నెట్టి సూపర్ నోవాస్ (–0.204) ఫైనల్‌కు చేరే అవకాశముంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం పట్టుదలగా ఉంది. చమరి ఆటపట్టు, జెమీమా రోడ్రిగ్స్ సహాయంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించాలని యోచిస్తుంది. మరోవైపు ట్రయల్ బ్లేజర్స్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై సోఫీతో పాటు రాజేశ్వరీ గైక్వాడ్‌ను తట్టుకొని నిలిస్తే సూపర్ నోవాస్ విజయం కష్టమేమీ కాదు. ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరుగనుంది. బ్యాటర్లు సత్తా చాటిన జట్టునే విజయం వరించడం ఖాయం. -
వెలాసిటీ 47 పరుగులకే సరి!
షార్జా: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో నిరాశాజనక ప్రదర్శన! పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో టోర్నీ రెండో లీగ్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్ 9 వికెట్ల తేడాతో వెలాసిటీని చిత్తుచేసింది. స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ ముందు మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ నిలబడలేకపోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వెలాసిటీ జట్టును టి20 ప్రపంచ నంబర్‌వన్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ ఎకెల్‌స్టోన్ (3.1–1–9–4) బెంబేలెత్తించింది. ఆమె ధాటికి వెలాసిటీ 15.1 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. షఫాలీ వర్మ (9 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్. జులన్ గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్మృతి మంధాన (6) తొందరగా అవుటైనా... డియాండ్రా డాటిన్ (28 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు), రిచా ఘోష్ (10 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి జట్టును గెలిపించారు. బ్లేజర్స్ 7.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి 49 పరుగులు చేసింది. శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్‌తో సూపర్ నోవాస్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బ్లేజర్ గెలిస్తే ఆ జట్టుతో పాటు వెలాసిటీ ఫైనల్ చేరుతుంది. నోవాస్ గెలిస్తే మూడు జట్లూ ఒక్కో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్ ఆధారంగా ఫైనల్ చేరేదెవరో తేలుతుంది. సమష్టి వైఫల్యం... తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన వెలాసిటీ జట్టుకు ఈ మ్యాచ్‌లో ఊహించని రీతిలో షాక్ తగిలింది. మొదట సాధారణంగానే మొదలైన ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. మూడో ఓవర్లో షఫాలీ వర్మను చక్కటి బంతితో జులన్ అవుట్ చేయడంత వెలాసిటీ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎకెల్‌స్టోన్ దెబ్బకి వెలాసిటీ జట్టు విలవిల్లాడింది. వరుస బంతుల్లో మిథాలీరాజ్ (1), వేద కృష్ణమూర్తి (0)లను ఆమె పెవిలియన్ చేర్చింది. కాసేటికే సుష్మ వర్మ (1)ను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బతీసింది. అంతకుముందే వెలాసిటీ... డేనీ వ్యాట్ (3) వికెట్‌ను కూడా కోల్పోయింది. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికే 22/5తో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాజేశ్వరీ గైక్వాడ్ చెలరేగడంతో గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన సునె లూస్ (4), దివ్యదర్శిని (0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. 10 ఓవర్లకు జట్టు స్కోరు 27/7. తర్వాత మరో ఐదు ఓవర్ల ఆట జరిగినా కేవలం 20 పరుగులు మాత్రమే జోడించగలిగింది. అనంతరం అతి స్వల్ప లక్ష్యఛేదనను ట్రయల్ బ్లేజర్స్ సులువుగానే ఛేదించింది. కెప్టెన్ స్మృతి మంధాన నాలుగో ఓవర్లో వెనుదిరిగినా... ఏమాత్రం తడబడకుండా రిచా ఘోష్, డాటిన్ పని పూర్తి చేశారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 24 బంతుల్లో అభేద్యంగా 370 పరుగులు జోడించారు. ఎనిమిదో ఓవర్ తొలి బంతికి సిక్సర్‌తో రిచా మ్యాచ్‌ను ముగించింది.