పుణే: అమ్మాయిల మెరుపుల క్రికెట్ టోర్నీ ‘టి20 చాలెంజ్’లో సూపర్ నోవాస్ శుభారంభం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ 49 పరుగుల తేడాతో స్మృతి కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ ట్రయల్ బ్లేజర్స్ జట్టుపై జయభేరి మోగించింది. తొలుత సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించగా, హర్లీన్ (19 బంతుల్లో 35; 5 ఫోర్లు), డాటిన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. బ్లేజర్స్ స్పిన్నర్లు హేలీ మాథ్యూస్ 3, సల్మా ఖాటున్ 2 వికెట్లు తీశారు.
అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులకే పరిమితమైంది. స్మృతి మంధాన (23 బంతుల్లో 34; 4 ఫోర్లు) ఆరంభంలో వేగంగా ఆడింది. అయితే పేసర్ పూజ వస్త్రకర్ (4/12) వైవిధ్యమైన బంతులతో ట్రయల్ బ్లేజర్స్‌ను దెబ్బ తీసింది. ఒకదశలో 7 ఓవర్లలో 63/1 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న బ్లేజర్స్ అనూహ్యంగా 10 పరుగుల వ్యవధిలోనే ఏకంగా 6 వికెట్లను కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. ఇదే వేదికపై నేడు మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరిగే మ్యాచ్‌లో సూపర్ నోవాస్‌తో వెలాసిటీ జట్టు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment