ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకు అపార గౌరవం ఉందని భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ తెలిపింది. బీజేపీ నేతలను ఉద్దేశించి తన అకౌంట్ నుంచి అభ్యంతరకర పోస్టు ఎలా వెళ్లిందో తెలియదని.. అప్పుడు తన ఫోన్ తన ఆధీనంలో లేదని స్పష్టం చేసింది.
ఏదేమైనా తెలియకుండానే చాలా మంది హృదయాలను గాయపరిచానని.. ఇందుకు చింతిస్తున్నట్లు పూజా పేర్కొంది. ప్రధాని మోదీకి క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా టీమిండియా ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ ఇన్‌స్టా స్టోరీలో ‘వసూలీ టైటాన్స్’ పేరిట ప్రధాని మోదీతో పాటు బీజేపీ కీలక నేతలు, కేంద్ర మంత్రుల మార్ఫింగ్ ఫొటో ప్రత్యక్షమైంది. శుక్రవారం నాటి పోస్టు నెట్టింట వైరల్‌కాగా వివాదానికి దారితీసింది.
ఈ క్రమంలో ఈ విషయంపై స్పందించిన పూజా వస్త్రాకర్.. ‘‘నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అత్యంత అభ్యంతరకరమైన ఫొటో పోస్ట్ అయినట్లు నా దృష్టికి వచ్చింది. నిజానికి ఆ సమయంలో ఫోన్ నా దగ్గర లేదు.
ప్రధాన మంత్రి పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. తెలిసో తెలియకో నా వల్ల కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నాను’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల పూజా వస్త్రాకర్ టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్.
భారత్ తరఫున 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆమె.. ఇప్పటి వరకు నాలుగు టెస్టులు, 30 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడింది. టెస్టుల్లో 14, వన్డేల్లో 23, టీ20లలో 40 వికెట్లు తీసింది. వన్డేల్లో నాలుగు అర్ధ శతకాలు కూడా సాధించింది.
టెస్టుల్లో 47, టీ20లలో 37* పూజా అత్యధిక స్కోర్లు. ఇక ఇటీవల ముగిసిన వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన పూజా వస్త్రాకర్ నిరాశపరిచింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి ఈ రైటార్మ్ పేసర్ కేవలం ఐదు వికెట్లు తీసింది.
Comments
Please login to add a commentAdd a comment